పారాలో పతక మోత

Medallion in Para– అవని లేఖర పసిడి గురి
– మనీశ్‌ నర్వాల్‌కు సిల్వర్‌
– మోన, ప్రీతి పాల్‌లకు కాంస్యాలు
– పారిస్‌ 2024 పారాలింపిక్స్‌
పారిస్‌ పారాలింపిక్స్‌ను టీమ్‌ ఇండియా ఘనంగా మొదలెట్టింది. స్టార్‌ షఉటర్‌ అవని లేఖర పారాలింపిక్స్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. పారాలింపిక్స్‌లో పసిడి నెగ్గిన తొలి భారత పారా షఉటర్‌గా నిలిచిన అవని.. పారిస్‌లో మళ్లీ పసిడి నెగ్గి బంగారు పతకం నిలుపుకున్న తొలి పారా అథ్లెట్‌గానూ నిలిచింది. షఉటింగ్‌లో అవని లేఖర పసిడి పతకంతో పారిస్‌ పారాలింపిక్స్‌లో భారత్‌ పతక ఖాతా తెరిచింది. పారాలింపిక్స్‌ పోటీల రెండో రోజు భారత్‌ ఏకంగా నాలుగు పతకాలు కైవసం చేసుకుంది.
నవతెలంగాణ-పారిస్‌ : పారా అథ్లెట్లు ప్రపంచ క్రీడా వేదికపై భారత్‌కు గోల్డెన్‌ స్టాండర్డ్స్‌ నెలకొల్పారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగం (ఎస్‌హెచ్‌1) విభాగంలో భారత్‌ ఏకంగా రెండు పతకాలు సాధించింది. గతంలో భారత్‌ ఎన్నడూ మెడల్‌ పొడియంపై ఇలా రెండు పతకాలు ఒకే విభాగంలో సాధించలేదు. పారిస్‌ పారాలింపిక్స్‌లో అవని లేఖర, మోన అగర్వాల్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. టోక్యో పారాలింపిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ అవని లేఖర పారిస్‌లో పసిడి నిల బెట్టుకోగా.. తొలి ప్రయత్నంలోనే మోన అగర్వాల్‌ ప్రతిష్టాత్మక పారా విశ్వ క్రీడల్లో పతకం సాధించింది. పారాలింపిక్స్‌ 2024 రెండో రోజు పోటీల్లో భారత్‌ మరో రెండు పతకాలు సహా నాలుగు మెడల్స్‌ ఖాతాలో వేసుకుంది.
డబుల్‌ ధమాకా
మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ (ఎస్‌హెచ్‌1) విభాగంలో భారత్‌ డబుల్‌ ధమాకా చూపించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ , 22 ఏండ్ల అవని లేఖర పసిడి పతకం నిలుపుకోగా.. కొత్త కెరటం మోన అగర్వాల్‌ సైతం పతక వేటలో మెప్పించింది. ఫైనల్లో అనుభవాన్ని అంతా ఉపయోగించిన అవని లేఖర సూపర్‌ గురితో 249.7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. పసిడి పతకం సొంతం చేసుకుంది. 36 ఏండ్ల మోన అగర్వాల్‌ తొలి ప్రయత్నంలోనే పతకం సాధించింది. ఆరంభంలో నెమ్మదించినా ఆఖరు రౌండ్ల సిరీస్‌లలో మోన మెప్పించింది. 228.7 పాయింట్లతో కాంస్య పతకం అందుకుంది. దక్షిణ కొరియా షఉటర్‌ లీ 246.8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సిల్వర్‌ మెడల్‌ అందుకుంది. ఫైనల్‌ సిరీస్‌లో అవని లేఖర 9.9తో ఒత్తిడిలో పడగా.. అదే సిరీస్‌లో దక్షిణ కొరియా షఉటర్‌ 6.8 పాయింట్లే సాధించింది. దీంతో అవని లేఖర సులువుగా బంగారు పతకం ఎగరేసుకుపోయింది. అవని లేఖర, మోన అగర్వాల్‌ పారిస్‌ పారాలింపిక్స్‌లో మరో మెడల్‌పై సైతం కన్నేశారు. మహిళల 50 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఈ పతక జోడీ బరిలోకి దిగనుంది.
మనీశ్‌ నర్వాల్‌కు సిల్వర్‌
షఉటింగ్‌లో టీమ్‌ ఇండియాకు మరో మెడల్‌ లభించింది. టోక్యో పారాలింపిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ మనీశ్‌ నర్వాల్‌ పారిస్‌లోనూ పతకం సాధించాడు. పురుషుల 20 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ (ఎస్‌హెచ్‌1) విభాగంలో మనీశ్‌ నర్వాల్‌ సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. 22 ఏండ్ల మనీశ్‌ నర్వాల్‌ ఆరంభంలో ఆశించిన స్కోరు చేయలేదు. ఆ తర్వాత నెమ్మదిగా బిగ్‌ స్కోర్లు సాధించిన మనీశ్‌ 234.9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. పారాలింపిక్స్‌లో వరుసగా పతకాలు సాధించాడు. దక్షిణ కొరియా షఉటర్‌ 237.4 పాయింట్లతో పసిడి నెగ్గగా.. చైనా షఉటర్‌ కాంస్య పతకం సాధించాడు.
ప్రీతి పాల్‌ రికార్డు పరుగు
ప్రీతి పాల్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో చరిత్ర సష్టించింది. పారాలింపిక్స్‌ అథ్లెటిక్స్‌ 100 మీటర్ల పరుగు పందెంలో భారత్‌కు తొలి పతకం సాధించిన పారా స్ప్రింటర్‌గా ప్రీతి పాల్‌ రికార్డు నెలకొల్పింది. మహిళల 100 మీటర్ల పరుగు (టీ 35) విభాగంలో ప్రీతి పాల్‌ 14.21 సెకండ్ల టైమింగ్‌తో కాంస్య పతకం సాధించింది.