గణపతి విగ్రహాల వద్ద డిజే లు పెట్టరాదు

DJs should not be placed near Ganapati idols– పట్టణ సీఐ వర గంటి రవి
నవతెలంగాణ – జమ్మికుంట
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం జమ్మికుంట పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో సుమారు 292 విగ్రహాలను ఆయా ఉత్సవ కమిటీ నిర్వాహకులు శనివారం ప్రతిష్టించారని అయితే వినాయకుని విగ్రహాలు ప్రతిష్టించిన దగ్గర ఎట్టి పరిస్థితుల్లో డీ జే లు పెట్టరాదని జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి తెలిపారు. వినాయకుని విగ్రహాలను ప్రతిష్టించిన దగ్గర రాత్రిపూట కూడా తప్పనిసరి ఉత్సవ కమిటీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉండాలన్నారు. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ దగ్గర నుండి విద్యుత్ కొరకు పర్మిషన్ తీసుకొని వాడాలన్నారు. విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. అనుకోకుండా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినట్లయితే నివారించడం కొరకు అందుబాటులో నీటిని ఉంచుకోవాలన్నారు. విగ్రహం పెట్టిన వద్ద మద్యం సేవించరాదని, దేవుని విగ్రహం వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో పూజలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఉత్సవ కమిటీ నంబర్లను వాట్సప్ గ్రూపుగా ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే ఆ గ్రూపులో తెలపాలని ఆయన కోరారు. పోలీస్ శాఖ ఇచ్చిన నియమ నిబంధనలు ఉత్సవ కమిటీ పాటించాలన్నారు.