పాలనా రథానికి ఉద్యోగ, ఉపాధ్యాయులే ప్రగతి చక్రాలు. వారిని భద్రతగా చూసుకోవాల్సిన బాధ్యత పాలకులదే. కానీ అనాదిగా ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం కూడా సరైన వైద్యసేవలందించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉచిత వైద్య సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్)కు అక్రమాల జబ్బు సోకి మరుగున పడింది. గత మూడేండ్లుగా ఈ పథకం కింద వైద్య సేవల కోసం వెళ్లే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కొన్ని ఆస్పత్రులు వైద్యమందించడానికి నిరాకరిస్తున్నాయి. దానికి కారణం, గత కొంతకాలంగా ఈహెచ్‌ఎస్‌కు సంబంధించి రూ.వందల కోట్ల వరకు బకాయిలు ఉండటం. దీంతో ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ పథకం పట్ల నిరాసక్తతను చూపుతున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగమంటే కుటుంబానికే ఓ భరోసా. కానీ పాలకుల విధానాలు, మారుతున్న ధోరణుల కారణంగా ఉద్యోగం కత్తిమీద సాములా మారింది. జిల్లాల పునర్విభజన తర్వాత ఉద్యోగులపై పని భారం పెరిగింది. నలుగురు చేయాల్సిన పని ఒక్కరే చేయాల్సి వస్తున్నది. ఉద్యోగ విరమణ పొందిన వారి స్థానంలో గత దశాబ్దకాలంగా కొత్త నియామకాలు చేపట్టలేదు. దీనివల్ల సెలవులు తీసుకోకుండా రాత్రింబవళ్లూ నిరంతరాయంగా పని చేయడం వల్ల ఒత్తిడి పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అధిక రక్తపోటు, గుండెజబ్బు, మధుమేహం, దృష్టిలోపం వంటి రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా నలభై ఏండ్లు దాటిన ఉద్యోగులు అనారోగ్యంతో సతమతమవుతున్నారు.
స్వాంతన చేకూర్చని రీయింబర్స్‌మెంట్
ఉమ్మడి రాష్ట్రంలో 1972 నుంచి అమలవుతున్న సమీకృత వైద్య సహాయ నిబంధనలకు అనుగుణంగా మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమలుల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షనర్లు డబ్బులు చెల్లించి వైద్యం పొంది చికిత్స అనంతరం బిల్లులందజేస్తే నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది. మొదట ఉద్యోగులు, పెన్షనర్లకు అమలు చేసిన ఈ పథకాన్ని 2005 మార్చి నుంచి ఉత్తర్వు నెంబర్ 74 ద్వారా ఉపాధ్యాయులకు వర్తింపజేసింది. కానీ పథకం ఉద్యోగులకు స్వాంతన చేకూర్చలేకపోయింది. ఆస్పత్రుల నుంచి బిల్లులు పొందడం తర్వాత వాటిని సమర్పించడం, బిల్లులు మంజూరు కోసం కార్యాలయాల చుట్టూ తిరగడం నెలల తరబడి ఎదురు చూడడం ఇబ్బందికరంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో బిల్లుల మంజూరు కోసం తోటి ఉద్యోగులు అధికారులకు లంచాలు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఉద్యోగులు వైద్య చికిత్సల కోసం వచ్చిన మొత్తం డబ్బులు కాకుండా అందులో సగం వరకే ప్రభుత్వం మంజూరు చేస్తుంది. గుండె జబ్బులు, నరాలు, మెదడు సంబంధిత శాస్త్ర చికిత్సలు, డెంటల్ చికిత్సలకు కుటుంబాలకు ఎంత ఖర్చయినా రూ.2లక్షల వరకే పరిమితి ఉండటంతో ఉచిత వైద్య సేవలు అందని ద్రాక్షగా మారాయి.
భరోసానివ్వని ఈహెచ్‌ఎస్
రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షనర్లకు గత తొమ్మిదేళ్లుగా గత ప్రభుత్వం అమలు పరిచిన ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సరైన ఆరోగ్య భరోసా ఇవ్వలేకపోతున్నది. ఈ పథకం కింద ప్రవేశపెట్టిన హెల్త్ కార్డుల ద్వారా నగదు రహిత చికిత్సలు పొందే వీలున్నా కూడా ప్రయివేటు ఆస్పత్రుల నిర్వాకం వల్ల ఉద్యోగులు సరైన వైద్యం పొందలేకపోతున్నారు. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు తమకు లాభం కలిగించే ట్రీట్‌మెంట్ మాత్రమే ఈహెచ్‌ఎస్ కింద అందిస్తున్నాయి. ఏ ఆస్పత్రిలో ఏయే చికిత్సలు చేస్తున్నారనే అంశంపై అవగాహన లేక లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు.ప్రాథమికంగా ఓ.పి స్థాయిలో చూపించుకునేందుకు ఆయా జిల్లాలో 14 వెల్‌నెస్ కేంద్రాలను ఏర్పాటు చేసినా సరైన వైద్య పరికరాలు, యంత్రాలు లేవు. మందులందక కొరత కూడా తీవ్రంగానేవుంది. రాష్ట్రంలో ఈ పథకం కింద కార్పొరేట్ ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయల బకాయి పడింది. బకాయిలు చెల్లించకపోవడంతో కార్పొరేట్ ఆస్పత్రులు హెల్త్ కార్డులను అనుమతించడం లేదు. ఈహెచ్‌ఎస్ సరిగా అమలుకాక, దానికి సమాంతరంగా మెడికల్ రీయింబర్స్ మెంట్‌ను అమలు చేస్తున్నప్పటికీ అది కూడా అంతంత మాత్రమే వైద్యసేవలందిస్తోందని బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్యరూపం దాల్చని పథకం!
ప్రస్తుతం రాష్ట్రంలో 3.19 లక్షల ఉద్యోగులు, 1.09 లక్షలు ఉపాధ్యాయులు,2.50 లక్షల పెన్షనర్లు, వీరిపై ఆధారపడిన 15 లక్షల మంది కుటుంబ సభ్యులున్నారు. వీరందరికీ ఆరోగ్య కార్డుల ద్వారా కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యమందించుటకు ప్రభుత్వానికి తగిన సహాయ సహకారాలు అందిస్తామని ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలు చెప్పాయి. ఆ దిశగా ముందుకు కూడా సాగుతున్నాయి. గత ప్రభుత్వం అక్టోబర్ 2023లో 186 జీవో ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ ఈ ఆరోగ్య పథకం కార్యరూపం దాల్చలేదు. మూల వేతనంలో 1-2 శాతం చందా రూపంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉద్యోగ సంఘాలు గతంలోనే సంసిద్ధత ప్రకటించాయి. కావున ఉద్యోగ ఉపాధ్యాయులతో ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్న నూతన ప్రభుత్వం ఈ దిశగా దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. సంఘాలు కోరినట్టు ఉద్యోగుల జీతాల నుండి కొంత శాతం ప్రీమియం రూపంలో వసూలు చేసి వచ్చిన మొత్తం నగదుకు, అంతే మొత్తం నగదును ప్రభుత్వం ఇస్తూ ఒక ట్రస్టు ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలందిస్తే బాగుంటుంది. ఈ ట్రస్టు ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయులకు నాణ్యమైన వైద్య సేవలందించడానికి ఒక ఐఏఎస్ అధికారి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తే పర్యవేక్షణ కూడా సులభమవుతుంది. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తే వైద్య సేవలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారు. నీతి నిజాయితీతో ప్రజలకు సేవలందిస్తారు.
– అంకం నరేష్, 6301650324