మోడీజీ క్షమాపణలు దేశ ప్రజలకు కదా చెప్పాలీ?

Did Modiji apologize to the people of the country?భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రతాప్‌ఘడ్‌ పోర్టులో 1957నవంబర్‌ 30న ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 67 ఏండ్లయినా, అది నేటికీ చెక్కుచెదరలేదు. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ కూడా శివాజీ విగ్రహం 2023 డిసెంబర్‌ 4న ఆవిష్కరించారు. కానీ, అది తొమ్మిది నెలలకే కుప్పగూలింది. నీతిమంతమైన ప్రభుత్వం ఎవరిదో ఈ దేశ ప్రజలకు అర్థమైంది. ఊరికే నెహ్రూ మీద అభాండాలు వేస్తూ కాలక్షేపం చేయకపోతే, ఆయన చేసిన పనిలో వెయ్యోవంతు పనికొచ్చే పనిచేసి చూపినా- దేశ ప్రజలు సంతోషించేవారు. 2024 ఆగష్టు 26న పగలు ఒంటిగంట ప్రాంతంలో మాల్వాన్‌ తహసిల్‌ సింధు దుర్గలోని రాజ్‌కోట్‌ కోటలో 35 ఫీట్ల ఛత్రపతి శివాజీ విగ్రహం విరిగిపడింది. ఊరికే విరగడం కాదు, ముక్కలు ముక్కలై చెల్లా చెదురైంది. వర్షానికి విగ్రహం రంగు కూడా పోయింది.అంటే, నాణ్యతా ప్రమాణాలు ఎంతగొప్పగా ఉన్నాయో తెలుస్తూనే ఉంది. ఈ విగ్రహాన్ని తొమ్మిది నెలల క్రితం మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం తయారు చేయించి, దేశ ప్రధాని నరేంద్రమోడీతో ప్రారంభోత్సవం చేయించింది. విగ్రహ నిర్మాణానికి ఆరునెలల సమయం పట్టింది. ఆవిష్కరణ అయిన తొమ్మిది నెలలకు ఎంచక్కా అది కూలిపోయింది. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ అవినీతి బహిర్గతమైంది.
17వ శతాబ్దపు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజు గురించి ఈదేశ ప్రజలకు తెలుసు. మెఘల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ను ముప్పుతిప్పలు పెట్టిన ఘనచరిత్ర ఆయనది. మహారాష్ట్రలో ఆయన పేరు చెబితేనే భావోద్వేగంతో ఊగిపోయేవారు. ఆయన్ని సాక్షాత్తు భగవంతుడిగా భావించేవారు చాలామందే ఉంటారు. అక్కడి ప్రజల మెప్పు పొందడానికి, వారి ఓట్లు రాబట్టుకోవడానికి బీజేపీ ప్రభు త్వాలు శివాజీ విగ్రహాన్ని అక్కడ ఏర్పరిచాయి. బావుంది. కానీ, కమీషన్ల కక్కుర్తి లేకుండా, అవినీతి లేకుండా ఏర్పాటు చేయిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదు కదా? మళ్లీ, జరిగిన తప్పు సరిదిద్దుకోవడానికి ఆ తప్పు తన మీద వేసుకుని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ శిథిలమై పోయిన శివాజీ విగ్రహానికి క్షమాపణలు కోరాడు. అది కూడా దేశ ప్రజలను వంచించడమేనన్నది గ్రహించుకోలేదు. పైగా, గత పదేండ్లలో చేస్తూ వచ్చిన అవివేకపు పనులకు, అరాచకాలకు ఆయన ఈ దేశ ప్రజలకు ఎన్నెన్నిసార్లు, ఎంతెంతమందికి క్షమాపణలు చెప్పాలో లెక్కలేసుకోగలడా? అలాంటప్పుడు ఎందుకా నాటకాలు? తన నాటకాల్ని దేశ ప్రజలు, గ్రహిస్తున్నారని తెలుసుకోకుండా నటిస్తూ ఉండటం ఒక తప్పయితే- తెలుసుకున్నా, సరిదిద్దు కోవడం మానేసి అదే పాత పద్ధతిలో తప్పులు చేస్తూ ఉండటం- మరొక తప్పు.
ఈ క్షమాపణల నాటకం ఎందుకంటే, దోషులైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారి అనుచరగణాన్ని రక్షించడానికి! దేశ ప్రజల దృష్టి వారిపై పడకుండా దేశ ప్రధాని తాపత్రయం పడ్డట్టు స్పష్టంగా తెలిసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే-తన కుమారుడు శ్రీకాంత్‌ షిండే స్నేహితుడైన జైదీప్‌ ఆప్టేకు విగ్రహం తయారు చేసే కాంట్రాక్టు ఇచ్చాడు. జైదీప్‌ ఆప్టేకు విగ్రహాల తయారీలో అనుభవం లేదు. అతని వయసు కేవలం 24 ఏండ్లు మాత్రమే. అంత పెద్ద కాంట్రాక్టు అతనికి ఎలా ఇచ్చారూ? తండ్రి షిండే ముఖ్యమంత్రి. కొడుకు షిండే పార్లమెంటు మెంబరు. మరి వార సత్వ పాలన గురించి మాట్లాడే అర్హత బీజేపీ నాయకులకు ఉందా? ఈ వివరాలన్నీ శివసేన (యుబీటి) ఎంపీ ప్రియాంక చతుర్వేది ప్రకటిస్తూ- మహారాష్ట్ర సీఎం; డిప్యూటీ సీఎం; పిడబ్ల్యూడి మంత్రుల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని, నిస్పాక్షికంగా విచారణ జరిపించాలనీ ఆమె డిమాండ్‌ చేశారు.
శివాజీ మహారాజు ఎప్పటివాడు పదిహేడో శతాబ్దం వాడు.. మోడీ ఎప్పటివాడూ? ఇరవై ఒకటో శతాబ్దం వాడు. శతాబ్దాల కింద బతికిన శివాజీకి ఉన్న అవగాహన తనకు లేకపాయెనే అని మోడీ కుళ్లి, కుళ్లి ఏడవాలి కదా? డాబుగా వచ్చి ఆవిష్కరణలు చేయడం కాదు, చారిత్రక పురుషుల నుండి నేర్చు కోవాల్సిన అంశాలు నేర్చుకోవాలి కదా! చేయబోయే పనిని గూర్చి తెలుసుకోవడమే- వివేకం. ఎలా చేయాలో తెలుసుకోవడం-నైపుణ్యం. పూర్తి చేయడం-సామర్థ్యం. ఇందులో ఏ ఒక్కటీలేని నేటి దేశ నాయకులు చేసే పనులు ఇలాగే ఉంటాయి. ఇంగ్లీషు మహాకవి విలియం షేక్స్‌పియర్‌ అంటాడు. ”నువ్వు చూపించే దానికన్నా, నీ దగ్గర ఎక్కువగా ఉండాలి. నీకు తెలిసిన దానికన్నా నువ్వు తక్కువగా మాట్లాడాలి”- అని. ఏమీ తెలియకపోయినా ఎక్కువగా మాట్లాడే దేశ ప్రధానికి షేక్స్‌పియర్‌ పేరు తెలిసి ఉంటుందని అనుకోవడం-మనదే బుద్దితక్కువ! మనం ఎంత బుద్దితక్కువ గాళ్లం కాకపోతే, గుజ రాత్‌ అల్లర్లు జరిపించిన చదువులేని మేధావిని పదేండ్లుగా ప్రధానిగా భరిస్తున్నాం?” నేను తప్పు అని అనడానికి ముందు నువ్వు ఒప్పుగా ఉండటం అవసరం!” అన్నమాట అధికార బీజేపీవారికి తెలియదు. అందుకే కదా వారి తప్పులన్నీ ఒప్పులైనట్లు భావిస్తుంటారు.
ఈ దేశ ప్రధాని విదేశాలలో తిరిగేప్పుడు ‘తను యుద్ధభూమి నుండి రాలేదని బుద్ధభూమి నుంచి వచ్చానని’ -బీరాలు పలికే నరేంద్రమోడీకి బుద్ధుడి పేరెత్తే అర్హత ఉందా?మణిపూర్‌ మారణకాండ తన ఆధ్వర్యంలోనే జరిగిందన్న విషయం గుర్తుచేసుకోడా? అంతేకాదు, శతాబ్దాల క్రితం శివాజీ చేపట్టిన సంస్కరణలేమిటీ? తను ప్రచారం చేసిన కుసంస్కారాలేమిటీ? కొంచెమైనా ఆలోచించుకోరా? ముక్క లైన శివాజీ విగ్రహానికి క్షమాపణలు చెప్పడం కాదు. ఆయన జీవించిన కాలంలో ఆయన పరిపాలన ఎలా ఉంది? తన పరిపాలన ఎలా ఉందీ- అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా? ఏదీ మరి? ”చక్కటి వ్యవసాయక విధానం ద్వారా రైతుల హృదయాలను గెలుచుకున్న సమ్రాట్‌ ఛత్రపతి శివాజీ”- అని మహాత్మా జ్యోతిరావుపూలే శివాజీని ప్రశంసించారు. మోడీ ఏం చేశాడు? నల్లచట్టాలు తెచ్చి రైతుల ఉసురుపోసుకున్నాడు. వాళ్లు ఏండ్లకేండ్లు ఢిల్లీ సరిహద్దుల్లో సమ్మెచేస్తుంటే, అస్తమానం విదేశాల్లో పర్య టించే భారత ప్రధానికి ఢిల్లీ సరిహద్దుకు వెళ్లే తీరికలేకుండా పోయింది. వాళ్లడిగిన లీగలైజ్‌డ్‌ ఎంఎస్‌పి ఇవ్వలేదు. ఇటీవల ఆ రైతుల ప్రతినిధులు పార్లమెంటుకు వచ్చి ప్రతిపక్ష నేతను కలిసి, ఆయన ఛాంబర్‌లో చర్చలు జరిపారు. అదేమిటో ప్రధాని చేయాల్సిన పనులు ప్రతిపక్ష నేత చేస్తున్నాడని దేశం విస్తూపోయింది.
శివాజీ ముస్లిం వ్యతిరేకి కాదు. ఆయన తన సైన్యంలో 30శాతం మంది ముస్లింలను చేర్చు కున్నాడు.ఉదాహరణకు ముఖ్య సేనాధిపతి దౌలత్‌ఖాన్‌, ఆయుధాగార అధిపతి ఇబ్రహీంఖాన్‌. విదేశీ వ్యవహారాల బాధ్యుడు ముల్లా హైదర్‌. వీరేగాక తన అంగరక్షకులుగా మాదానీ మెహరత్‌-మెహర్‌ సిద్దీ లాల్‌లను నియమించుకున్నాడు. మోడీ ఏంచేశాడూ తన ప్రతి (అధిక) ప్రసంగంలో, ముస్లింలపై ద్వేషం వెళ్లగక్కాడు. ‘వస్త్రధారణతోనే వారిని గుర్తుపట్టొచ్చు’నని ద్వేషాన్ని వెదజల్లాడు. శివాజీ తన సామ్రాజ్యం లోని కోటలకు దళితులను అధిపతులుగా చేస్తే, మోడీ పాలనలో దళితులు నరకయాతనను అను భవిస్తున్నారు.ఓడిపోయిన రాజ్యంలోని స్త్రీలను ఎత్తుకొచ్చి ఉంపుడుకత్తెలుగా చెసుకునే దుర్మార్గమైన సంప్రదాయాన్ని రద్దుచేసిన స్త్రీల పక్షపాతి ఛత్రపతి. గ్రామాలలో మహిళలపై లైంగికదాడులు చేస్తున్న భూస్వాముల కండ్లు పీకించి, జీవిత కారాగారం విధించి-మహిళలకు అండగా ఉంటూ భరోసాను, ధైర్యాన్నీ ఇచ్చినవాడు శివాజీ. ఇక మహిళల విషయంలో మోడీ నిర్ణయాలు ఎంత అధ్వాన్నంగా ఉంటూ వచ్చాయో మనం చూస్తూనే ఉన్నాం. మహిళల్ని మణిపూర్‌లో నగంగా ఊరేగించినా, అది తనదేశంలో జరగలేదన్నట్టు-ఉలుకూ పలుకూ లేనివాడు మోడీ.మణిపూర్‌ సందర్శించకపోవడమనేది ఆయన ఎంత పిరికివాడోనన్నది తెలియజేస్తుంది. లైంగిక వేధింపులకు గురైన మహిళా రెజ్లర్స్‌ సమ్మెచేస్తే పట్టించుకోని వాడు మోడీ. అందుకు కారకుడైన బీజేపీ నేత బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ను చట్టానికి అప్పగించలేని దుర్భలుడు, పైగా మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ను ‘ఛాంపియన్లకే ఛాంపియన్‌’-అని మాటలతో సరిపుచ్చడం ఆయన మోసకారితనానికి పరాకాష్ట.
భయంకరమైన కులవ్యవస్థ కొనసాగుతున్న కాలంలో దళితులకు ఉన్నతపదవులిచ్చి కుల వ్యవస్థను ధిక్కరించిన యోధుడు శివాజీ. కరువు కాటకాల సమయంలో పన్నులు రద్దుచేసిన గొప్ప మానవవాది. రైతులకు వ్యవసాయ పనిముట్లు, వడ్డీలేని రుణాలు అందించిన శివాజీ, తీరికగా నాలుగు సంవత్సరాలలో రుణం తీర్చగలిగే వెసులుబాటు కలిగించిన రైతు బాంధవుడాయన. తన రాజ భవనం ముందే ముస్లింల ప్రార్థనా స్థలం కట్టించిన శివాజీలో పరమత సహనం ఏ స్థాయిలో ఉండేదో ఊహిం చుకోవాల్సిందే! నేటి ఆరెస్సెస్‌- బీజేపీ ప్రభుత్వం ఇతర మతాలవారిని రెండోశ్రేణి పౌరులుగా భావించి, వారి ఇండ్లమీదికి బుల్డోజర్లు పంపుతున్న ఘటనలు మనం చూస్తున్నాం. వీరికి సుప్రీంకోర్టు ఉత్తర్వులన్నా లెక్కలేదు. దేశ ప్రజల సంపద కొల్లగొట్టి, కార్పోరేట్లకు పంచుతూ వారి ఇండ్లముందు పాలేర్లుగా పడి ఉండే ఇలాంటి నాయకుల్ని భరిస్తూ ఉండటం ఇంకా అవసరమా?
శివాజీ హిందూమతాన్ని పునర్నిర్మించాడని ప్రచారం చేసే ఈ మనువాదులు ఒక ప్రశ్నకు జవాబు చెప్పాలి – శివాజీ అంతటి హిందూమత ఉద్ధారకుడైతే పట్టభిషేకం చేసేప్పుడు గాగాభట్టు అనే కాశీ బ్రాహ్మణుడు శివాజీ నుదుటిమీద తనకాలి బొటనవేలుతో తిలకం దిద్ది ఎందుకు అవమానించాడు? అంతేకాదు. శివాజీని హతమార్చడానికి బ్రాహ్మణులే ఎందుకు పూనుకున్నారూ? అంతకుముందు మీర్జా రాజు జైసింగ్‌ నాయకత్వంలో శివాజీని ఓడించడానికి 400 మంది బ్రాహ్మణ పురోహితులు మూడు నెలలు కోట్లాది రూపాయలు ఖర్చుచేసి చండీయాగం ఎందుకు చేశారు? పైగా శివాజీ ఓడిపోవాలని, అఫ్జల్‌ఖాన్‌ గెలవాలనీ నాటి ఆ హిందూ మనువాదులు ఎందుకు కోరుకున్నారూ? పైగా కట్టుకథలు దండిగా ప్రచారం చేశారు. ప్రచారం చేసిన కట్టుకథల్లో ముఖ్యమైంది ఏదంటే – కాళీమాత ప్రత్యక్షమై శివాజీకి ఒక ఖడ్గాన్ని బహుకరించిందని! కాళీమాత అబద్దమని- తెలుస్తూనే ఉంది. శివాజీ కత్తిని పరిశీలించిన పరిశోధకులు తేల్చిన విషయమేమంటే- ఆ కత్తిమీద పోర్చుగీసు లిపి కనిపించింది. కాబట్టి, ఆ కత్తిని ఆ దేశం నావికులెవరో తెచ్చి శివాజీకి ఇచ్చి ఉంటారని నిర్ధారించారు. చివరగా మరొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. శివాజీ మరణవార్త వినగానే ఔరంగజేబు తనసభను ముగించి, ఖిన్నుడై, మసీదుకు వెళ్లి నమాజ్‌ చదివాడు. ”ఏఅల్లా శత్రువునిచ్చినా సరే శివాజీవంటి వీరుణ్ణి ఇవ్వమని” ప్రార్థించాడు.నేటి ఈ మనువాదుల్లాగా పండగ చేసుకోలేదు. ముస్లిం అనగానే నీచంగా మాట్లాడే మోడీ భక్తులు తెలుసుకోవాల్సిన అంశం ఇది!
– కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత,
జీవశాస్త్ర వేత్త (మెల్బోర్న్‌నుంచి)
– డాక్టర్‌ దేవరాజు మహారాజు