వీడని ముసురు.. ఉప్పొంగిన వాగులు, వంకలు

– నిలిసిన బొగ్గు ఉత్పత్తి…నెలమట్టమైన ఇండ్లు
నవతెలంగాణ – మల్హర్ రావు
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడుగా కరీంనగర్  ఎల్ఎండి మిడ్ మానేరు డ్యామ్ నీరు విడుదల చేయడం ద్వారా మానేరుతోపాటు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.ముసురు విడకుండా కురవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది.ప్రజలు ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టలేని పరిస్థితి. మండలంలోని తాడిచెర్ల, కుంభంపల్లి, కొయ్యుర్, మల్లారం, వల్లెoకుంట గ్రామాల్లో మానేరు పరివాహక ప్రాంతాల్లో పొలాలు, అంతర్గత రోడ్లు ధ్వసం అయ్యాయి. తాడిచెర్ల గ్రామానికి చెందిన దేవర రాజనర్సు ఇంటితోపాటు పలువురు ఇండ్లు,ఇంటి గోడలు నెలమట్టమైయ్యాయి. చెరువులు, కుంటలు, బొగ్గులవాగు, కాపురం, అరేవాగు, మానేరు తదితర జలాశయాలు నిండు కుండలా దర్శనమిచ్చాయి.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తాడిచెర్ల ఓసిపి బ్లాక్-1lలో బొగ్గు ఉత్పత్తి అంతరాయం కలిగి 12 వేల టన్నుల బొగ్గు,2.40 లక్షల మట్టి తవ్వకాలకు ఆటంకం కలిగినట్లుగా అధికారులు తెలిపారు.మానేరు ముంపునకు ట్రాన్స్ఫార్మర్స్ లు ,రైతుల మోటార్లు దెబ్బతిన్నాయి.ఆర్ధికంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు..