సోషలిజం వైపు.. అస్ట్రేలియా యువత చూపు..

Towards Socialism.. View of Australia's Youth..అక్కడేమీ ప్రభావితం చేసే విధంగా కమ్యూనిస్టు పార్టీ లేదు, పురోగామి ఉద్యమాలూ లేవు. వాటి పట్ల వ్యతిరేకత ఉన్న పాలకవర్గం, మీడియాదే ఆధిపత్యం. కమ్యూనిస్టులు కూడా కొన్ని పత్రికలు, వెబ్‌సైట్లు నడుపుతున్నప్పటికీ వాటి ప్రభావం పరిమితమే. అయినా ఆస్ట్రేలియాలో యువత సోషలిజం పట్ల సానుకూలత చూపుతున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. అభివఅద్ధి చెందినట్లు చెబుతున్న దేశాలన్నింటా జనం ప్రత్యేకించి యువత పెట్టుబడిదారీ వ్యవస్థ పట్ల విముఖత చూపుతున్నారు. 2024 జూన్‌ 24న ‘యుగవ్‌’ అనే సంస్థ ఆస్ట్రేలియాలో జరిపిన సర్వేలో 18-24 ఏళ్ల మధ్య యువతలో 53 శాతం మంది సోషలిజం పట్ల సానుకూలత చూపగా తటస్తంగా 25 శాతం, పెట్టుబడిదారీ వ్యవస్థకు అనుకూలత వెల్లడించిన వారు 22 శాతం ఉన్నట్లు తేలింది. అదే మొత్తం అన్ని వయసుల వారిలో అలాంటి అభిప్రాయాలు వెల్లడించినవారు 27-42-31 శాతాల చొప్పున ఉన్నారు. 2019 అక్టోబరులో ‘యుగవ్‌’ ప్రశ్నలకు 28 శాతం మంది ఆస్ట్రేలియన్లు తమకు సోషలిజం అంటే ఏమిటో తెలియదని చెప్పగా 13 శాతం మంది ఆ వ్యవస్థ కలుపుగోలుతనంతో ఉంటుందని చెప్పారు. సోషలిజాన్ని నిర్వచించమని అడిగిన ప్రశ్నకు అమెరికా యువత 60 శాతం మంది సరైన సమాధానం చెప్పగా ఆస్ట్రేలియన్లు 30 శాతమే ఉన్నారు. అలాంటి యువత 2024లో 53 శాతం మంది సానుకూలత చూపటాన్ని గమనించాలి. దీని అర్ధం వారందరికీ సోషలిజం అంటే పూర్తిగా తెలిసిందని కాదు. సోషలిజం అంటేనే అణచివేత అని భావించిన స్థితి నుంచి బయటపడి ”సోషలిజం” తాము జీవిస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థకంటే మెరుగ్గా ఉంటుందనే అభిప్రాయం ఏర్పరుచుకోవటాన్ని ఇక్కడ గమనించాల్సిన, ఆహ్వానించాల్సిన అంశంగా చూడాలి. వీరి శాతం ఏటేటా పెరుగుతున్నది. ‘యుగవ్‌’ 2019 అక్టోబరులో ”కమ్యూనిజం బాధితులు” పేరుతో ఏర్పడిన ఒక సంస్థ తరఫున అమెరికా, ఆస్ట్రేలియాల్లో సర్వే చేసింది. యువతలో సోషలిజం అంటే సమ్మతి లేదా ఆదరణ పెరుగు తున్నదని ఆ సర్వేలో తేలినట్లు ప్రకటించింది.ఇదంతా ఎప్పుడు? సోషలిజంలో అణచి వేస్తారు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదు, భవిష్యత్‌ లేదు, అది విఫలమైంది అని ప్రచారం పెద్ద ఎత్తున జరుపుతున్న తరుణంలోనే అన్నది గమనించాలి. ప్రచ్ఛన్న యుద్ధం పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేకతను పెద్ద ఎత్తున రెచ్చగొట్టిన పరిణామాలను చూసిన పాత తరం వారిలో ఉన్న వ్యతిరేకభావం యువతరంలో లేదని ఆ సర్వేలో తేలింది.ఇప్పుడు కమ్యూనిజానికి వ్యతిరేకంగా తక్కువ ప్రచారం జరుగు తోందా? కానే కాదు, ఏ మాత్రం తగ్గలేదు.
తాజా సర్వే జరిగిన నేపథ్యాన్ని చూస్తే అనేక దేశాల్లో యువత సోషలిజం గురించి అధ్యయనం చేయటంతో పాటు నయా ఫాసిస్టు, మితవాద శక్తులు తమ సమస్యలకు పరిష్కారం చూపగలవేమో అన్న భ్రమలతో అటువైపు కూడా మొగ్గుతున్నారు. ఫ్రాన్సులో, తాజాగా జర్మనీలోని తూర్పు ప్రాంతంలో జరిగిన ఒక రాష్ట్ర ఎన్నికల్లో పచ్చి మితవాదులు పెద్ద పార్టీగా అవతరించారు. జీవన ఖర్చు పెరగటం, గఅహ సంక్షోభం ఆస్ట్రేలియన్‌ యువతను సోషలిజం గురించి ఆలోచింప చేస్తున్నదని తేలింది. జనాభాలో 18-34 ఏళ్ల వయస్సు వారిలో 41 శాతం మంది సోషలిజాన్ని సమర్ధించగా, 35కు పైబడిన వారిలో 21 శాతం మంది ఉన్నారు. అదే వయసులో ఉన్నవారు పెట్టుబడిదారీ విధానాన్ని 34 శాతమే సమర్ధించినట్లు విశ్లేషణలో తేలింది. యువత సోషలిజం వైపు ఎందుకు మొగ్గుతున్నారన్న ప్రశ్నకు యుగవ్‌ డైరెక్టర్‌ పాల్‌ స్మిత్‌ మాట్లాడుతూ యువతరం ఎంతో భిన్నమైన ఆర్థిక పరిస్థితిని చవిచూస్తున్నారని, 2008 ద్రవ్య సంక్షోభం తరువాత శ్రామికశక్తిలో చేరిన యువత అసంతృప్తికి లోనై సోషలిజం వైపు మొగ్గుతున్నట్లు చెప్పాడు. పెద్ద తరాలు మంచివేతనాలతో కూడిన జీవితాలను గడపగా యువతకు అలాంటి హామీ లేదని, విద్య, గృహాలకు ఎక్కువగా చెల్లిస్తున్నారని అన్నాడు. ఒక స్థిరమైన ఉపాధి లేకపోవటం, తాత్కాలిక పనివారిని తీసుకొనే వాతావరణం ఎక్కువగా ఉండటంతో వారసత్వంగా వచ్చినవి ఉంటే తప్ప అద్దె ఇళ్లలో నివసించలేని స్థితి ఏర్పడింది. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. గాజా వంటి చోట్ల జరుగుతున్న దారుణాలను సామాజిక మాధ్యమాల్లో చూస్తున్న వారు పెట్టుబడిదారీ విధానం యుద్ధాలను ప్రోత్సహిం చటం ఎందుకని ప్రశ్నలు సంధించటం పెరిగింది. ఆస్ట్రేలియాలో పర్యా వరణాన్ని పరిరక్షించాలని కోరుకొనే వారు 64 శాతం మంది సోషలిజాన్ని అభిమానించగా, లేబర్‌ పార్టీ 31, సంకీర్ణ కూటమి మద్దతుదార్లలో కేవలం 12 శాతమే ఉన్నారు. కార్పొరేట్ల లాభాలకంటే జనం ప్రయోజనాలు, భూగోళాన్ని పరిరక్షిం చాలని కోరుకొనే వారు పెరుగు తున్నారు.
యువతలో ఎందుకీ మార్పు? కమ్యూనిజం విఫలమైందని ప్రచారం జరిగిన చోటే పెట్టుబడిదారీ విఫలమైందని ఆ విధాన గట్టి సమర్ధకుడైన థామస్‌ పికెట్టి వంటి వారు సాధికారికంగా స్పష్టం చేసిన తరువాత యువత ఆలోచించకుండా ఎలా ఉంటుంది? సోషలిస్టు చైనా, వియత్నాం నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులనే నిత్యం వాడుతున్నపుడు ఆ వస్తువులను మన దేశంలో ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నాం అని ఎక్కడికక్కడ యువత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు లేరు. 1995-2010 మధ్య జన్మించిన వారిని జడ్‌ తరం అని పిలుస్తు న్నారు. వీరిని సోషలిజం (ఆకర్షిస్తున్నదని) కవ్విస్తున్నదని కొందరు వర్ణించారు. ముఖ్యంగా అమెరికాలో ఈ ధోరణి కనిపిస్తోంది. అనేక మంది ‘మేం సోషలిస్టులం’ అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఒకవైపు అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ఇప్పటికీ పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉంది. అయితే అక్కడ దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు యువతను ఆలోచింపచేస్తున్నాయి. కమ్యూనిజం, సోషలిజం గురించి వక్రీకరణలు కొనసాగుతున్నప్పటికీ టీచర్లు బోధిస్తున్న అంశాలలో డెన్మార్క్‌, నార్వే వంటి చోట్ల స్కాండినేవియన్‌ సోషలిజం గురించి చెబుతున్న అంశాలు వారిని ఆకర్షిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. అమెరికా కంటే అక్కడి పరిస్థితి మెరుగ్గా ఉన్నందున అలాంటి సోషలిజాన్ని ఎందుకు అమలు చేయకూడదనే ప్రశ్నకు సరైన సమాధానం వారికి దొరకటం లేదు. అయితే ఆ దేశాల్లో ఉన్న జనాభా మొత్తం కూడా అమె రికాలో ఒక రాష్ట్రంలో ఉన్నవారికి సమానమని. 30 కోట్ల మందికి సోషలిజాన్ని అమలు చేయటం, దీర్ఘకాలం కొనసాగించటం సాధ్యం కాదని మాత్రమే చెప్పటం వారికి సంతృప్తిని కలిగించటం లేదు. ఆయా దేశాల జీడీపీతో పోలిస్తే అమెరికా జీడీపీ ఎక్కువగా ఉన్నపుడు ఎందుకు సాధ్యం కాదు?
మొత్తం మీద చెప్పాలంటే సోషలిజం గురించి ఆసక్తి కనపరుస్తున్న యువతను దారి మళ్లించేందుకు అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులు నానా పాట్లు పడుతున్నారు. వారి జీవితానుభవం నుంచే అలాంటి ఆసక్తి కలుగుతున్నదని సామాజిక మాధ్యమం, మీడియా తప్పుదారి పట్టిస్తున్నదని, వ్యక్తిగత స్వార్ధం యువతలో పెరిగిందని, దేశం ఏమైనా ఫర్వాలేదన్నట్లుగా తయారవుతున్నారని పెడబబ్బలు పెడుతున్నారు. దీనికి తమను తామే నిందించుకోవాలంటున్నారు.
అందరికీ ఆరోగ్య రక్షణ కావాలన్న డిమాండ్‌కు యువత మద్దతు ఇవ్వటానికి మేధావుల సైద్ధాంతిక బోధన కారణం కాదని, పెరుగుతున్న ఖర్చు, బీమా సౌకర్యం లేకపోవటమే అంటున్నారు.
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేనట్లుగానే వాస్తవాలు, జీవిత అనుభవాల నుంచి పక్కదారి పట్టించాలంటే కుదరదు.అనేక దేశాల్లో ఇప్పుడు సోషలిజాన్ని యువత కోరుకోవటానికి పెట్టుబడిదారీ వ్యవస్థలలో వారి కలలు కల్లలు కావటమే కారణం. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారంతో జనాల బుర్రలు నిండటం తప్ప కడుపు నిండదని తేలిపోయింది.
– సత్య