ఆ సమస్యకు చెక్‌

Check that problemనిద్రలేమి సమస్యతో బాధపడే వారికి వ్యాయామం ఎంత అవసరమో ఇటీవల నిర్వహించిన అధ్యయనాల్లో మరోసారి వెల్లడైంది. ఈ సమస్యకు వ్యాయామాలు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వారానికి కనీసం రెండు మూడు సార్లు చేసినా రాత్రిపూట బాగా నిద్ర పడుతున్నట్టు అధ్యయనంలో తేలింది.
వ్యాయామం చేయడం వల్ల కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు.. ఎన్నో రకాల లాభాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల మానసిక ఆరోగ్య సమస్యలూ దూరమవుతాయి. ఊబకాయం మొదలు గుండె సంబంధిత సమస్యల వరకు ఎన్నో రకాల సమస్యలకు వ్యాయామం బెస్ట్‌ ఆప్షన్‌గా చెబుతారు. అయితే వ్యాయామంతో నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇటీవల నిర్వహించిన పరిశోధన కోసం సుమారు 4400 మందిని ఎంచుకొని వారానికి ఎన్నిసార్లు, ఎంతసేపు, ఎంత తీవ్రతతో వ్యాయామం చేస్తున్నారు, నిద్రలేమి లక్షణాలు ఎలా ఉన్నాయి.? లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అలాగే రాత్రిపూట ఎంతసేపు పడుకుంటున్నారు.? పగటిపూట ఎంతవరకూ మగతగా ఉంటున్నారు.? అనే విషయాలను పరిశీలించి ఈ విషయాలను తెలిపారు.
వారానికి కనీసం రెండు, అంతకన్నా ఎక్కువసార్లు వ్యాయామం చేసేవారిని చురుకుగా ఉన్నవారిగా పరిగణనలోకి తీసుకుని వారి నిద్రకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఇలాంటి వారిలో నిద్రలేమి ముప్పు 42 శాతం తక్కువగా ఉంటోందని గుర్తించారు. అలాగే వీరిలో నిద్రలేమి లక్షణాలు 22-40 శాతం వరకూ తక్కువగా ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది.