‘మన తరాలన్నీ స్త్రీ సాధికారత కోసం పనిచేస్తూనే ఉన్నాయి. కానీ సాధికారత సాధించిన స్త్రీలతో ఎలా ఉండాలనే విషయాన్ని మాత్రం చెప్పలేకపోయాయి’ అని ఒక పరిశీలనను మిత్రుడు పోస్టు చేశాడు. మహిళలు ముందుకు రావాలీ, సమానత సాధించాలి, అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ మాట్లాడుతారు. కానీ, అభివృద్ధి చెందిన మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలి? అనే ఆలోచనను మన సమాజం పురుషులకు నేర్పలేకపోవటం విచారకరం. ఎందుకంటే మొన్న కలకత్తా ఘటనలో డాక్టర్ మౌమితా మెడిసిన్‌లో పీజీ చేస్తున్న ఉన్నత విద్యాధికురాలు.అంతేకాదు, ఇప్పటికీ దేశంలోని మహిళా వైద్యులు ఎక్కువగా అభద్రతలో ఉన్నారని ఐ.ఎం.ఏ అధ్యయనం చెబుతున్నది. రాత్రిపూట వైద్యసేవలు అందించటానికి భయపడుతున్నారనీ తెలిపింది. వీళ్లే కాదు. ఈ మధ్యనే వెలుగులోకి వచ్చిన ముంబయి నటి కాదంబరి జత్వానీ సినీరంగంలో ఎదిగిన కళాకారిణి.తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని వ్యాపారవేత్త జిందాల్‌పై కేసుపెడితే, అప్పటి ఏపీ ప్రభుత్వం వ్యాపార కుటుంబాన్ని రక్షించడానికి ఆమెపై కేసుపెట్టి చిత్రవధకు గురిచేశారని స్వయంగా ఆమే ఘోషిస్తున్నది.
2019లో హైద్రాబాద్, శంషాబాద్‌లో జరిగిన లైంగికదాడి, హత్యకు గురైన అమ్మాయి కూడా వెటర్నరీ డాక్టరే. పురుషులతో సమానంగా ఎదిగిన అమ్మాయే. ఢిల్లీ నిర్భయ, ఉన్నావ్, హత్రాస్ సంఘటనల్లో దారుణంగా, రాక్షసంగా అమ్మాయిలు హత్యచేయబడ్డారు. ఇక ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట లైంగిక వేధింపుల ఘటన, హత్య జరుగుతూనే ఉంది. ఏ విభాగం, వ్యవస్థా కూడా ఈ వేధింపులు లేకు ండా లేదు. ఇటీవలే జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదికలో కేరళలోని సినీపరిశ్రమలో మహిళలపై వేధింపులు తీవ్రంగా ఉన్నాయని వివరించారు. అంతకుముందు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అన్ని చోట్లా కాస్టింగ్ కౌచ్‌కు పాల్పడుతున్నారని ‘మీటూ’ ఉద్యమం నడిచింది.
ఇక కళాశాలల్లో, హాస్టళ్లలో, పాఠశాలల్లో ఆడపిల్లలపై వేధింపులు ఆగటం లేదు. మొన్న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో గుడ్లవల్లేరు ఇంజనీరింగు కాలేజీలో ఆడపిల్లలు నివసిస్తున్న హాస్టలు బాత్ రూముల్లో హిడెన్ కెమెరాలు అమర్చి వీడియోలు తీస్తున్నారనే ఘటన విద్యార్థినుల ఆందోళనతో వెలుగులోకి వచ్చింది. ఉన్నత చదువులు చదువుకుంటారని, మంచి విద్యాసంస్థ అని మా పిల్లలను పంపించామని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. భారతదేశంలో ఈ వేధింపుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రతి పది నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోంది. ఇక ప్రేమించలేది చేసే హత్యలు, ప్రేమించిందని కుటుంబ సభ్యులు చేసే హత్యలు కోకొల్లలు. బాబాలు, యోగులు, గురు వుల పేరుతో దుర్మార్గాలూ బయటపడుతున్నాయి. మొన్న కర్నాటకలో మురుగ మత పీఠాధిపతి శివ మూర్తి తమను లైంగికంగా వేధించాడని పాఠశాల విద్యార్థినులు చెప్పగా విచారించిన కమిటీ నిజమేనని తేల్చింది. ఇలా ఎన్నయినా ఉదహరించవచ్చు.
ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రి సీతక్క ‘హౌటూ రెస్పెక్ట్ ఉమెన్’ అనే పేరుతో పాఠ్యాంశాన్ని విద్యార్థులకు బోధించేందుకు కృషి చేస్తామని తెలిపారు. శిక్ష, శిక్షణ రెండూ ఏకకాలంలో జరిగితేనే నేరాలను అరికట్టవచ్చని చెప్పారు. మంచి ప్రయత్నమే. కానీ, మనకు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచాక, సమానత్వం, ప్రజాస్వామ్య భావనలతో పాలన ఇస్తున్నామని చెప్పుకున్న తర్వాతా… ఇప్పుడు మహిళలతో ఎట్లా ప్రవర్తించాలో, వారినెలా గౌరవించాలో అనేది తెలుసుకోవా ల్సిన దశలోనే ఉన్నాము. అదీ విషాదం. ఎదుటి మనుషులను, భిన్న అభిప్రాయాలను, మనతోనే ఉన్న ఇతర మతాలను, వారి ఆచారాలను, ఆహారాలను, ఆహార్యాలను ఎలా గౌరవించాలో కూడా ఇంకా నేర్చుకోనేలేదు. వైవిధ్యాల పట్ల అవగాహనా కలుగలేదు.ఈ బేధాలనే శతృష్వరితంగా మార్చేస్తున్న ఘటనలను చూస్తున్నాం.
నేడు మహిళలను ఎలా గౌరవించాలో అనే విషయాలను ప్రజలకు అందించాల్సిన ప్రభుత్వ నిర్వాహకులు, సనాతన ధర్మం పేరుతో మనువాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారు. దేశంలో స్త్రీని అబలగా కేవలం వంటింటికి, పిల్లలుకనేందుకు పరిమితం చేసే భావనలే వారి ఆలోచనలుగా ఉన్నాయి. రెండోవైపు స్త్రీలను, వారి అందాలను కాదు, అంగాలని వ్యాపార సరుకుగా మారుస్తున్న వ్యవస్థా విధానం మనపై ఆధిపత్యం చేస్తూవున్నది. ఈ రెండింటినీ ఎదుర్కోవాల్సిన సందర్భం ఇది. ఇప్పుడు జస్టీస్ కోసం నినదించే యువత, తల్లిదండ్రులూ, ఈ అవగాహనతో పనిచేస్తే ముందడుగేయగలం!