”ఆలస్యంగా జరిగే న్యాయం న్యాయమే కాదు” అని ఆనాడే అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. అయేషామీరా, బిల్కిస్‌బానో లాంటి కేసులు చూసిన తర్వాత చట్టం ఎవరికి చుట్టమో అర్థమవుతుంది. ఎందుకంటే ఇటీవల కలకత్తాలోని ఆర్జికర్ హాస్పిటల్‌లో ట్రెయినీ డాక్టర్‌పై సామూహిక లైంగికదాడి, హత్యను చూస్తే మహిళలకు ప్రభుత్వాలు ఎలాంటి భద్రతను కల్పిస్తున్నాయో అర్థమవుతోంది. ఎందుకంటే ఈ హేయమైన ఘటనలో పోస్టు మార్టం రిపోర్ట్ చూస్తుంటే ఎవరికైనా హృదయం ద్రవించిపోతుంది.ఎందుకీ దారుణం? ఏమీ కారణం? హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ‘దిశ’పై రేప్, మర్డర్ జరిగినప్పుడు మహిళలు నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా సంచరించడమే లైంగిక దాడులకు కారణమని కొంతమంది వాదించారు. మరి, ఈ ఆర్జికర్ ఘటనలో వైద్యురాలు రోగులకు సేవ చేస్తూ ఆసుపత్రి విధుల్లోనే ఉంది కదా? ఎందుకింతటి అఘాయిత్యానికి చోటుచేసుకుంది? ఈ ఘటన నుంచి తేరుకోక ముందే మహారాష్ట్రలో నర్సరీ పిల్లలపై లైంగికదాడి జరిగింది. ఇది ఎవ్వరమూ జీర్ణించుకోలేని ఘోరం. అంతకముందు ఏపీలోని కర్నూలులో ఒక అరవైయేండ్ల వ్యక్తి తొమ్మిదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని ఆపిల్లలకు ఎందుకని ఈ శాపం? కొద్దిరోజుల క్రితం డెహ్రాడూన్‌లో ప్రభుత్వ ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లు ఒక టీనేజీ బాలికపై అఘా యిత్యానికి ఒడిగట్టారు. వివాహాలై, పిల్లలకు తండ్రులై, సమాజంలో బాధ్యతగల హోదాలో పని చేస్తున్న వీరుఎందుకని ఇంతటి పాశవికంగా ప్రవర్తించారు? చదువులేని అవివేకులు కొందరైతే, చదువుకున్నవారు, ఉద్యోగులు కూడా ఇలాంటి హింసకు తెగబడటానికి ఏ రకంగా మనం చూడాలి?
శంషాబాద్‌లో జరిగిన దిశ ఘటనలో కఠినంగా వ్యవహరించిన పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. ఆసిఫాబాద్‌లో జరిగిన లక్ష్మీ విషయంలో ఎందుకని ఉదాసీనంగా వ్యవహరించారు? కారణం, దిశ ఘటన పట్టణంలో జరగడంతో ఎక్కువ ప్రచారమైంది. ప్రజలు నిరసనలు, ర్యాలీలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఏదో ఒక చర్య తీసుకుంటే తప్ప ఆందోళనలు ఆగే స్థితిలో లేవని, ప్రభు త్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేసింది.ఆసిఫాబాద్ ఘటనలో కూడా బాధితురాలు లైంగికదాడికి గురై కిరాతకంగా చంపబడింది. ఇది మారుమూల ప్రాంతంలో గనుక దిశ ఘటనలాగా దీనిపై స్పందించలేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయ లేదు? ప్రచారవ్యాప్తిని బట్టి, ప్రజల ఒత్తిడిని బట్టి తీసుకునే చర్య వల్ల జరిగే దాన్ని న్యాయమంటారా? బాధితులకు న్యాయం చేయడానికి అది ప్రాతిపదిక అవుతుందా! చట్టం దృష్టిలో అందరూ సమానమేనన్న భరోసా ప్రజల్లో ఉంటుందా? దీనికి కారణమెవరు?ప్రపంచ స్థాయి క్రీడల్లో పథకాలు గెలుపొంది దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన క్రీడాకారులు వినేష్ పొగాట్, ఇతర మహిళా క్రీడాకారులపై బీజేపీఎంపీ బ్రిజేష్ కుమార్ లైంగిక వేధింపులకు గురిచేస్తే కేంద్రం ఏ విధంగా స్పందించింది? ఏ స్థాయిలో ఆందోళన చేస్తే అతన్ని అసోసియేషన్ బాధ్యతల నుంచి తప్పించిందో మనకు తెలుసు. ఇలా ఒక్కో వ్యక్తికి ఒక్కోలా స్పందిస్తుంటే చట్టం పట్ల ఎటువంటి భావన కలుగుతుంది? చట్టం అంటే భయభక్తులు ఏర్పడతాయా? లేదా చులకన భావమా?
ఇప్పుడున్న విద్యావ్యవస్థలో అనేక మార్పుల్ని తీసుకొస్తుంది కేంద్రం. ఇది కూడా విద్యార్థులపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే సిలబస్‌లో నైతిక విలువలకు బదులు అశాస్త్రీయ భావాల్ని జొప్పించే పాఠ్యాంశాలను ప్రవేశపెట్టే పాలకుల తీరును ఏమనాలి? ఇది కూడా ఒక హింసను ప్రేరేపించేలా ఉన్న వారి మానసిక ధోరణి కూడా నేరంగానే పరిగణించాలి కదా! దీనికి పాలకులు కూడా బాధ్యులేనన్నది ఎవరు గుర్తించాలి? మహిళల కోసం చేసిన చట్టాల వల్ల ఏ నేరానికి ఎటువంటి రక్షణలు, శిక్షలు ఉంటాయనేది సమాజంలో చాలా మందికి తెలియదు.ఇది తెలియజేసే బాధ్యత ఎవరిది? అధికారంలో ఉన్నవారిది కాదా? నేరం చేయాలనుకున్న వ్యక్తికి తాను ఎటువంటి శిక్షలకు గురవుతాడో తెలిస్తే కొన్ని ఘటనల్ని అయినా అరికట్టొచ్చు కదా. చట్టాలపై అవగాహన కల్పించే విధంగా పాలకులు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదనే భావన నేడు అన్ని స్థాయిల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఒక ఘటన జరిగిన వెంటనే నేతలు స్పందించే తీరు, నిర్లక్ష్యపు సమాధానమే అందుకు కారణమవుతోంది.
బాధాకరమైన విషయ మేమంటే సవతి తల్లి వేధింపులకు గురవుతున్న ఒక బాలిక గాథని సుమోటోగా తీసుకుని పరిష్కారానికి సూచించిన న్యాయస్థానం లైంగికదాడి ఘటనలను ఎందుకని సుమోటోగా తీసుకోవడం లేదన్నదే ప్రశ్న. కొన్ని విషయాల్లో సత్వరమే స్పందించి న్యాయం చేసే న్యాయ స్థానం, మరి కొన్నింటిలో విచా రణను ఎందుకు వేగ వంతం చేయడం లేదు. ఘోరం జరిగి పోయిందని ఆయేషా తల్లిదండ్రులు న్యాయ స్థానా న్ని ఆశ్రయిస్తే తీర్పు రావటానికి నాలుగేండ్లు ఎందుకు పట్టాలి? కన్న బిడ్డ ప్రాణం తీసి, ఎంతో వేదనకు గురిచేసిన ఆ నిందితులకు నాలుగేండ్ల తర్వాత శిక్ష పడితే అది సరైన న్యాయమా? ఇంకా తుది తీర్పు వెలువడక నిందితులకు శిక్ష పడని కేసులెన్నో ఉన్నాయి. గోద్రా అల్లర్లలో బిల్కిస్‌బానోకు జరిగిందేమిటి? నిండుగర్భిణిపై జరిగిన సామూహిక లైంగికదాడి ఘటనలో నిందితులకు సకాలంలో శిక్ష పడిందా? చట్టంలోని సెక్షన్లను అడ్డుపెట్టుకుని ‘అధికార’పక్ష సహకారంతో తప్పించుకునే ప్రయత్నాలు చేయలేదా? 2002లో జరిగిన ఘటన జరిగితే అటు తిప్పి, ఇటు తిప్పి తీర్పు వెలువడటానికి దాదాపు ఇరవైయేండ్లు పట్టింది. ఇది సత్వర న్యాయం కిందకు వస్తుందా? ఈ కేసులో నిందితులకు శిక్ష పడినట్టా, పడనట్టా? అసలు శిక్ష అనుభవించింది మనోవేధనకు గురైన బిల్యిస్‌బానో కుటుంబం కాదా!
ఉన్నత కుటుంబ కలహాలను పరిష్కరించడానికి కుటుంబం న్యాయస్థానాలు ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా మహిళల పట్ల ఇన్ని మారణహోమాలు, ఇన్ని దారుణాలు, ఇంత క్రూరంగా జరుగుతున్నప్పుడు వాటిని విచారించి సత్వరమే తీర్పునివ్వడానికి మహిళా న్యాయస్థానాలు ఎందుకుండకూడదు? ఇప్పుడున్న మహిళా బెంచ్ సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి సిఫార్సు చేసిన కేసులని మాత్రమే విచారించగలదు. కానీ, నేరుగా బాధితులకు న్యాయం అందించగలుగుతుందా? రాష్ట్రానికి ఒక మహిళా న్యాయస్థానం ఉండి వెనువెంటనే నిందితులకు శిక్ష అమలు అయినప్పుడే భయం పెరుగుతుంది. శిక్షలు లేకపోతే భయం ఎలా ఉంటుంది? ఒక ఇంటిముందు ”కుక్క ఉన్నది జాగ్రత్త” అని బోర్డు కనబడితే ఆ కుక్క చిన్నదో పెద్దదో తెలియకపోయినా గేటు తెరవకముందే అప్రమత్తమవుతాం. అది భయానికి ఉండే ప్రతి స్పందన. దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత కూడా కొన్ని ఆకృత్యాలు జరిగాయి కదా, వాటి మాటేమిటి? అనే సందేహం ఎవరికైనా వస్తుంది. దానికి ఓ కారణముంది. ఘటన జరిగినప్పుడే ప్రజల నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాలు చూస్తాము. మళ్లీ నెలకో, రెండు నెలలకో మరో ఘటన జరిగినప్పుడు అంతే స్పందన ఉంటోంది. కానీ శిక్షలు అలాగే కొనసాగుతుంటే ”దెబ్బలకు దేవుడైనా భయపడతాడు” అన్నట్టు తక్కువకాలంలోనే నేరాలను అరికట్టే అవకాశం ఉంది కదా! రాష్ట్రానికి ఒక మహిళా కోర్టు ఏర్పాటై నిందితులకు సత్వరమే శిక్ష విధించగలిగినప్పుడే ప్రజల్లో చట్టం పట్ల నమ్మకం, గౌరవం పెరుగుతుంది.మహిళలు కూడా స్వేచ్ఛగా జీవించగలుగుతారు.
– గణపతి చల్లూరి, 9989982588