తెలంగాణ రైతాంగ పోరాటం ఎందరిలోనో చైతన్యం నింపింది. పోరాటంవైపు నడిపింది. ముఖ్యంగా పరదాల చాటున నాలుగ్గోడలకే పరిమితమైన తెలంగాణ మహిళల్లో ఉత్తేజాన్ని నింపింది. సాంప్రదాయ సంకెళ్లను తెంచుకుని ఎర్రజెండా చేతబట్టే ధైర్యాన్ని ఇచ్చింది. అభ్యుదయ భావాలతో పెరిగిన వారికి సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ధైర్యంగా ఎదిరించే శక్తిని ఇచ్చింది. అలాంటి వ్యక్తే ప్రియంవద.
ప్రియంవద పుట్టింది నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం. తండ్రి రామకృష్ణారెడ్డి, తల్లి లక్ష్మమ్మ. వీరిది మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. నాలుగవ తరగతి వరకు చదువుకున్నారు. నాడు స్త్రీలకు విద్య అంతంతమాత్రమే. భాగవతం, భారతం గురించి తాతయ్య ఆమెకు బోధించేవారు. దీంతో చదవడం అలవాటు చేసుకున్నారు. హిందీకూడా నేర్చుకున్నారు. చిన్నతనం నుండే కమ్యూనిస్టుపార్టీ సిద్ధాంతాలు, రష్యన్ సాహిత్యం, గోర్కి నవలలు చదివేవాళ్లు. అన్నయ్య దాయం రాజిరెడ్డి అప్పటికే ఉద్యమంలో ఉన్నారు. వదిన, ఇతర బంధువులంతా సాయుధపోరాటంలో పాలుపంచుకోవడంతో ఈమే ఉద్యమం వైపుకు ఆకర్షింపబడ్డారు.
తండ్రికి తెలియకుండా…
రెండవ ప్రపంచ యుద్ధం గురించి వెలువడే పుస్తకాలను చదివేవారు. దీంతో నాటి పరిస్థితిని అర్థం చేసుకోగలిగారు. ప్రజల సమస్యలనూ ఇట్టే అర్థసుకునేవారు. తండ్రి నుండి క్రమశిక్షణ నేర్చుకున్నారు. ‘నాన్న ఓ సారి ఊరుకెళ్లడంతో భువనగిరిలో జరిగే ఆంధ్రమహాసభకు అన్న, వదిన శశిరేఖతో పాటు నేనూ వెళ్లాను. ఉద్యమంలో పేరొందిన భీమిరెడ్డి నర్సింహారెడ్డి మా వదినకు అన్నయ్య. ఇలా మా బంధువర్గమంతా ఉద్యమంలో వుండేది. పార్టీ అప్పుడప్పుడే ఎదుగుతోంది. ఆంధ్రమహాసభకు వెళ్లొచ్చిన విషయం నాన్నకు తెలిసింది. అయితే నాన్న పరిస్థితి అర్ధంచేసుకున్నారు’ అంటూ ఆమె ‘వీర తెలంగాణ మాది’ పుస్తకంలో పంచుకున్నారు.
మూడేండ్లు జైలు జీవితం
ప్రియంవద దళంలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. పరోక్షంగా మాత్రమే సహాయం అందించారు. ఉద్యమంలో భాగంగా తుంగతుర్తి పోలీస్టేషన్‌పై దాడి చేసేటప్పుడు ప్రియంవద ఎర్రజెండా పట్టి ఊరు గుట్టపై నిలబడి సెంట్రీగా పని చేశారు. ఓసారి దళంతో కలిసి ప్రచారానికి వెళ్లారు. పోలీసులు ఆ సమయంలో వీరిని వెంబడించారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎలాగో తప్పించుకోగలిగారు. తూర్పుగూడెంలో ప్రియంవద సొంత ఇల్లువుండేది. అక్కడ ఉన్నప్పుడే 1947లో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. మూడేండ్లు జైలు జీవితం గడిపారు. తరువాత పార్టీ చీలిన తర్వాత ఎన్నికల వరకు మాత్రమే ఈమె పార్టీలో పనిచేశాను.
అభివృద్ధిపై దృష్టి పెడితేనే…
ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొనేశక్తి కమ్యూనిస్టు పార్టీ ద్వారానే తనకు వచ్చిందని ఆమె చెప్పుకునే వారు. మట్టిలోని మాణిక్యాలు ఈ ఉద్యమం ద్వారా బయటకు వచ్చాయంటారు. ధర్మభిక్షం, రాఘవేంద్ర, దేవులపల్లి వెంకటేశ్వరరావు, ప్రతాపరెడ్డిలతో ఈమెకు పరిచయం వుంది. అలాగే శశిరేఖ, స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, లలితమ్మ, సుశీలాదేవి ఈమెకు సహచరులు. నేటి పాలకులు ప్రజల కోసం గాక అధికారం కోసం పనిచేస్తున్నారని ఆమె ఆవేదన చెందేవారు. నాటి నిజాం కాలం పరిస్థితులే నేటికి కనిపిస్తున్నాయని తనని కలిసేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలతో, నాయకులతో ఆమె అంటుండేవారు. అలాగే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో ‘రాష్ట్ర విభజన జరిగినా ఇదే పాలకులు, ఇవే విధానాలుంటాయి. దీని కంటే తెలంగాణ ప్రాంత అభివృద్ధి గురించి దృష్టిసారిస్తే సరిపోతుంది’ అంటూ ఆమె తన అనుభవాల నుండి సూచనలు చేసేవారు.
నిషేధ కాలంలో…
ఆనాడు పార్టీ నాయకులంతా బాల్య వివాహాలు, స్త్రీల సమస్యలు, రైతు కూలీల సమస్యలపై ఉద్యమం చేసేవారు. ఆంధ్రమహాసభలో అడుగుపెట్టాక జీవితం, సమాజం అంటే ఏమిటో అర్థచేసుకున్నారు. ఆ రోజుల్లో తిరుగుబాటు ఉప్పెనలా ఉప్పొంగుతుండేది. దీంతో పటేళ్లు, దేశముఖ్‌లు ఉద్యమకారుల గురించి చెడుగా ప్రచారం చేసేవారు. పార్టీపై నిషేధం పెరగడంతో వీరంతా విజయవాడకు వెళ్లారు. అక్కడ కూడా ఊరికే కూర్చోలేదు. తెలంగాణా సాయుధపోరాటం ఎందుకు జరుగుతోందో అక్కడి ప్రజలకు వివరించేందుకు ప్రచారం మొదలెట్టారు. ఆయుధాలు పట్టి కాల్చడం కూడా నేర్చుకున్నారు.