సీతారాం ఏచూరి సీపీఐ(ఎం)లో అత్యున్నత నాయకుడు అని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో జోహార్లర్పించింది. వామపక్ష ఉద్యమ కాంతి అని ప్రధాని నరేంద్రమోడీ అభివర్ణించారు. ఏచూరితో సంప్రదింపుల ప్రక్రియను తాను పోగొట్టుకున్నానని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ నివాళులర్పించారు. స్నేహశీలి, ప్రతిభాశాలి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా వ్యాసం రాశారు.భారత రాజకీయాలలో ఏచూరిది గౌరవ ప్రదమైన స్థానమనీ, ఇతర పార్టీలకూ అందుబాటులో వుండే ప్రజ్ఞావంతుడైన నాయకుడనీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ప్రొఫెసర్లు సిపి చంద్రశేఖర్,ప్రబీర్ పురకాయస్త, బదిరీ రైనా వంటి సమకాలీనులు జెఎన్‌యు కాలంలోనూ, సీపీఐ(ఎం) అగ్రనేతగానూ ఆయన మానవీయ వైఖరిని ఆర్ద్రంగా ప్రస్తావించారు. డజన్ల మంది సంపాదకులు, పాత్రికేయులు ఆయన ఎంతగా తమతో కలిసిపోయే వారో, రాజకీయ గీత దాట కుండానే చెప్పవలసింది చెప్పేవారో అనుభవాలతో రాశారు. పుస్తక ప్రియుడుగా, పాటల ప్రేమికుడుగా, మీడియా సినీ ప్రపంచంలో మార్పులను గమనించే జిజ్ఞాసిగా ఆయన తీరును రచయితలు, కళాకారులు నెమరేసుకున్నారు.అదే సమయంలో ఏచూరిని ఆచరణ వాది అనీ,అన్ని పార్టీలకూ కామ్రేడ్ అనీ చాలామంది వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి అని కొందరు విపరీత చమత్కారాలు చేశారు. ఆయన పదవీకాలం ఎదురీతగా నడిచిందన్నట్టు, ఈ పదిహేనేళ్లలో క్రమేణా మరింత క్షీణించిపోయిం దన్నట్టు తెలుగులోనూ కొన్ని సంపాదకీయాలే వెలువడ్డాయి. సీపీఐ(ఎం) విధాన రూపకల్పనలో అంతర్గత చర్చను వ్యక్తి గతంగా నాయకుల మధ్య తేడాగా చూపే రాతలూ, మాటలు సరేసరి. ఓ ఇంగ్లీషు పత్రిక మరింత ముందుకు వెళ్లి 2009 తర్వాత ఏచూరి పతాక శీర్షికలలో రావడం బాగా తగ్గిపోయిందని పేర్కొంది. వ్యక్తిగతంగా ఆయ నకు సంతాపం తెలుపుతూ ఆయన జీవితాంతం పోరాడిన మౌలిక సిద్ధాంతాలను తక్కువ చేసే ఒక ధోరణి ఇది.
ఉద్యమ నిబద్దత
అటూ ఇటూ ఐఏఎస్‌లు, ఇంజినీర్లు, న్యాయమూర్తుల కుటుంబంలో అత్యంత ప్రతిభావంతమైన విద్యార్థిగా ప్రారంభమైన ఏచూరి అర్థశాస్త్ర అధ్యయనం తర్వాత ప్రజాఉద్యమానికి అంకితం కావాలని నిర్ణయించుకోవడం, ప్రకాశ్ కరత్ వంటివారు అందుకు తోడు కావడం అత్యంత సహజం. అగ్రశ్రేణి ప్రజ్ఞాశాలులు వామపక్ష భావాలను స్వీకరించి ప్రజల కోసం పనిచేయడం ప్రపంచ వ్యాపితంగా జరిగింది. ‘ఒక దాహార్తుడు మంచినీటి కోసం వచ్చినట్టు తాను ప్రతిఏటా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడానికి వస్తానని’ ప్రసిద్ధ చిత్రకారుడు ప్లాబో పికాసో అనేవారని ఏచూరి ఎప్పుడూ గుర్తుచేసేవారు. ఆ కోవలోనే ఆయన సార్థక జీవితం గడిపారు. ఐసియు నుంచి పంపిన ఆఖరి సందేశం కూడా పాలస్తీనా విముక్తి పోరాటం గురించి అవడం యాదృచ్చికం కాదు. ‘మీరు ఓడిపోతే ఎవరితో కలుస్తారు’ అని ఒక ఇంటర్వ్యూలో బర్కాదత్ అడిగితే ‘నేను విజయం సాధించగలననే నమ్మకంతో పోరాడుతున్నాను. ఓడిపోతే ఏం చేస్తావని మీరడిగితే ఎందుకు జవాబు చెప్పాలి?’ అని ఎదురు ప్రశ్న వేశాడు. జెఎన్‌యు విద్యార్థి నాయకుడుగా ఇందిరాగాంధీతో రాజీనామా చేయించడం ఆయన మొదటి విజయమైతే, మతతత్వ రాజకీయాలపై పోరాటంలో విశాల ఐక్యతను పెంపొందించి బీజేపీకి మెజార్టీ రాకుండా చేయడంలో ఫలప్రదం కావడం ఆయన ఆఖరి కీలక చొరవ.
నాలుగు దశాబ్దాల నడక
‘నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట అన్వయం’ అనే మార్క్సిస్టు మూలసూత్రం పాటించడం, అధ్యయనాలు, ఘన విజయాలతో పాటు ఎదురుదెబ్బలూ, ప్రతికూలతలూ అధిగమిస్తూ ముందుకు పోవడం ఏచూరి రాజకీయ జీవిత గమనంలో కీలకాంశమని వ్యాఖ్యాతలు గుర్తించవలసి వుంటుంది.మోడీ కాలానికే పరిమితమై పాఠాలు తీస్తే కుదరదు. 1977లో ప్రజలు తిరస్కరించిన ఇందిరాగాంధీ 1980లో తిరిగి అధికారానికి వచ్చారు. 1984లో ఆమె హత్య ప్రభావంతో రాజీవ్‌గాంధీ 400పైగా స్థానాలతో ప్రధాని అయ్యారు. 1985లో ప్రకాశ్ కరత్, సీతారాం ఏచూరి వంటివారు సీపీఐ(ఎం) నూతన తరం నాయకులుగా బాధ్యతల్లో తొలిఅడుగు వేసినప్పటి పరిస్థితి అది.రాజీవ్‌గాంధీ తర్వాతి ఎన్నికలలోనే ఓటమిపాలై నేషనల్ ఫ్రంట్ అనే లౌకిక కూటమి అధికారంలోకి వచ్చింది.విపిసింగ్ ప్రభుత్వంలో బీజేపీ చేరకుండా ఆపగలగడం,రథయాత్రను షరతుగా ఆ పార్టీ మెడమీద కత్తిపెడితే అడ్డుకుని అధికారాన్ని వదులుకోవడం వెనక వామపక్షాల పాత్ర చాలా వుంది. జాతీయ రాజకీయాలలో అప్పటి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సూర్జిత్, జ్యోతిబసుతోపాటు ఏచూరి ప్రవేశించడం వేగం పుంజుకుంది. ఇంత సుదీర్ఘకాలం పాటు జాతీయ రాజకీయ రంగంలో లౌకిక కూటముల ఏర్పాటు, వ్యూ హ ప్రతివ్యూహాలలో ప్రత్యక్ష పాత్ర వహిస్తూ వస్తున్న వారు బహుశా ఎంతోమంది వుం డరు. విధాన స్పష్టతతో పాటు వ్యక్తిగత స్నేహసంబంధాలు, పట్టు విడుపులతో వ్యవహ రించే ఏచూరి స్వభావం అందుకు గొప్పగా దోహడపడింది. వృద్ధ నాయకులతో పాటు యువతరంతోనూ సులభంగా కలసిపోవడమే ఆయన్ను మరింత జనప్రియుణ్ని చేసింది.
కీలక విధాన పత్రాలు
విజయపరంపరలు సాధిస్తున్నప్పుడు రాజకీయాలు నడపడం పెద్ద సమస్య కాదు. పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు సిద్ధాంతస్పూర్తిని నిలబెట్టడం పెద్ద సవాలు. 90వ దశకం ప్రారంభం నుంచి మతతత్వ రాజకీయాలు పెరగడం, పాలకపార్టీల అవకాశవాద రాజకీయాలు లౌకిక ప్రజాస్వామ్యానికి పెనుసవాలు విసిరాయి. అంతర్జాతీయంగా సోషలిస్టు శిబిరం ఎదురుదెబ్బ తినడం అశనిపాతమైంది. దాన్ని వెంటనంటి దేశంలోనూ సరళీకరణ విధానాలు, ద్రవ్య పెట్టుబడి విజృంభన రాజకీయాల స్వరూపమే మార్చివేశాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సైద్ధాంతికంగానూ దిశానిర్దేశం చేయడంలో ఏచూరి వంటివారి పాత్ర చాలా ప్రధానమైంది.సోవియట్ విచ్చిన్నం తర్వాత వెనువెంటనే మద్రాసులో జరిగిన 14వ మహాసభలో సైద్ధాంతిక సమస్యలపై తీర్మానం ప్రవేశపెట్టే బాధ్యత ఏచూరికి అప్పగించడమే ఇందుకు నిదర్శనమైంది. అప్పటికి మాకినేని బసవపున్నయ్య, జ్యోతిబసు,ఇంఎంఎస్,సూర్జిత్ వంటి హేమాహేమీలు వున్నారని గుర్తుంచుకోవాలి. 2012లో మారిన పరిస్థి తులకు తగినట్టు తాజాపర్చిన సీపీఐ(ఎం) కార్యక్రమాన్ని సమర్పించే పని కూడా ఆయనే నిర్వహించారు. అంతర్జాతీయ విభాగం బాధ్యుడుగా, దేశ దేశాల కమ్యూనిస్టు ఉద్యమాలు, ప్రగతిశీల శక్తులతో సంబంధాలు ఆయనకు అపారమైన అవగాహన, సమగ్ర సమాచారం చేరుతుండేది. ఆ విధంగా ఆయన విశ్వ విప్లవ నరుడు!
పదునైన ప్రచారం
1992-93 తర్వాత ముదిరిన మతశక్తులపై ప్రత్యేక అధ్యయనం చేసి హిందూరాష్ట్ర సిద్ధాంతం, దేశ సాంసృతిక వైవిధ్యంపై దాడి వంటి అంశాలను ఆయన ప్రతిభావంతంగా ముందుకు తెచ్చారు. గాట్, పేటెంట్ల పెత్తనం వంటి ఆర్థికాంశాలనూ విడమర్చి చెప్పగలిగారు. ఆ ఇరవయ్యేళ్లలో ఆయన పీపుల్స్ డెమోక్రసీ సంపాదకుడు గానూ అనేక విధాల ప్రయోజనకరమైన సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చారు. బయటి పత్రికల్లోనూ రాస్తూ వచ్చారు. ఛానళ్ల విషయానికి వస్తే ఆయన తొలినుంచి పరిచితమైన వ్యాఖ్యాత. దేశ రాజధానిలోని మేధాబృందాలు, కళాకారులతో ప్రత్యేక సంబంధాలు పాటిస్తూ భిన్న స్రవంతుల స్పందనలను గమనించడంలో ఆయన చాలా శ్రద్ధ పెట్టేవారు. బాబ్రీ విధ్వంసం తర్వాత ఇలాంటి వారెవరో ఎదురుపడి అడిగితే సరదాగా ‘వినిర్మాణం’ అంటూ ఆధునికానం తరవాదంలో వాడే పదాన్ని ప్రయోగించా రట. అదో చర్చ అయింది. మామూలూ భాషలో మాట్లాడుతూనే రాజ్యాంగ కోణాలు, సామాజిక వైరుధ్యాలు, అభివృద్ధి నిరోధక సవాళ్లు, ప్రపంచీకరణ ప్రభావాలు కళ్లకు కట్టినట్టు చెప్పడానికి ఆయన మేధస్సు కారణమైంది, మనోభావాల పేరిట ఈ పదాలను అడ్డుపెట్టుకుని రాజకీయం నడిపేవారిని నిలదీయడానికి ఇదే దారితీసింది. సామాజిక న్యాయంకోసం పోరాటం అవసరాన్ని ఎప్పుడూ గుర్తించడమేగాక అంబేద్కర్ మాటలను ఉటంకిస్తుండే వారు. 1993లో నేను విజయవాడ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడుగా ‘మీట్ ద ప్రెస్’కు పిలిస్తే ఆయన తాను చిన్నప్పుడు సంధ్యావందనంతో మొదలెట్టానని చెప్పడం, ఈనాడు మిత్రులు ప్రముఖంగా రాయడం అందరినీ ఆకర్షించింది. మనువాదంపై పోరాటం గురించి చెప్పడానికే ఈ ప్రస్తావన తెచ్చారు. 2017లో ఇదే రాజ్యసభలోనూ ప్రస్తావించి తన భార్య ఆమె తలిదండ్రులు వేర్వేరు మతాలు, రాష్ట్రాలకూ చెందిన వారనీ, ఇప్పుడు తన కొడుకును భారతీయుడుగా తప్ప మరేమని పిలవగలమని ప్రశ్నిస్తే చప్పట్లు మోగాయి. ఈ విధంగా భారత దేశం అనే భావన చర్చ తీసుకురావడం లోనూ చాలా సృజనాత్మకత కనిపిస్తుంది. ఇప్పుడు పాలకపార్టీలు అవకాశవాదం కొంతైనా తగ్గించుకుని మత రాజ కీయాలను విమర్శిస్తూ మాట్లాడుతున్నారంటే అది ఇలాంటి కృషి ఫలితమేనన్నది నిర్వివాదాం శం.తనను నాయకుడిని చేసిన జెఎన్‌యుపై మోడీ సర్కారు ఉక్కుపాదం మోపినపుడు జరిగిన రాజ్యసభ చర్చలో షేక్స్‌పియర్ భాషలో నాటి మంత్రి స్మృతిఇరానీకి జవాబిచ్చిన తీరు ఎవరూ మర్చిపోరు. ఏపీ విభజన హడావుడిగా ఆమోదించవద్దని, సావధానంగా చర్చించాలని నాడు ఆయన పట్టుపట్టిన తీరు ఎంత అర్థవంతమో ఇప్పటికీ అపరిష్కృ తంగా వున్న విభజన సమస్యలను చూస్తే తెలుస్తుంది. కొన్నేళ్ల కిందట సీపీఐ(ఎం)లో విభేదాల గురించి, తన బాధ్యతల గురించి మీడియాలో అదేపనిగా ఊహాగానాలు సాగుతున్నప్పుడు కూడా సూటిగానూ, సున్నితంగానూ సమాధానమిచ్చి ముగించిన ఏచూరి చివరకు- ప్రధాన కార్యదర్శిగానే జీవితం ముగించిన తొలినేత అయ్యారు.
తెలుగింటి బిడ్డగా…
బెంగాలీ, తమిళం,మరాఠీ, హిందీతో సహా బహుభాషా కోవిదుడైన ఏచూరి తెలుగు బిడ్డ కావడం ప్రత్యేకంగా గర్వకారణమైన విషయం.దేశభాషలందు తెలుగు లెస్స అన్న పద్యం మూలాలను గురించి చర్చించిన సందర్భం కూడా నాకింకా గుర్తుంది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కేతు విశ్వనాథరెడ్డి ప్రత్యేకించి తన పుస్తకానికి ఆయనతో ముందుమాట రాయించుకున్నారు. శాస్త్రీయ సంగీతంలో ముగ్గురు ప్రముఖులు దక్షిణాది వారే కావడంపై ఆ ముందుమాటలో ప్రస్తావించడం చాలా చర్చ అయింది. చెన్నై, కాకినాడ నుంచి హైదరాబాద్ వరకూ ఏచూరివే. ప్రతిసభలోనూ తాము ఢిల్లీలో వుండిపోవడం వల్ల సరైన తెలుగు మాట్లాడలే నంటూ మొదలు పెట్టినా అదో ఆకర్షణీయమైన భాషతో మాట్లాడేవారు. ‘మన రక్తం ఎర్రగా వున్నంతవరకూ ఎర్రజెండా ఎగురుతూనే ఉంటుందని’ ఆయన అనే మాటతో చప్ప ట్లు మోగిపోయేవి. బస్సులో మన డబ్బులు కొట్టేసిన దొంగే మళ్లీ టికెట్టు కొనిచ్చి సహాయం చేసినట్టు పోజు పెట్టడం కథ కూడా తప్పనిసరి, పాలకుల తీరుకు ఉదాహరణగా ఇది చెప్పే వారు. ఇలాంటి తమాషాలెన్నో. అసలు ఆయన ఎంట్రీయే ఏదో ఒక చలోక్తితో జరిగేది.
1980 నుంచీ..
1980లో ఏచూరి విజయవాడలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలకు హాజరైన నాటి కవరేజి నుంచి వ్యక్తిగతంగానూ ప్రజాశక్తి పరంగానూ ఆయనతో ఎన్నో మంచి జ్ఞాపకాలున్నాయి. ప్రతి జాతీయ మహాసభల్లో ఆయనతో ఒక ఇంటర్వ్యూ తీసుకోవడం తప్పనిసరిగా వుండేది. అర్థశాస్త్రం పాఠాలకు పేరుపొందిన మా నాన్న పుస్తకం 2012 ఖమ్మం మహాసభలో ఏచూరితో ఆవిష్కరింపచేయాలని అడిగితే వెంటనే ఒప్పుకోవడమే గాక రాజకీయ అర్థశాస్త్రం ప్రాథమిక సూత్రాల ప్రాధాన్యత ఏంటో గొప్పగా వివరించారు. మా కుటుంబానికి సంబంధించిన ఒక ప్రత్యేక సహాయం అడిగితే వెనువెంటనే చేయటం ఎప్పటికీ మర్చిపోలేము. తన ప్రజ్ఞా పాటవాలనూ, శక్తియుక్తులనూ ప్రజల కోసం ఉద్యమాలకు అంకితం చేయడం తప్ప స్వంతానికి ఏమీ కోరుకోని ఏచూరి వంటివారి గురించి ఎన్ని, ఎంతరాసినా ఇంకా మిగిలే వుంటాయి. ఆయనకిదే నివాళి. ఆ అధ్యయనం, ఆచరణ, సమగ్ర మానవీయ కోణం సదా అనుసరణీయం. సవాళ్లను ఎదుర్కొవడానికీ అదే మార్గం.
– తెలకపల్లి రవి