నవతెలంగాణ-ఆసిఫాబాద్
కోర్సు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకుండా వేధిస్తున్న జిల్లా కేంద్రంలోని రాజేంద్రప్రసాద్ బీఈడీ కళాశాల ఎదుట కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్‌ఐ, కేవీపీఎస్ యువజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దినకర్ మాట్లాడుతూ కళాశాలలో 2021-23 విద్యా సంవత్సరంలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఏడాది గడుస్తున్నప్పటికీ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెబుతున్నారని, ప్రభుత్వం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్‌తో సంబంధం లేదని విద్యార్థులను వేధిస్తున్నారన్నారు. కలెక్టర్ కు వినతి ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆదేశాలను కూడా పట్టించుకోవడంలేదని అన్నారు. అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న యాజమాన్యంపై ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని వారిని విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్, అధ్యక్షుడు టీకానంద్, బీసీ యువజన సంఘం నాయకుడు ప్రణరు, వివిధ సంఘాల నాయకులు మాలశ్రీ పాల్గొన్నారు.