– అనాదిగా వస్తున్న సంప్రదాయాని కాపాడుతున్న బంజారా బిడ్డలు
– పాశ్చాత్య సాంప్రదాయాన్ని లెక్కచేయని అడవి బిడ్డలు
– గిరిజన తండాల్లో అతిపెద్ద పండుగ తీజ్
నవతెలంగాణ-రామారెడ్డి
ప్రపంచవ్యాప్తంగా వెల్లివిరుస్తున్న పాశ్చాత్య సాంప్రదాయాన్ని లెక్కచేయకుండా, అనాదికాలంగా వస్తున్న సాంప్రదాయాన్ని బతికించుకోవడం తెలంగాణ ప్రత్యేకత. తెలంగాణలో బోనాలు, నాగోబా జాతర, సమా జంలో బతుకులు నేర్పే ప్రకృతి పండుగ బతుక మ్మ లాంటి ఉత్సవాలను ప్రతి సంవత్సరం ప్రజలు జరుపుకుంటున్నారు. గిరిజన తాండాల్లో ఉండే బంజారాలు ఆచారాలు, వేషధారణ, సంస్కృతి సంప్రదాయాలను బతికించుకుంటూ ప్రతి సంవత్సరం జూలై నుంచి సెప్టెంబర్ మాసం వరకు, ప్రతి బుధవారం మొదలుకొని మరుసటి గురువారం వరకు 9రోజులు గిరిజనులు అతి పెద్ద పండుగగా తీజ్ నిర్వహిస్తారు.
పూర్వం గిరిజన తండాల్లో వ్యాధులు, కలరా వచ్చి వందల సంఖ్యలో ప్రజలు చనిపోతుంటే తాండా పెద్దలు సమావేశమై.. సేవాలాల్ మహారాజ్, దండీమేర మాయ డిలను, జగదాంబ మాతకు పూజించిన నుంచి తండాలు సుఖసంతోషాలతో ఉంటున్నారని, యువతీ యువకులకు మంచి పెండ్లి సంబంధాలు వచ్చాయని వారి నమ్మకం. ఆప్పటి నుంచి వస్తున్న ఈ సాంప్రదాయక పండుగనే తీజ్.
పెండ్లి కాని గిరిజన ఆడబిడ్డలు నియమనిష్టలతో, ఉపవాస దీక్షలతో ఈ పండగను ప్రారంభిస్తారు. ప్రారంభానికి ఒక రోజు ముందు రాత్రి గోధుమలను, శనిగలు నానబెట్టి, మరుసటి రోజు ఉదయాన్నే చీమలు తీసిన మట్టితో పాటు ఎండిన ఆవుపేడను కలిపి వెదురుతో అల్లిన ఓ కొత్త బుట్టలో వేసి, గోధుమలను బుట్టలో చల్లి, తండాలోని పెద్దమ నిషి ఇంటివద్ద మంచే ఏర్పాటు చేసి దానిపై ఉంచుతారు. సాయంత్రం అక్కడే రేణి కొమ్మను నాటి, వాటి ముళ్లకు శనగలను తొడిగి గిరిజన సాంప్రదాయక ఆట ”బోరెడీ తీజ్”ను నిర్వహిస్తారు. ఉపవాస దీక్ష చేపట్టిన యువతులు తొమ్మిది రోజులు పచ్చ కూరతో పాటు, మక్క గట్కను ఒక్కపూట మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. రెండవ రోజు నుంచి ఎనిమిదో రోజు వరకు గోధుమలకు రోజు మూడు సార్లు వాగులు, బావులు, బోరు బావుల నుంచి తీసుకువచ్చిన నీటిని కొత్త బుట్టలో నాటిన గోధుమలకు యువతులు అందిస్తారు.
ఎనిమిదవ రోజు రాత్రి ”గానుగోతు” తీజ్ నిర్వహిస్తారు. గౌరీ, గౌర విగ్రహాలను మట్టితో ప్రతిష్టించి భోగ్ బండారు వేస్తూ గిరిజనులంతా కలిసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నాటిన గోధుమలు పచ్చగా ఎంత ఏపుగా పెరిగితే అంత శుభమని నమ్ముతారు. తొమ్మిదవ రోజు ఉదయం గొర్ల, మేకలతో యాటలను కోసి వంటలు చేస్తారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పెంచిన గోధుమ బుట్టలతో (బతుకమ్మ)ను గిరిజన వేషాధారణ, సాంప్రదాయాలతో డప్పు వాయిద్యాలతో, డీజే సప్పుల్లా మధ్య తలపై ఎత్తుకొని గిరిజన నృత్యాలతో, ఆటపాటల మధ్య సాయంత్రం స్థానిక చెరువులో నిమజ్జనం చేస్తారు. పిల్లపాపలతో ఆయురారోగ్యాలతో, సకల సంపదలతో, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, యువతులు మంచి సంబంధాలు కుదరాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాత్రి బంధుమిత్రులతో కుటుంబ సమేతంగా మాంసాహారంతో సహపంక్తి భోజనాలు చేస్తారు. అక్కడితో తీజ్ మహౌ త్సవం బంజారాలు ఆ సంవత్సరం స్వస్తి పలుకుతారు.