అలుగు పోస్తున్న కటాక్షపూర్ చెరువు

నవతెలంగాణ – ఆత్మకూరు 
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆత్మకూరు మండలంలోని చెరువులు నిండు కుండల మారి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చలి వాగు, జెర్రిపోతుల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెద్దాపురం, ఆత్మకూరు గ్రామాల్లో గల చెరువుల్లో జల కలను సంతరించుకున్నాయి. జాతీయ రహదారికి పక్కనే ఉన్న కటాక్షపూర్ గ్రామంలో గల పెద్ద చెరువు మత్తడి పోస్తుండడంతో రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడబోతుంది. కావున పోలీస్, రెవెన్యూ అధికారులు కటాక్షపూర్ పెద్ద చెరువును  24 గంటల పర్యవేక్షణ చేయనున్నారు. నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కటాక్షపూర్ పెద్ద చెరువు మత్తడి పోస్తుండడంతో శనివారం సాయంత్రం నుండి ఆత్మకూర్ సిఐ ఆర్ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఏ సమయంలోనైనా మత్తడి అభివృద్ధి పెరిగే అవకాశాలు ఉన్నందున వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ వారు తెలిపారు.  విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు సిఐ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు బయట వెళ్లొద్దని తెలిపారు. కటాక్షపూర్ పెద్ద చెరువు మత్తడి ఆదివారం సాయంత్రానికి పెరిగే అవకాశం ఉందని వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కటాక్షపూర్ మత్తడిని ఆదివారం ఉదయం స్థానిక ఎమ్మార్వో జగన్మోహన్ రెడ్డి, సిఐ ఆర్ సంతోష్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డిలు పరిశీలించారు. వర్షం కారణంగా మత్తడి ఉధృతి పెరిగే అవకాశం ఉందని మత్తడికి ఇరువైపులా బారి కేడ్లు ఏర్పాటు చేసి పోలీస్, రెవెన్యూ అధికారులతో నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తామని తెలిపారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని నీటి ప్రభావం తక్కువగా ఉన్న సమయంలోనే వెళ్లాలని ప్రవాహం పెరిగితే అనుమతించేది లేదని తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు మత్తడి నాలుగైదు ఫీట్ ల ఎత్తులో వరద ప్రవహిస్తే జాతీయ రహదారిని పూర్తిగా మూసివేయడం జరుగుతుందని వారు తెలిపారు.