లేడీ సూప‌ర్ స్టా‌ర్ ర‌మ్య‌కృష్ణ‌

Lady Super Star Ramya Krishnaనటనకు పనికి రావన్నారు.. ఐరన్‌ లెగ్‌ అన్నారు.. ఇలా ఎన్నో రకాలుగా అవమానించారు, అవహేళన చేశారు. అయినా అన్నిటినీ భరిస్తూ వచ్చిన అవకాశాలను అందుకుంటూ నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయికగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆమే బాహుబలి శివగామి రమ్యకృష్ణ. చాలా ఏండ్ల తర్వాత ఈ మధ్యనే జైలర్‌ సినిమాలో రజనీకాంత్‌ సరసన నటించారు. సౌత్‌ ఇండిస్టీలో లేడీ సూపర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఆమె పుట్టిన రోజు సందర్భంగా మరిన్ని విశేషాలు.
రమ్యకృష్ణ 1970 సెప్టెంబర్‌ 15న చెన్నైలో పుట్టారు. ఆమె తమిళ సినీ హాస్యనటుడు, మాజీ పార్లమెంటు సభ్యుడైన రామస్వామికి మేనకోడలు. 13 ఏండ్ల వయసులో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఆమె మొదటిసారి తమిళంలో వై.జి.మహేంద్ర ‘వెళ్లే మనసు’లో ప్రధాన పాత్ర పోషించారు. ఆ సినిమాలో నటించేటప్పటికీ ఆమె ఎనిమిదవ తరగతి చదువుతున్నారు.
అవకాశాలు రాలేదు
యుక్త వయసులో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ‘ఇద్దరు మిత్రులు’ చిత్రంతో కథానాయకగా ప్రవేశించారు. సూత్రధారులు చిత్రం ద్వారా మంచి నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆ తర్వాత చాలా కాలం తెలుగులో ఆమెకు సరైన అవకాశాలు రాలేదు. దాంతో అందరూ ఐరన్‌లెగ్‌ అనేవారు. అయినా తన ప్రయత్నాలను వదల్లేదు. 1992లో విడుదలైన ‘అల్లుడుగారు’ చిత్రం ద్వారా ఈమె నటనా జీవితం ఓ మలుపు తిరిగింది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈమె నటించిన అన్ని సినిమాలు విజయవంతమయ్యాయి. దాంతో రమ్యకృష్ణ నటిస్తే చాలు అఖండ విజయం లభిస్తుంది అనే నమ్మకం నిర్మాతలకు కలిగింది. 1990 నుండి 2000 వరకు దాదాపు దశాబ్ద కాలం పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా గడిపారు.
అంతర్జాతీయ గుర్తింపు
అగ్ర హీరోలు అందరితోనూ ఆమెకు విజయవంతమైన సినిమాలున్నాయి. రజనీకాంత్‌తో నటించిన ‘నరసింహ’ చిత్రంలో ఆయనతో పోటీపడి మరీ చేసిన నీలాంబరి పాత్రను రక్తి కట్టించారు. ఆ చిత్రంలోని ఆమె నటన ఇప్పటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందంటే ఆర్చర్యం లేదు. భారతదేశంలోనే కాకుండా సింగపూర్‌, లండన్‌, ఫ్రాన్స్‌, జపాన్‌ లాంటి దేశాల్లోనూ ఈ చిత్రం విడుదలై అంతర్జాతీయంగా కూడా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆమె చిన్నతనంలో కూచిపూడి, భరత నాట్యంలో ప్రాథ మిక శిక్షణ పొంది అనేక రంగస్థల ప్రదర్శ నలు కూడా ఇచ్చారు.
శివగామిగా…
రమ్యకృష్ణ మంచి నాట్యకారిణి అయినప్పటికీ సినీ రంగంలో ఆ కోణంలో నటించే పాత్ర, అవకాశం ఎప్పుడూ ఆమెకు లభించలేదు. ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు కృష్ణవంశీని 2003 జూన్‌ 12న వివాహం చేసుకొని హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వీరికి ఒక కొడుకు. రమ్యకృష్ణ నటనకు గుర్తింపుగా 4 ఫిలింఫేర్‌ అవార్డులు, మూడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నంది అవార్డులు, తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు అందుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 1, బాహుబలి 2లో రాజమాత శివగామి పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఎన్నో ప్రశంసలు అందుకున్నారు.
కాలంతో పాటు మనమూ మారాలి
చాలా ఏండ్ల తర్వాత రజనీకాంత్‌ కాంబినేషన్లో జైలర్‌ చిత్రంలో నటించడం, అది సూపర్‌ హిట్‌ కావడం తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని ఆమె ప్రేక్షకులతో పంచుకున్నారు. సినీ నటులకు వృత్తిపరంగా విజయం సాధించటం అనేది నూటికి నూరు శాతం ఎంతో అవసరం. ‘విజయం సాధించడం మాత్రమే ముఖ్యం కాదు. మంచి పాత్రలు రావాలి. కొన్నిసార్లు మంచి పాత్రలు ఉంటాయి, అభినందనలు వస్తాయి. కానీ సినిమా పరంగా కలెక్షన్స్‌ ఉండవు. మేము నటించే రోజుల్లో పొరపాట్లు చేసినా వాటిని దిద్దుకోవడానికి సమయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ టైం లేదు. ఎంతో మంది వస్తున్నారు, వెళ్తున్నారు. అప్పట్లో ఎన్నో ఏండ్లకు సంపాదించుకునే పేరూ, గుర్తింపు ఇప్పుడు ఒక్క సక్సెస్‌ తోనే సంపాదిస్తున్నారు. అయితే కాలంతో పాటే అన్నీ మారుతున్నాయి. దాంతోపాటు మనమూ మారాలి. మార్పు సహజం. ఆ మార్పుకి అందరూ అడ్జస్ట్‌ అవ్వాలి’ అంటారు ఆమె.