
నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటల వైద్య సౌకర్యం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) గ్రామ కమిటీ సభ్యుడు పల్లపు రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పసర గ్రామంలో రాజు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం విష జ్వరాలు విస్తృతంగా ప్రబలుతున్న నేపథ్యంలో మండలానికి పెద్ద గ్రామంగా సమీప గ్రామాల ప్రజల తాకిడి అధికంగా ఉన్న పసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రజలకు 24 గంటలు నిరంతరాయంగా వైద్య సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని అందుకు అనుగుణంగా వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ ప్రారంభించాలని అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఒకే ఒక్క వైద్యుడు ఉండడం వల్ల పేషంట్ల తాకిడి అధికంగా ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో వైద్య సేవలు ప్రజలు పొందలేకపోతున్నారని ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నోసార్లు ఆస్పత్రిని సందర్శించి పేషెంట్ల సమస్యలను అడిగి తెలుసు కోవడం జరిగిందని అన్నారు. ఆసుపత్రిని సాయంత్రం వరకే మూసి వేయడం వల్ల కూడా ప్రజలు వయ ప్రయాసలకు ఓర్చాల్సి వస్తుందని అన్నారు. సీజనల్ వ్యాధులను మరియు జ్వర పీడితులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని జిల్లా వైద్యాధికారి వెంటనే స్పందించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు నిరంతరాయంగా ప్రజలకు వైద్య సేవలు అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.