హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో సీఏఎం ఎంటర్‌టైన్‌మెంట్, వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. గురువారం హీరో నాని ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ చేశారు. హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ,’నాన్న గురించి ఎంత చెప్పినా సరిపోదు. టీజర్ చూస్తే ఈ సినిమా థీమ్ అందరికీ అర్థమై ఉంటుంది. ఇది మార్వల్ సూపర్ హీరో సినిమా కాదు. కానీ ఆ సినిమాల్లో హీరోలకి ఉండే సూపర్ పవర్ ఈ సినిమాలో ఉంది. ఆ పవర్ పేరు ప్రేమ. ఇద్దరు సూపర్ హీరోల మధ్య జరిగే లవ్ స్టొరీ ఇది. నా కెరీర్‌లో బాగా సంతృప్తినిచ్చిన చిత్రమిది. దర్శకుడు అభిలాస్ సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కించాడు. అతని ప్రతిభని వెండితెరపై చూస్తారు. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. అక్టోబర్ 11న విడుదల చేస్తున్నాం’ అని అన్నారు. ‘ఫాదర్ సన్ మధ్య జరిగే బ్యూటీఫుల్ స్టోరీ ఇది.ఇందులోని భావోద్వేగాలు అందరి మనసుల్ని తాకుతాయి’ అని డైరెక్టర్ అభిలాష్ కంకర అన్నారు.