పేదలు, శ్రామిక జనుల కోసం, ఈ దేశంలో విప్లవం కోసం జీవిత పర్యంతం పరితపించిన గుండె ఆగిపోయింది. నిరంతరం విప్లవ చైతన్యాన్ని, రాజకీయ కర్తవ్యాన్ని బోధించిన గళం మూగబోయింది. అయిదు దశాబ్దాల ఆశయ గమనం ముగిసింది. అత్యంత సమర్థవంతంగా మూడు పర్యాయాలుగా సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం పార్టీకి తీరని లోటు. 72 ఏండ్ల వయసుకే మన నుండి దూరమవడం అత్యంత బాధాకరం. ఈ వార్త సహచరులకు, పార్టీ శ్రేణులకు, అభిమానులకు తీవ్ర వేదన కలగచేస్తున్నది.
1974లో సీపీఐ(ఎం)లో చేరిన ఏచూరి తెలుగువాడు కావడం మనకీ ఒకింత గర్వకారణమే. హైదరాబాద్, ఢిల్లీ నగరా లలో విద్యాభ్యాసం చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చదువుతూ విద్యార్థి సంఘానికి మూడుసార్లు అధ్యక్షులుగా ఎన్నికైన నాయకుడు. విద్యార్థిగా అత్యంత ప్రతిభను కనపరిచారు. ఆ తరువాత పార్టీ కేంద్ర కమిటీకి, పొలిట్‌బ్యూరోకు అంచలంచెలుగా ఎదుగుతూ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న ఏచూరి విప్లవ రాజకీయాల అధ్యయనంలో, ఆచరణలో నిబద్ధత, ఆశయంపై అంకితభావం కలిగినవారు. ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థి నాయకుడిగా ఆనాటి ప్రధానమంత్రిని ప్రత్యక్షంగా నిలదీసిన తెగువ, జైలుకు పోవడానికి కూడా వెరవని ధైర్యం ఏచూరిది. చైతన్యంతో కూడిన చొరవ, చతురత, ఒప్పించి మెప్పించగల సామర్థ్యం ఆయన సొంతం. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని దేశ పరిస్థితులకు అన్వయించడంలో, అనేక సంక్లిష్టతలను అధిగమించడంలో ఆయన కనబరిచిన పరిణితి ఎంతో విలువైనది.
దేశంలో జరిగిన విద్యార్థి ఉద్యమాల్లో, కార్మిక, కర్షక ఉద్యమాల్లో, ఉద్యోగుల ఆందోళనల్లో, సరళీకృత ఆర్థిక ఉదారవాద విధానాలపై పోరాడటంలో, ప్రజాస్వామిక పోరాటాల్లో ముఖ్యంగా మతతత్వ వ్యతిరేక పోరాటం లో, దళిత, ఆదివాసీ హక్కుల రక్షణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన నాయకుడు ఏచూరి. యునైటెడ్ ఫ్రంట్, యూపీఏ ప్రభుత్వాల ఏర్పాటులో పార్టీ తరఫున కీలకమైన పాత్రను పోషించారు. నేటి ఇండియా బ్లాక్ ఏర్పాటులో ఆయన కృషి చిన్నదేం కాదు. లౌకిక ప్రజాస్వామిక పార్టీలను ఏకం చేయటంలో అహరహం కృషిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా అనేక విషయాలపట్ల లోతైన చర్చలు చేశారు. ముఖ్యంగా మతతత్వ విభజన రాజకీయాలను ఎండకడుతూ ఉదాహరణలతో భారతీయత అంటే ఏమిటో తెలియచేసిన తీరు సభ్యుల ప్రశంసలను అందుకుంది. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా కూడా గుర్తింపును పొందారు.
సీపీఐ(ఎం) జాతీయ నాయకుడిగా దేశదేశాల కమ్యూనిస్టులతో చర్చలు, స్నేహ సంబంధాలను నెలకొల్పడంలో ఏచూరి చేసిన కృషి మరువలేనిది. నేపాల్‌లో కమ్యూనిస్టు పార్టీల ఐక్యతతో అక్కడ ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న సందర్భంలో ఏచూరి సలహాలు, సూచనలు కీలక భూమిక పోషించాయి. ప్రపంచ రాజకీయాలు, సైద్ధాంతిక విషయాలు, ఆర్థిక విశ్లేషణ, తత్వశాస్త్రం మొదలైన అనేక విషయాలను లోతుగా అధ్యయనం చేస్తూ, విశ్లేషించే సామర్థ్యం ఉన్నవాడు కామ్రేడ్ ఏచూరి. రచయితగా ఎన్నో ముఖ్యమైన విషయాలపై రచనలు చేశారు. అనేక భాషలలో మాట్లాడే సామర్థ్యం ఆయనకున్నది. సహచరులపట్ల పార్టీ కార్యకర్తలపట్ల ఎంతో ప్రేమతో, స్నేహంతో వ్యవహరించే వారు. కార్యకర్తలు కూడా ఏచూరిగారంటే అమితంగా ఇష్టపడతారు. అందుకే ఆయన మరణానికి తీవ్ర కలత చెందుతున్నారు.
”వెన్నెలొచ్చి అడిగింది పల్లెను, ఎర్రజెండా బిడ్డ ఏడనీ..
వేకువొచ్చి చూసింది ప్రతి ఊరిలో, ఏడి ఏడా కానరాడేమని
నింగికెగసిన ఓ నేల తారా! నేలకొరిగిన వీరాధివీరా!
నిన్ను విడిచి మేముండేదెలా! నీ ఆశయాన్ని సాధిస్తమయా!” అని పాడుకుంటున్నారు.
ఏచూరి లేకపోవడం సీపీఐ(ఎం)కు, వామపక్ష ఉద్యమానికి తీరనిలోటు. ఆయన నడిచిన మార్గంలో అంతే నిబద్ధంగా ఆశయానికి అంకితమవటమే ఆయనకు మనం అర్పించే అసలైన నివాళి. కామ్రేడ్ ఏచూరి అమరుడు. అర్పిస్తున్నాం విప్లవ జోహార్లు!