”ఇదిగో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్…స్టార్మర్, మన బ్రిటన్ ఈ జాత్యాహంకార, వర్ణవివక్ష అల్లర్ల నుంచి బయటపడాలంటే ముందు నువ్వు ఎలన్‌మస్క్ వెంటపడు. జైల్లో వేరు.” అని గార్డియన్ పత్రికలో ఒక వ్యాసకర్త బ్రిటిష్ ప్రధానికి సలహా ఇచ్చాడు. బ్రిటన్‌లో కొద్ది కాలంగా, మరీ ముఖ్యంగా అక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో మితవాదులు ఓడిపోయి లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చి స్టార్మర్ ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక నగరాలలో ఈ జాత్యాహంకార, వర్ణ వివక్షత అల్లర్లు చెలరేగాయి.
అయితే ఈ అల్లర్లకు అమెరికాలో ఉండే ఎలన్ మస్క్‌కు సంబంధం ఏమిటి?
”వెనిజులాలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రతిపక్షం, మాదకద్రవ్యాల మాఫియాతో కలిసి ఎలన్ మస్క్ కుట్ర చేస్తున్నాడు. అతని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ను పదిరోజులు వెనిజులా దేశంనుండి బహిష్కరిస్తున్నాను” అని ఆ దేశాధ్యక్షుడు నికాలస్ మదురో అన్నాడు. ఇటీవల జరిగిన వెనిజులా ఎన్నికల్లో మదురో మూడో సారి వామపక్ష అభ్యర్థిగా నిలబడి విజయం సాధించాడు.అయితే, అమెరికా పౌరుడైన ఎలన్‌మస్క్‌కు వెనిజులాలో వామపక్ష నేత మదురో గెలుపు నచ్చకపోవటం ఎందుకు?
ఎలన్ మస్క్ ప్రపంచంలోని అత్యంత ధనికుల్లో రెండోవాడు. టెస్లా కార్ల కంపెనీ అధిపతి. తన వ్యాపార సామ్రాజ్యాన్ని అంతరిక్షానికి కూడా పాకించాలనునకునే తెంపరి. ఈ వ్యాపారవేత్త 2023 జూలైలో పిట్ట గుర్తు ఉన్న ‘ట్విట్టర్’ను 44 బిలియన్ డాలర్లకు(అంటే 4400 కోట్ల డాలర్లకు) కొనుక్కున్నాడు. పిట్ట గుర్తును కాస్తా ‘ఎక్స్’గా మార్చాడు. ఇది ఎలన్ మస్క్ వ్యాపార విస్తరణలో భాగంగా చేసివుంటే ఇబ్బందేం లేదు. కానీ ట్విట్టర్ ఒక సామాజిక మాధ్యమం. దీని ద్వారా రోజుకి కొన్ని వేలకోట్ల సందేశాలు ప్రపంచమంతటా వెదజల్లబడుతుంటాయి. అందుకు కూడా ఎవరు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే, ఈ ట్విట్టరే అనేక విద్వేష సందేశాలకు, విధ్వంసకర ఆలోచనలకు వేదిక అయింది. ఈ కారణం చేతనే గార్డియన్ వ్యాసకర్త బ్రిటీష్ ప్రధానికి అటువంటి సలహా ఇవ్వటం జరిగింది. వెనిజులా అధ్యక్షుడు మదురో స్వల్పకాలం అయినా, తన దేశం ‘ఎక్స్’ నుంచి గెంటడం జరిగింది.వాక్ స్వాతంత్య్రానికి ఛాంపియన్‌గా మస్క్ చెప్పుకుంటాడు. ట్విట్టర్‌ను ఆ పద్ధతిలోనే నడుపుతా నని అంటాడు. కానీ, ఎలన్ మస్క్ ఎటు వంటివవాడు? ద్వేషం, వర్ణవివక్షత, జాత్యాహం కారం, మితవాదం, మతవాదం, విప్లవప్రతిఘాతం, కార్మికవర్గ వ్యతిరేకత ఒకే చోట పోగేసి తయారు చేసిన మానవరూపానికి నకలు అని చెప్తే సరిపోతుంది.
ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న వెంటనే అందులో పనిచేసే 9500 మంది ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసాడు. ఎక్కువ గంటలు కష్టపడి పనిచేయాలి, లేని పక్షంలో ఉద్వాసన తప్పదనీ, తన దగ్గర కొలువు చేయటం ఆషామాషి కాదని ఎలన్‌మస్క్ బహిరంగంగానే ప్రకటిం చాడు. అయితే, ఉద్యోగుల పనితీరును పరిశీలించ కుండానే, కేవలం ఈమెయిల్ ద్వారా అందులో నుంచి 8వేల మందికి ఉద్వాసనపలికాడు. తన దగ్గరే కాదు, ప్రపంచంలోని కార్మికులం దరూ వారానికి 80గంటలు పని చేయాలం టాడు. ఈ విషయంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి మస్క్ అన్న అనిపించాడు. కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం పనిగంటలు 14కు పెంచాలని ప్రయత్నించి, ప్రజల నుంచి వ్యతిరేకత రావటంతో వెనక్కి తగ్గటం మనం చూశాం.అంతేకాదు, ఎలన్‌మస్క్ వాక్ స్వాతంత్య్రం చెప్పే హితబోధ కొంగజపం లాంటిది.మస్క్ దృష్టిలో వాక్ స్వాతంత్య్రం అంటే విద్వేష ప్రచారాన్ని యథేచ్ఛగా సాగనివ్వటమే.
ట్విట్టర్ పిట్టగుర్తుగా ఉన్నప్పుడే విద్వేష సందేశాలను కొన్ని గ్రూపులు, వ్యక్తులు పోస్టు చేస్తుండేవారు, పంచుకుంటుండేవారు. అయితే వాటి మీద ఎంతో కొంత తనిఖీ ఉండి, ఆ పోస్టులను తొలగించడం, అటువంటి విద్వేష సందేశాలు గుప్పించేవారిని ట్విట్టర్ నుంచి సస్పెండ్ చేయడమో, లేక నిషేధించ డమో జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఉదాహరణకు, ట్విట్టర్ ఎలన్ మస్క్ కిందకు రాకముందు బ్రిటన్‌లో శరణార్థులుగా వచ్చినవారిని వ్యతిరేకిస్తూ, వర్ణ వివక్షతను ప్రోత్సహిస్తూ విద్వేష సందేశాలు పెట్టే హాప్ కిన్స్, టమ్మి రాబిన్సన్ అనే ఇద్దరిని ట్విట్టర్ శాశ్వతంగా నిషేధించింది. కానీ, తర్వాత ఆ ఇద్దరినీ ట్విట్టర్ తన అధీనంలోకి వచ్చిన తరువాత ఎలన్‌మస్క్ ఆ ఇద్దరిపై నిషేధం తొలగించి పోస్టులు పెట్టటానికి అనుమతించాడు. ఆ ఇద్దరు ఇప్పుడు మస్క్‌కి ట్విట్టర్‌లో కృతజ్ఞతలు చెప్పటమే కాకుండా, తమ విద్వేష సందేశాలు పోస్ట్ చేయటం మరింత ఉధృతం చేశారు.
వాస్తవంలో నిజం ఎప్పుడూ ద్వేషాన్ని పెంచదు, ఆలోచన కలిగిస్తుంది. అయితే ప్రజల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకో వాలనుకునే వారికి అబద్ధాలు, అర్థసత్యాలు, వక్రీకరణల అవసరం వుంది. ‘తాను తవ్విన గోతిలో తానే పడ్డట్టు’ ఎలన్ మస్క్‌కి సైతం ఈ అనుభవం కలగకపోలేదు. కళ్లెలు లేని లాంటివి ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్‌లు.
బ్రిటన్‌లో, కడుపు చేతపట్టుకొని శరణార్థులుగా వచ్చిన వారిపై, శరీరరంగు బేధం వున్నవారిపై, ముస్లిం మైనార్టీలపై మితవాద గ్రూపులు దాడులు చేస్తున్నాయి. అటువంటి వారిని అరెస్టు చేసి ఫాక్ లాండ్‌లోని ఖైదీల శిబిరానికి తరలించనున్నారని బ్రిటన్ టెలిగ్రాఫ్ పత్రిక ఒక వార్తగా రాసింది. కానీ నిజానికి అది ఒక అబద్ధపు వార్త. అటువంటి వార్తను తాము ప్రచురించనేలేదని, అదొక ఫేక్ అని టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది. ఇందులో నిజం ఏమిటంటే టెలిగ్రాఫ్ పత్రికలోనే పనిచేసే సీనియర్ జర్నలిస్టు ఆ పత్రిక స్టైల్‌లోనే ఈ వార్తను దుర్బుద్ధితో తయారుచేసి ట్వట్టర్‌లో పోస్ట్ చేశాడు.ఈ ఫేక్‌ను మస్క్ షేర్ చేశాడు. 20కోట్ల మంది ఫాలోవర్స్ కలిగివున్న ఎలన్ మస్క్ తప్పు గ్రహించి, దాన్ని 30 నిమిషాల తర్వాత తొలగించే లోపలే అది 20 లక్షల మందికి చేరింది. జరగాల్సిన నష్టం జరిగిపో యింది. అయితే ఎలన్ మాస్క్ ఎందుకు ఈ వార్తను షేర్ చేశాడు? ఎందుకంటే అది తన వైఖరికి అనుకూలంగా ఉంది కాబట్టి. బ్రిటన్‌లో లేబర్ పార్టీ అధికారంలోకి రావటం మస్క్‌కి ఇష్టం లేదు. పనిగట్టుగని బ్రిటన్ లేబర్ పార్టీ ప్రభుత్వంపై ఎలన్‌మస్క్ దుష్ప్రచారానికి దిగుతున్నాడు. మితవాదులకు కొమ్ముకాస్తూ ‘బ్రిటన్‌లో అంతర్యుద్ధం తప్పదు’ అంటూ మస్క్ ట్వీట్ చేశాడంటే ఏమనుకోవాలి?
అమెరికా ఎన్నికల్లో కూడా ట్రంప్‌కు మద్దతుగా మస్క్ ట్విట్టర్‌ని వాడుతున్నాడు. కమలా హారిస్‌కు వ్యతిరేకంగా కత్తికట్టి రంగంలోకి దిగాడు. ధరల పెరుగుదలపై, వలసలపై, సొంతిండ్ల కోసం మధ్యతరగతి పడుతున్న బాధలపై, ఇజ్రాయిల్ పాలస్తీనాపై చేస్తున్న దాడులపై ఆమె సానుభూతి చూపించడం పాపమైంది. ఆమె కమ్యూనిస్ట్ అనే ప్రచారంతో మొదలుపెట్టి, అసందర్భంగా ఆమె పుట్టుపూర్వోత్తరాల గురించి మాట్లాడే వారికి ట్విట్టర్‌ను వేదిక చేశాడు. ఆమెకు మద్దతుగా వుండే ఓటర్లను ట్రంపు వైపు లాగడానికి శాయశక్తుల కృషి చేస్తున్నాడు. 2020 అమెరికా ఎన్నికల్లో ఇదే ట్రంప్ పరాజయ పరాభవాన్ని భరించలేక ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ‘క్యాపిటల్ హిల్స్’ మీదకి తన సానుభూతిపరులను ఎగదోసిన విషయాన్ని ‘ప్రజాస్వామ్య వాది’ ఎలన్ మస్క్ సానుకూలంగా మరచిపోయాడు.
బ్రెజిల్ విషయంలోనూ ఎలన్‌మస్క్‌ది ఇదే వైఖరి. 2022 ఎన్నికలలో బ్రెజిల్ ప్రజలు,అధికారమదంతో నిరంకుశంగా పాలించిన బోల్స్ నారోను ఓడించి వామపక్షానికి చెందిన లూలా డా సిల్వాను గెలిపించుకున్నారు. పరిపాలనలో బోల్స్‌నారో చేసిన ఘోర తప్పిదాలపై అనేక కేసులు అక్కడి సుప్రీంకోర్టు ముందు విచారణలో వున్నాయి. వాటిల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను వేధించి, బెదిరించిన కేసులు కూడా వున్నాయి. ట్విట్టర్ ‘ఎక్స్’లో బోల్స్‌నారో అనుచరులు అనేక అబద్ధాలు ప్రచారంలో పెట్టి ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుండటంతో దాదాపు అటువంటి 200 ట్విట్టర్ అకౌంట్లు మూసివేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఎలన్ మస్క్ బేఖాతరు చేయటమే కాక, కోర్టు ఆదేశాలను పట్టించుకోనని బహిరంగంగా ప్రకటించాడు. దాంతో సుప్రీంకోర్టు జడ్జి అలెగ్జాండర్ డి మోరిస్ ట్విట్టర్ బ్రెజిల్ సార్వభౌమాధికారాన్ని అగౌరవపరుస్తున్నదని, విద్వేషాలు రగిల్చే సందేశాలు వ్యాప్తి చేస్తున్నదని, అందుచేత 24 గంటలలో కోర్టు ఆదేశాలను అమలు చేయాలని లేనిపక్షంలో ట్విట్టర్ తరుఫున బ్రెజిల్‌లో వున్న లీగల్ ప్రతినిధిని అరెస్టు చేయటానికి ఆదేశిస్తానని హెచ్చరించాడు. దాంతో తప్పని పరిస్థితులలో బ్రెజిల్‌లో వున్న ట్విట్టర్ కార్యాల యాన్ని మూసివేస్తున్నానని, అయినా బ్రెజిల్ ప్రజలకు ట్విట్టర్ సేవలు కొనసాగిస్తానని ప్రకటించాడు. అంతేకాక సుప్రీం కోర్టు జడ్జి మోరిస్‌పై కూడా ‘ఎక్స్’లో దాడి చేశాడు.అంటే ట్విట్టర్ బ్రెజిల్ న్యాయ పరిధిలోకి రాకుండా చూసుకుంటూ, మరోవైపు ప్రభుత్వం పై రెచ్చగొట్టే సందేశాలు ప్రజలకు అందించటం మానడన్నమాట. ఈ అతి తెలివిని గమనించిన బ్రెజిల్ సుప్రీంకోర్ట్ 24 గంటల్లో ట్విట్టర్ న్యాయ ప్రతినిధిని నియమించాలని, లేనిపక్షంలో ట్విట్టర్ సేవలు మొత్తం బంద్ చేసుకోవాలని హెచ్చరించింది.
జర్మనీలోని బ్రాండెన్ బర్గ్‌లో టెస్లా కార్ల ఫ్యాక్టరీని విస్తరణకు 813 ఎకరాల్లో ఐదు లక్షల చెట్లను నరికించి, పర్యావరణానికి ప్రమాదం తెచ్చిపెట్టాడు ఎలన్ మస్క్. దీనిని వ్యతిరేకించిన పర్యావరణ కార్యకర్తలు ఫ్యాక్టరీ ఎదుట నిరసనకు దిగారు. ఫ్యాక్టరీలోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఆ సందర్భంలో ఎలన్‌మస్క్ ఇచ్చిన ట్వీట్ ఏమిటో తెలుసా?” పోలీసులు అంత తేలికగా వామపక్ష నిరసనకారులను ఎందుకు వదిలేశారు? ” అని. దీనిని బట్టి ఎలన్ మస్క్ ఎటువంటి వ్యక్తో, ‘ఎక్స్’తో సహా సోషల్ మీడియా ఎవరికోసమో అర్థం చేసుకోవచ్చు.
మనదేశంలో కూడా మైనార్టీ వ్యతిరేక మతతత్వ విద్వేష ప్రచారాలకు ‘ఎక్స్’ వేదికగా వున్న తెలిసిందే. ట్విట్టర్ దీనికి ఉపయోగపడుతుంటే, వాట్సాప్ గ్రూపులు మతోన్మాదులను రోడ్లమీద పోగేసి, మైనార్టీ మతస్తులను వేధించటానికి ఉపయోగ పడుతున్నది. ఈ సోషల్ మీడియాను ప్రజలు, దేశభక్తులు, అభ్యుదయవాదులు అప్రమత్తతతో గమనించాల్సిన అవసరం ఏర్పడ్డది. ముఖ్యంగా మనదేశంలో మితవాద, మతవాద రాజకీయ పార్టీలు ఐటీ సెల్స్ పేరుమీద విభాగాలను ఏర్పరిచి తమకు అనుకూలంగా ఉండే భావోద్రేకాలను రెచ్చగొట్టి సమాజంలో సామరస్యానికి శాంతికి విఘాతం కలిగిస్తున్నారు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రాబోయే రోజుల్లో ప్రపంచానికి పెనుముప్పుగా తయారు కాబోతు న్నదని సాంకేతిక శాస్త్రజ్ఞులు, సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరి స్తుండగా, సోషల్ మీడియా ఇప్పటికే ఆ ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది. గుత్త పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్నంతవరకు ఈ సామాజిక మాధ్యమాలు సామాన్య ప్రజలకు కొద్దిగా కూడా ఉపయోగపడవు అనేది సత్యం. నిజానికి ఫ్రింట్ వార్తాపత్రికలకు సోషల్ మీడియా ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు, కాబోదు.
కర్లపాలెం భాస్కరరావు
9676457732