– పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరిన ఎస్సారెస్పీ, నిజాంసాగర్
– సాగునీటికి ఢోకాలేదు
– కళకళలాడుతున్న చెరువులు, కుంటలు
– హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
నవతెలంగాణ-నిజాంసాగర్
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకు న్నాయి. కాగా ఉత్తర తెలంగాణ వరప్రదాయిని ఎస్సారెస్పీతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సాగునీటి అవసరాలు తీర్చే నిజాంసాగర్ ప్రాజెకు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరాయి. దీంతో రానున్న రబీ సీజన్‌తో పాటు వచ్చే ఖరీఫ్ సీజన్‌కు సైతం సాగునీటికి ఢోకా లేదని ఆయకట్టు పరిధిలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు సైతం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు సైతం నీటిని విడుదల చేసిన విషయం విధితమే.
వర్షాకాలం ప్రారంభం నుంచి ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో నారు వేసిన వారు సైతం పలువురు నాట్లు వేయకుండా వదిలేసిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఎట్టకేలకు ఇటీవల భారీ వర్షాలు కురవడంతో ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండాయి. గత ఎండాకాలంలో బోసిపోయి కనిపించిన సాగునీటి ప్రాజెక్టులు అడపదడప వచ్చిన వర్షాలతో వర్ధనీరు వచ్చిన గత నెల ఆగస్టు వరకు పూర్తిస్థాయిలో నిండుకోలేదు. గత వారం కింద రెండు రోజులు కురిసిన భారీ వర్షాలకు తోడు.. ఎగువ నుంచి వచ్చిన వరదల కారణంగా ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. పూర్తిస్థాయిలో నిండుకోవ డంతో అదనంగా వచ్చే నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్టులకు తోడు స్థానిక నీటి వనరులైన చెరువులు, కుంటలు సైతం అలుగు పారుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నది పరివాహక ప్రాంతాల్లో పంటలకు నష్టం జరిగినా.. నీటి వనరులు సమృద్ధిగా ఉండటంతో రానున్న రోజుల్లో పంటలకు మాత్రం ఉపయోగకరంగా మారనున్నట్టు అభిప్రాయం అవుతుంది. అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్‌తో పాటు రబీ పంటలకు సైతం ఈ నీరు దోహదం చేయనుంది. ఉమ్మడి జిల్లాలో వర్షాధారం మీద ఆధారపడి పంటలు పండిస్తున్న రైతులు అధికంగా ఉన్న ఆయా సాగునీటి ప్రాజెక్టుల సైతం వారికి తోడుగా నిలుస్తున్నాయి. తాజాగా ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో నదులు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఆయ నదులు, వాగులపై నిర్మించిన ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు భారీ గా వచ్చి చేరడంతో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. దీంతో అధికారులు అధికంగా వచ్చే నీటిని కిందకి వదిలేస్తున్నారు. ప్రాజెక్టులు నిండు కుండల మారడంతో పంటలకు ప్రయోజనం చేకూర్చనుంది.
నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.802టీఎంసీల)కు గాను 1404.52 అడుగుల (17.108 టీఎంసీల) నీటి మట్టానికి చేరింది. దీంతో రానున్న రబీ సీజన్‌తో పాటు వచ్చే ఖరీఫ్ సీజన్‌కు సైతం మొత్తం ఉమ్మడి జిల్లాలో 1.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనుంది.
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో ఉమ్మడి నిజామాబాద్‌తో పాటు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఆయకట్టు పరిధిలోని పంటలకు సాగునీరు అందివ్వనుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలకు) గాను ప్రస్తుతం అదే స్థాయిలో నీరు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టు కింద ఖరీఫ్, రబీకి గాను సుమారు 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనుంది. దీంతో పాటు తాగునీటి అవసరాలు సైతం తీరుస్తుంది.
చెరువులు కుంటలతోనూ ప్రయోజనం
ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలు సైతం పంటల సాగుకు ఉపయోగపడుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో సుమారు 1515 వరకు చెరువులు ఉండగా ఖరీఫ్, రబి సీజన్లో వాటి కింద సాగు అవుతున్న ఆయకట్టుకు ఉపయోగపడుతున్నాయి. స్థానిక రైతులు మోటార్ల ద్వారా నీటిని తీసుకుంటూ పంటల సాగుకు ఉపయోగించుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలో చెరువుల ద్వారా అధికంగా పంట సాగు అవుతుండగా నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టుల ద్వారా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. చెరువులు కుంటలు నిండిపోవడం ద్వారా కేవలం పంటలకే కాకుండా పశువులకు సైతం తాగునీటికి ఉపయోగపడుతున్నాయి. చెరువులో నీళ్లు ఉంటే గ్రామాల్లోని చేతిపంపులు కూడా పనిచేసేందుకు ఆస్కారం ఉంటుంది. దానితో పాటు చెరువులు నిండితే మత్స్యకారులు చేపలు పెంచి వాటిని విక్రయించడం ద్వారా జీవనోపాధి అందుతుంది.
రబీకి ముందస్తుగా నారుమడులు సిద్ధం చేసుకోండి
టి. శ్రీనివాస్. చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ కామారెడ్డి
ఉమ్మడి జిల్లాలకు వరప్రదాయని నిజాం సాగర్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండింది. ఖరీఫ్, రబి పంటలకు ఆలీ సాగర్ వరకు లక్ష 30 వేల ఎకరాల వరకు నీరు ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. రైతులందరూ కూడా నవంబర్ లాస్ట్ వరకు రబి పంటకు నారుమడి వేసుకోవాలి. అయితేనే మార్చి లాస్ట్ వరకు పంటలన్నీ కూడా చేతికొస్తాయి. ఏప్రిల్‌లో ఎక్కువగా వడగండ్ల వాన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాని వలన పంటలన్నీ నష్టపోయే అవకాశం ఉంటుంది. మార్చ్ లో పంట చేతికి రాగానే మళ్లీ వర్షాకాలం అప్పుడు త్వరగా నారుమడులు వేసుకోవాలి. వర్షాలు లేట్ అయినా ఖరీఫ్ సాగు కోసం సైతం నిజాంసాగర్ నుంచి నుంచి నీటిని వదులుతాం.