ఏ వెలుగులకీ పయనం?

Which light is the journey?ఏ దేశం ఏ కాలంలో
సాధించినదే పరమార్థం?
ఏ శిల్పం? ఏ సాహిత్యం?
ఏ శాస్త్రం? ఏ గాంధర్వం?- (శ్రీ శ్రీ)
దేశ పురోగమనానికి బాటవేసేది విజ్ఞాన శాస్త్రమే. సైన్స్‌ నేర్చుకుంటే ప్రకృతికి అతీతమైన అతీంద్రియ శక్తులేవీ లేవని అర్థం కావాలి. ప్రకృతి సూత్రాలే ప్రపంచ గమనాన్ని, మనిషి మనుగడనూ నిర్ణయిస్తాయని అవగాహన కావాలి.మన దేశంలో సైన్స్‌ విద్యకు ప్రాధాన్యత ఉంది కానీ సైంటిఫిక్‌గా ఆలోచించడానికి ప్రాధాన్యత లేదు. విద్య నేర్చుకోవడానికి, విద్యాపరంగా ఆలోచించడానికి చాలా భేదం ఉంది. అబద్ధాలు చెప్పడం అపరాధమని చదువుకోవడం వేరు, ఆ ఆలోచనతో అబద్ధాలు చెప్పడం మానుకోవడం వేరు. చదువుకున్న సబ్జెక్టు నుంచి నిర్మాణాత్మకంగా మనం ఆలోచి స్తున్నామా అంటే కచ్చితంగా లేదు. ఎందుకిలా జరుగు తున్నది? సైన్స్‌లో పరిశీలన, ప్రశ్న, ప్రశ్నకు సమాధానం ఊహించడం, ప్రయోగం, నిర్ధారణ లాంటి సోపానాలు ఉన్నాయి. వీటన్నింటినీ మన విద్యావిధానంలో బట్టీ పట్టి వాటిద్వారా పరీక్షలు ఉత్తీర్ణులయ్యే పద్ధతి మనం ఆచరిస్తున్నాం. ఇది సహజంగా ప్రశ్నను, తద్వారా ఊహను చంపేస్తుంది. ప్రయోగాలు చాలా పాఠశాలల్లో, కళాశాలల్లో జరగడమే లేదు. చివరకు చిన్నప్పటి నుంచీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడం అదృష్టంతో ముడి వేసి, చూచి రాతలు పరీక్షల్లో ఎక్కువవుతున్న సంఘటనలు చివరకు ‘నీట్‌’ పరీక్షల్లో సైతం కనపడుతున్నాయన్న విమర్శలు న్నాయి. గుణాత్మక విద్య కనుమరుగవు తున్నదని కార్పొరేట్‌ వ్యవస్థలు సైతం ఆరోపిస్తున్నాయి.
మనం కాస్త వెనక్కు వెళ్లితే అసలు మన సంస్కృతిలోనే పిల్లలు పుట్టిన ముహుర్తాలను బట్టి జాతకాలను రాయిస్తారు. పెళ్లిళ్లలో జాతకాలు కలిసే వరకూ జాగ్రత్తలు తీసుకుంటున్న సమాజం మనది. ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్‌’ అని నన్నయ్య ఏ కాలంలో అన్నాడో గాని ఈ మాట మనం నమ్ముతాం. అభ్యుదయ భావాల గురజాడ ‘మంచి గతమున కొంచెమేనోరు/ మందగించక ముందుకడుగేరు’ అన్న మాట మనం పట్టించుకోం.పైగా మన దేశంలో సంపదలో 40శాతం కేవలం ఒకశాతం వున్న సంపన్నుల వద్ద పోగు పడిందని అంత ర్జాతీయ ఆర్థిక నివేదికలు చెబుతున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో నిరుపేదలు సాంఘికంగా, ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుంటే వారికి శాస్త్రీయ దృక్పథం అలవడే అవకాశం ఉండదు. తమ అదృష్టాన్ని వారు నిందించుకుంటారు.మనదేశంలో తగినన్ని అత్యాధునిక సాంకేతిక ప్రయోగశాలలు లేకపోవడం వలన చాలా మేధోవలసలు సంభవిస్తున్నాయి. భారత శాస్త్రవేత్తలు కొంతమంది విదేశాలకు తరలి పోతున్నారు. విదేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడి నోబెల్‌ బహుమతులు గెలుచుకున్నారు.చాలా కాలం విదేశీయుల పాలనలో ఉన్నందున కూడా మనదేశంలో సైన్స్‌ ఒక సబ్జెక్టుగా వృద్ధి చెందలేదు.ఈ పరిస్థితుల్లో కొన్నింటిలోనైనా జోక్యం చేసుకుంటానికి సైన్స్‌ ప్రచార సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి. కొందరు శాస్త్రవేత్తలు, పరిశోధనా విద్యార్థులు కూడా దేశంలో సైంటిఫిక్‌ టెంపర్‌ని వృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో జన విజ్ఞాన వేదిక అగ్రగామిగా ఉంది.
ముఖ్యంగా ఈమధ్య కాలంలో పర్యావరణ పరిరక్షణ, భూతాపం మొదలైన అంశాల మీద ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రయత్నం చేస్తున్నది. ప్రజారోగ్యం కోసం పలు సంస్థలతో కలిసి కరోనా సమయంలో సేవాకార్యక్రమాలు చేసింది. హెల్త్‌ క్యాంపులు నిర్వహిస్తున్నది.కుహనా సైన్స్‌ వాదనలను బట్టబయలు చేస్తున్నది. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొం దించడానికి క్విజ్‌ పోటీలు, చెకు ముకి సైన్స్‌ సంబరాలనే పేరుతో నిర్వహిస్తున్నది. విశ్లేషణాత్మక ఆలోచనలను విద్యార్థుల్లో పెంపొందించడానికి కృషి చేస్తున్నది. చెకుముకి సైన్స్‌ పత్రికను గత ముప్పై ఏళ్లుగా ప్రచురిస్తున్నది. విద్యావిధానంలో మార్పులు తీసుకురావడం కోసం ఉద్యమిస్తున్నది. ఒకవైపు సంఘ విద్రోహ శక్తులు కుల,మతాల పేరుతో విద్వేష బీజాలు నాటడాన్ని నిరోధించ డానికి ప్రయత్నాలు చేస్తున్నది. సైన్స్‌ ఫలాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చి సైంటిఫిక్‌ టెంపర్‌ వ్యాప్తికి కార్యక్రమాలు చేస్తున్నది. తద్వారా సామాజిక అసమానతలను రూపుమాపడానికి కృషి చేస్తున్నది. ఈ కృషిలో అభ్యుదయకాముకు లందరూ భాగస్వాములవు తారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నది.
(సెప్టెంబర్‌ 14,15 మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఈసిఐఎల్‌లో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభలు)

– పైడిముక్కల ఆనంద్‌ కుమార్‌