పంట పొలాల్లో రాళ్ళు, ఇసుక మేటలు

Stones and sand dunes in crop fields– ప్రతి సంవత్సరం ఆర్థికంగా నష్టపోతున్న  రైతులు 

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొందరు రైతులకు చెందిన పంట పొలాల్లో రాళ్లు, ఇసుక, మట్టి మేటలు వేసాయి. మండల కేంద్రం నుండి ఉప్లూర్ వెళ్లే దారిలో ఉన్న కల్వర్టు భారీ వర్షాల మూలంగా కోతకు గురవడంతో వరద ఉధృతికి కొట్టుకోవచ్చిన రాళ్లు, ఇసుక సమీపంలోని పంట పొలాల్లో మేటలు వేశాయి. కోన సముందర్, అమీర్ నగర్ గ్రామాల మధ్య బిటి రోడ్డు కోతకు గురైన ప్రదేశంలో వరద ఉధృతికి కొట్టుకొచ్చిన మట్టి, ఇసుక, రాళ్లు సమీప వరి పొలాల్లో మేటలు వేసాయి. ఉప్లూర్ రోడ్డులో రెండు నెలల క్రితం కూడా భారీ వర్షాలకు రైతులు వరి నాట్లు వేసుకునేందుకు సి్ధం చేసిన వరి నారు మడులు ఇదేవిధంగా రాళ్లు, ఇసుకతో కప్పబడిపోయాయి.మరికొందరు రైతులకు చెందిన అప్పుడే వేసిన వరి పొలాలు ఇసుక మెటలతో దెబ్బతిన్నాయి.  దీంతో గత్యంతరం లేక రైతులు వరి నాట్లతో సహా పొలాల్లో మెటలు వేసిన ఇసుకను, రాళ్లను, మట్టిని మొత్తం బ్లేడ్ ట్రాక్టర్ తో ఎత్తిపోసుకున్నారు. మళ్లీ ఇతర రైతుల వద్ద వరి నారును కొనుగోలు చేసుకుని వరి పొలాలు వేసుకున్నారు.అయితే ప్రస్తుతం వరి పొలాలు వేసి ఇప్పటికే సుమారు 50 రోజులుగా కావొస్తుంది. ఈ పరిస్థితుల్లో వరి పొలాల్లో వేసిన రాళ్లు,  ఇసుక మేటలను తొలగించుకునే ఆస్కారం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇసుక, రాళ్లను తొలగించే ప్రయత్నం చేస్తే వరి పొలాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క వేసుకున్న పంట నష్టపోగా, మరోపక్క పొలాల్లో వేసిన మేటలను తొలగించుకునేందుకు  ఆర్థికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. అంతేకాకుండా  భారీ వర్షాల మూలంగా పోలంగట్లు కోతకు గురై మళ్లీ మళ్లీ గట్లను  ఏర్పాటు చేసుకోవాల్సిన వస్తుందని, దీంతో శ్రమ ఎక్కువైతుందని అంటున్నారు.భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి  తమ పంట పొలాల పరిస్థితి ఏంటోనని ఆందోళన చెందాల్సిన పరిస్థితి తమకు నెలకొందని రైతులు మదన పడుతున్నారు.