– ఎఐటియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్
విశాఖపట్నం : పార్లమెంటులో ఎటువంటి చర్చా లేకుండా 2020 సెప్టెంబర్ 22, 23 తేదీల్లో ఆమోదించిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని ఎఐటియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ డిమాండ్ చేశారు. వాటి రద్దుకు ఈ నెల 23న దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు బ్లాక్ డే పాటించనున్నాయని తెలిపారు. విశాఖ ఉక్కునగరంలోని గురజాడ కళాక్షేత్రంలో మూడు రోజులపాటు తలపెట్టిన ఎఐటియుసి ఆలిండియా జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ప్రారంభ సభను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ కార్మికులు ఎన్నో సంవత్సరాలపాటు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కోవిడ్ సమయంలో చాపచుట్టేసి, కంపెనీల యాజమాన్యాలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. ఆ విషయమై కార్మిక సంఘాలతో కనీసం చర్చించలేదని తెలిపారు. మూడు వ్యవసాయ నల్ల చట్టాలు, లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ 2020 నవంబర్ 26న రైతాంగం ‘ఢిల్లీ మార్చ్’ ఏ విధంగానైతే చేపట్టిందో ఈ ఏడాది నవంబర్ 26న అఖిల భారత సమ్మెకు అదే విధంగా కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించాయని తెలిపారు. ఆ సమ్మెలో రైతులు, కార్మికులు భారీగా పాల్గొంటారని కోరారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి కార్పొరేట్ స్నేహితుల ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. పెద్ద ఎత్తున ప్రకృతి వనరులను కార్పొరేట్లకు దోచిపెడు తోందన్నారు. ప్రజల సొమ్ముతో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్లకు విక్రయించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా 1297 రోజులుగా కార్మికులు చేస్తున్న పోరాటం చిరస్మరణీ యమైనదన్నారు. త్యాగాల ఫలితంగా వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటైందని ఉద్ఘాటించారు. కేంద్రంలో బిజెపి మైనారిటీ ప్రభుత్వం ఉందని, దానికి రాష్ట్రంలోని టిడిపి మద్దతు ఇస్తోందని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మంచి ప్యాకేజీ వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారని, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ నిలిపివేత, సొంత గనుల కేటాయింపు, సెయిల్‌లో విలీనంపై ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో సంఘం జాతీయ అధ్యక్షులు రామేంద్ర కుమార్, ఎపి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.రవీంద్రనాథ్, జి.ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.