
– జిల్లా కేంద్రంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించన్న మంత్రి
– కలెక్టర్ నారాయణరెడ్డి
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
ఈనెల 17న ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఇందుకుగాను అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్ల పై గురువారం అయన జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కేంద్రం మొదలుకొని, గ్రామపంచాయతీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీలలో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కలెక్టర్ చెప్పారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 17వ తేదీ ఉదయం 10 గంటలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని, పోలీసు గౌరవ వందనం తో పాటు, జిల్లా ప్రజలను ఉద్దేశించి సందేశం ఇస్తారని, ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ప్రజాపాలన దినోత్సవానికి పోలీస్ పరేడ్ మైదానంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే ఈ కార్యక్రమాలకు విద్యార్థులతో పాటు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, జిల్లా కేంద్రంలోని అన్ని కార్యాలయాల ఉద్యోగులందరూ హాజరుకావాలని ఆదేశించారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని డీఈవో, డిపిఆర్ఓ లను ఆదేశించారు. ప్రజాపాలన దినోత్సవ వేడుక ఆహ్వాన పత్రికలను ప్రజా ప్రతినిధులు,ముఖ్యులు అధికారులందరికీ ముందే పంపించాలని, జాతీయ పతాకావిష్కరణ తర్వాత ముఖ్య అతిథి జిల్లా ప్రజలకు ఇచ్చే సందేశాన్ని తయారు చేయాలని ముఖ్య ప్రణాళిక అధికారిని ఆదేశించారు. వేడుకలకు హాజరయ్యే వారందరికీ సీటింగ్ ఏర్పాట్ల తో పాటు, తాగునీరు, టెంట్లు, శానిటేషన్, ఇతర అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ పోలీస్ పరేడ్ మైదానంలో ప్రజాపాలన దినోత్సవ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లతో పాటు, పోలీసు గౌరవ వందనానికి,అలాగే బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒకరిని నోడల్ అధికారిగా నియమించనున్నట్లు తెలిపారు.అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తామని వెల్లడించారు. సందర్భంగా ఆయా శాఖల అధికారులు వారి వారి శాఖలకు సంబంధించి చేసే ఏర్పాటులపై మాట్లాడారు.ఈ టెలికాన్ఫరెన్స్ కు జిల్లా అధికారులు, తదితరులు హాజరయ్యారు.