కుటుంబంలో పిల్లల పెంపకం స్త్రీ బాధ్యత అయితే వారిపై హక్కులు పురుషునివి అన్నది సమాజం పెట్టిన నియమం. దాన్ని ఇష్టంతోనూ కష్టంతోనూ అందరూ ఆమోదించారు. ప్రపంచం అంతా కుటుంబ వ్యవస్థ ఇవే సూత్రాలతో నడుస్తుంది. కాని అందరి మనస్థత్వాలు ఈ సూత్రాల నియంత్రణలోనే ఉంటాయని అనుకోలేం. చిన్నపిల్లలు తల్లుల సంరక్షణలో ఉండాలని, పిల్లలను ఓపిగ్గా, చక్కగా పెంచే నైపుణ్యం స్త్రీల సొంతం అని పురుషులు ఆ పని చేయలేరని సమాజం నమ్ముతుంది. అందుకే తల్లిదండ్రులు విడిపోతున్న సందర్భంలో పిల్లలను న్యాయస్థానం తల్లులకే అప్పజెపుతుంది.
స్త్రీలందరూ మాతమూర్తులని, వారిలోని మాత హృదయం తండ్రులకు ఉండదని అందరి అభిప్రాయం. అలాగే కుటుంబంలో పిల్లలను కనిపెట్టుకుని, పెంచుకుంటూ ఇంటిని నిర్వహించడం స్త్రీలకు సహజంగా అబ్బే విద్య అని, అదే వారి స్వభావానికి సరిపోతుందని కూడా ఓ అపోహ సమాజంలో ఉంది. ఇంటిపనిని ఇష్టపడని, ఇంటికి మాత్రమే కట్టుబడాలనే కోరికలేని స్త్రీలు కొందరు ఉంటారు. వీరు ప్రపంచంలో తమ స్థానాన్ని నిర్మించుకోవాలనుకుంటారు. అలాంటి స్త్రీలకు కుటుంబం బంధిఖానా అవుతుంది. కేవలం భార్యగా బ్రతకడానికి వారు సిద్దంగా ఉండరు. ఇలాంటి వారిని స్త్రీతత్వం పేరుతో ఇంటికి బంధించడం, వారిని అన్ని విధాలా అసహాయులుగా చేయడం జరుగుతుంది.
ఈ విషయాన్ని నిజాయితీగా చర్చించిన సినిమా ‘క్రామర్ వర్సెస్ క్రామర్’ 1977లో అవెరి కార్మాన్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో టెడ్ క్రామర్‌గా డస్టిన్ హాఫ్మాన్, జోయానా క్రామర్‌గా మెరిల్ స్ట్రీప్ నటన పతాక స్థాయిలో ఉంటుంది. కుటుంబంలో మారుతున్న స్త్రీ, పురుష పాత్రల గురించి సమాజం వారిని మూసలో బంధించడాన్ని, ఆ మూసకు భిన్నంగా జీవించాలనుకునే దంపతుల మనోభావాలను అత్యంత సహజంగా చిత్రీకరించిన సినిమా ఇది. రాబర్ట్ బెంటన్ ఈ సినిమాని నిస్పక్షపాత వైఖరితో చిత్రికరించడంతో ఇందులో స్త్రీ పురుష పాత్రల సంఘర్షణను ప్రేక్షకులు అదే స్థాయిలో అర్ధం చేసుకోగలుగుతారు. అదీ ఈ సినిమా విజయానికి కారణం. తొమ్మిది ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన ఈ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటుడి విభాగాలతో కలుపుకుని ఐదు అవార్డులను సొంతం చేసుకుంది.
టేడ్ క్రామర్, న్యూయార్క్‌లో ఓ పెద్ద సంస్థలో అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తూ ఉంటాడు. ఇతని భార్య జొయానా గహిణి. వాళ్ళకు ఏడేళ్ళ కొడుకు బిల్లి. టెడ్ విపరీతంగా పని చేస్తాడు. కెరీర్‌లో ఉన్నత స్థితికి చేరుకోవడం అతని లక్ష్యం. ఇంటిని అతను పట్టించుకోడు. తన పని తప్ప అతనికేమీ పట్టదు. జోయానా ఇంటికే పరిమితమై భర్త అవసరాలు తీరుస్తూ, బిడ్డను పెంచుకుంటూ నాలుగు గోడల మధ్య బందీగా ఉండలేకపోతుంది. ఆమెకు ఆ ఇంట్లో తాను ఓ మరమనిషిగా మారినట్లు అనిపిస్తూ ఉంటుంది. భర్తకు తనతో మాట్లాడే కనీస సమయం లేకపోవడం, మనసులోని అలజడిని చెప్పుకోవడానికి తోడుగా మరో మనిషి లేకపోవడంతో పిచ్చి పట్టినట్లు అనిపిస్తుంది. అక్కడే ఉంటే తాను ఎక్కువ రోజులు బతకలేననే భయంతో పాటు, జీవితమే కోల్పోయిన భావంతో ఆమె ఆ ఇంట ఉక్కిరిబిక్కిరవుతూ ఉంటుంది.
టెడ్‌కి మళ్ళీ ప్రమోషన్ వస్తుంది. దీన్ని భార్యకు చెప్పాలని ఇంటికి వస్తాడు. అదే రాత్రి జోయానా తాను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నానని టెడ్‌కి చెపుతుంది. అతనికి ఏం అర్ధం కాదు. ఆమెను ఆపాలని చూస్తాడు. తాను శాశ్వతంగా ఆ ఇంటి నుండి బైటపడుతున్నానని బిల్లిని కూడా అక్కడే వదిలేస్తున్నానని, తాను మంచి తల్లిని కాదని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది.
టెడ్‌కి ఏం చేయాలో తెలియదు. బిల్లి పొద్దున లేచి చూస్తే ఇంట్లో తల్లి ఉండదు. కొన్ని రోజులు మార్పు కోసం ఆమె మరో చోటకు వెళ్ళిందని టెడ్ బిల్లికి అదో పెద్ద విషయం కాదన్నట్లుగా చెప్తాడు. ఇంట్లో ఏది ఎక్కడ ఉందో, కొడుకు ఏం తింటాడో బ్రేక్‌ఫాÛస్ట్ ఎలా చేయాలో కూడా టెడ్‌కి తెలీదు. బిల్లీ చెప్తుంటే జీవితంలో మొదటి సారి పొయ్యి వెలిగించి పచ్చిపచ్చిగా కొంత మాడ్చిన బ్రేక్ఫాస్ట్‌తో జీవితంలో కొత్త అధ్యాయం మొదలెడతాడు టెడ్. కొడుకు ఏ క్లాస్ చదువుతున్నాడో కూడా అతనికి తెలీదు. ఆ విషయమూ కొడుకునే కనుక్కుని హడావిడిగా బిల్లీని తయారు చేసి స్కూలు దగ్గర దిగపెట్టి ఆఫీసుకు పరిగెడతాడు. ఆఫీసులో తన బాస్, స్నేహితుడు కూడా అయిన జిమ్‌కి భార్య ఇల్లు వదిలిన విషయాన్ని చెబుతాడు. జిమ్ కొన్నాళ్లలో అన్నీ సర్దుకుంటాయి అని స్నేహితుడికి సర్ది చెపుతాడు. కాని టెడ్ జీవితం ఇదే స్థితిలో ఉంటే ఇప్పుడు ప్రమోషన్‌తో వచ్చిన అదనపు బాధ్యతలను అతను సరిగ్గా నిర్వహించలేడేమో అని భయపడతాడు.
భార్య చేసే పనులు తాను చేస్తూ ఆఫీసు పని చేసుకోవడం బిల్‌కు కష్టంగా ఉంటుంది. ఇంటికి సంబంధించినదేదీ అతనికి తెలీదు. సరుకులు ఏం కొనాలో, ఎంత కొనాలో కూడా అర్ధం కాని స్థితిలో కొడుకు సహాయంతోనే పనులు చేస్తూ ఉంటాడు. బిల్లి తల్లిని మర్చిపోలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ బిడ్డ మానసిక స్థితిని అర్ధం చేసుకుంటూ నడుచుకోవడం ఇప్పుడు టెడ్ బాధ్యత అవుతుంది. కొన్నిసార్లు ఎవరి మీదో తెలియని కోపాన్ని బిడ్డపై ప్రదర్శిస్తూ ఉంటే ఆ చిన్న మనసుకు సర్దిచెప్పడం, అతన్ని కంట్రోల్ చేయడం టెడ్‌కు కష్టం అవుతుంది. దానితో ఆఫీసు పని వెనకపడిపోతుంది.
ఆ బిల్డింగ్‌లో జోయానా స్నేహితురాలు మార్గరెట్ ఉంటుంది. ఆమెను భర్త వదిలేసి వెళ్లిపోతాడు. తన బిడ్డతో ఆమె ఒక్కత్తే అన్నీ పనులు చేసుకుంటూ ఉంటుంది. ముందు ఆమె ప్రభావంతోనే జోయానా ఇల్లు వదిలేసి వెళ్లిందనుకుంటాడు టెడ్. జోయానా ఆ ఇంట్లో సంతోషంగా ఉండేది కాదని అది ఒక్కటే తనకు తెలుసని, అంతకు మించి ఆమె వెళ్లిపోవడంలో తన ప్రమేయం ఏమీ లేదని మార్గరెట్ టెడ్‌తో చెబుతుంది. ఇద్దరూ స్నేహితులవుతారు. ఇంటిని నిర్వహించడంలో మార్గరెట్ సహాయాన్ని తీసుకుంటాడు టెడ్. క్రమంగా ఇంటిపై అతనికి పట్టు వస్తుంది. బిల్లి అతనికి దగ్గరవుతాడు. బిడ్డ సంరక్షణ అతని మొదటి ప్రాధాన్యత అవుతుంది.
ఒక రోజు పార్కులో ఆడుకుంటున్న బిల్లి కింద పడిపోతాడు. నుదుటికి దెబ్బ తగులుతుంది. బిడ్డను చేతుల మీద వేసుకుని పిచ్చివాడిలా రోడ్డుపై పరిగెడతాడు టెడ్. హస్పిటల్‌లో బిడ్డ నుదిటిపై పది కుట్లు పడుతుంటే పక్కనే ఉండి బిడ్డ నొప్పి తన నొప్పిగా విలవిలలాడతాడు. ఆ సమయంలో ఆఫీసుకు లేట్ గా వెళ్ళడం సకాలంలో పని పూర్తి చేయలేకపోవడంతో అతను పనిలో వెనకపడతాడు. ఇది ఇలాగే జరిగితే కష్టం అని బాస్ చెప్పినా ఆ సమయంలో బిడ్డ ఒక్కడే తనకు ముఖ్యమని స్పష్టంగా చెప్తాడు టెడ్. ఆఫీసులో సెక్రెటరీతో కలిసి ఓ రాత్రి గడిపినా ఆ శారీరక అవసరాలకన్నా బిల్లికు చేరువ అవడం అతనికి అతి ముఖ్యమైన అవసరంగా అనిపిస్తుంది. తండ్రీకొడుకుల మధ్య చక్కని అనుబంధం ఏర్పడుతుంది.
పదిహేను నెలల తరువాత జోయానా టెడ్‌కి ఫోన్ చేసి ఓ హోటల్‌లో కలవడానికి రమ్మంటుంది. తాను కాలిఫోర్నియాలో ఉంటున్నానని, ఉద్యోగం చేస్తునానని, ఓ థెరఫిస్ట్‌ను కలుస్తునానని, ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నానని చెబుతుంది. తాను ఆ హోటల్‌లో నిల్చుని స్కూలుకు వెళ్తున్న బిల్లీని కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నానని, బిడ్డపై ప్రేమ తనను నిలవనీయట్లేదని, తనకు బిల్లీ కావాలని అడుతుంది. బిడ్డపై తనకు హక్కు ఉందని ఆ వయసులో బిడ్డకు తల్లి అవసరం ఉందని చెప్తుంది. టెడ్ కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లాయర్‌ను కలుస్తాడు. ఏడేళ్ళ కొడుకుని తల్లి దగ్గరే ఉంచడానికి కోర్టు ఇష్టపడుతుందని ఈ కేసు గెలవడం కష్టమని చెప్తాడు లాయర్. అయినా తన బిడ్డ తనకు కావాలని కేసు వేస్తాడు టెడ్.
అదే సమయంలో పనిని నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ అతన్ని ఉద్యోగం నుండి తీసేస్తారు. ఇది తెలిసిన లాయర్ టెడ్ నిరుద్యోగిగా ఉంటే బిడ్డ కస్టడీని జడ్జి జోయానాకు అప్పగించే ప్రమాదం ఉందని, కేసు మరుసటి రోజు కోర్టుకు వస్తుంది కాబట్టి ఇరవై నాలుగు గంటల్లో తిరిగి ఉద్యోగం సంపాదించుకోవడం టెడ్‌కు అవసరమని చెప్తాడు. టెడ్ తెలిసిన ప్రతి చోటా ప్రయత్నించి, మొండి పట్టుదలతో ఇంతకు ముందు తాను చేసిన ఉద్యోగానికి కన్నా తక్కువ స్థాయి ఉద్యోగం, తక్కువ జీతంతో సంపాదించుకుంటాడు. తన స్థాయి, కెరీర్ కన్నా ఇప్పుడు బిడ్డ తనకు దక్కడమే ముఖ్యం అని అతనికి అనిపిస్తుంది.
కోర్టులో జోయానా తల్లిగా తన బిడ్డ తన దగ్గర ఉండాలని వాదిస్తుంది. తన భర్త తననెప్పుడూ కొట్టలేదని, మరో స్త్రీతో తిరగలేదని, కాని ఆ ఇంట బందీగా తాను ఉండలేకపోయానని, అది తనకు సరిపడని జీవితం అని చెప్తుంది. అక్కడే ఉంటే తాను జీవించి ఉండేదాన్ని కాదని వాపోతుంది. ఆమెను తానెంత ఇబ్బందికి గురిచేశాడో టెడ్‌కు అప్పుడు అర్ధమవుతుంది. తన నిర్లక్ష్యం ఆమెను ఎంత బాధపెట్టిందో తెలుసుకుంటాడు. ఇప్పుడు తాను మానసికంగా బలం పుంజుకున్నానని, తల్లిగా తన భాద్యతలను తాను నెరవేర్చదల్చానని ఆ వయసులో బిల్లీకి తన అవసరం ఎక్కువ అని ఆమె వాదిస్తుంది. టెడ్ తాను జోయానా లేని సమయంలో తల్లి కన్నా ఎక్కువగా బిడ్డను చూసుకున్నానని, ఇప్పుడు తల్లీ, తండ్రీ పాత్రలను తానే పోషించడం నేర్చుకున్నానని, బిడ్డ తనకు ఎంతో మాలిమి అయ్యాడని, ఒకసారి గాయపడిన బిడ్డ గుండెను మరోసారి ఇంటి నుంచి వేరు చేసి గాయపర్చవద్దని కోర్టును వేడుకుంటాడు.
కేసు గెలవాలనే ఉద్దేశంతో టెడ్ లాయర్, జోయానా ప్రస్తుత జీవితాన్ని కోర్టు ముందుకు తీసుకువస్తాడు. ఆమెకు బారుప్రెండ్స్ ఉన్నారని ఆమె ఒప్పుకుంటుంది. జోయానా ఏ బంధానికీ కట్టుబడే మనిషి కాదని, ఆమెను నమ్మి బిడ్డను అప్పగించడం తప్పని, ఆ బిడ్డను ఆమే ఇష్టపూర్వకంగా వదిలేసి వెళ్లిందన్న విషయాన్ని కోర్టు పరిగణంలోకి తీసుకోవాలని వాదిస్తాడు.
జోయానా లాయర్ టెడ్ అంతకు ముందు ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరిని ప్రస్తావిస్తాడు. టెడ్ ఒకప్పుడు తాను మంచి భర్తగా, తండ్రిగా లేనని ఒప్పుకుంటాడు. మార్గరెట్ కోర్టుకు సాక్షిగా వచ్చినప్పుడు జోయానాతో ఆమె తప్పు చేస్తుందని టెడ్ ఇదివరకటి మనిషి కాదని, తండ్రీ కొడుకుల మధ్య ప్రస్తుతం ఏర్పడిన ఆ సున్నితమైన సంబంధాన్ని విచ్ఛిన్నం చేయవద్దని అభ్యర్ధిస్తుంది. టెడ్ చాలా మంచి తండ్రి అని అతని సంరక్షణ బిల్లి భవిష్యత్తుకి మంచిదని చెప్తుంది. కోర్టు బిల్లి సంకరక్షణను జోయానాకే అప్పగిస్తుంది. కేసుని ఇంకా పై కోర్టుకు తీసుకెళితే బిల్లి కోర్టుకు హాజరు కావాలని, ఆ చిన్న మనసును అది ఇంకా గాయపరుస్తుందని కేసు నుండి టెడ్ తప్పుకుంటాడు.
బిల్లికి చాలా సున్నితంగా సమస్యను వివరిస్తాడు టెడ్. బిల్లి ఇల్లు మాత్రమే మారుతున్నాడని, పరిస్థితిలో మార్పు పెద్దగా ఉండదని కొన్నాళ్లు తల్లి దగ్గర ఉండడం అతనికీ మంచిదని చెప్పి బిడ్డను జోయానాకు అప్పగించడానికి సిద్దపడతాడు టెడ్. బిల్లీ వెళ్లిపోయే రోజు వంటగదిలో మళ్ళీ బ్రేక్‌ఫాÛస్ట్ తయారు చేస్తూ తండ్రీ కొడుకులు సమయం గడుపుతారు. జోయానా వెళ్లిపోయిన మొదటిరోజు కోడిగుడ్లను ఎలా పగలకొట్టాలో, బ్రెడ్ ను ఎలా కాల్చాలో తెలియని ఆ తండ్రి, ఇప్పుడు అత్యంత సులువుగా, మంచి నైపుణ్యంతో చురుకుగా బిడ్డతో మాట్లాడుతూ బ్రేక్‌ఫాస్ట్ తయారు చేస్తాడు. ప్రేక్షకులు మొదటి రోజు వంటగదిలో అడుగుపెట్టిన ఆనాటి టెడ్‌తో నేటి టెడ్‌ను పోల్చుకుంటూ ఆ తండ్రి కొడుకు కోసం తనను తాను ఎలా మార్చుకున్నాడో చూసి అతని ప్రస్తుత స్థితికి విలవిలలాడతారు.
జోయానా టెడ్‌కు ఫోన్ చేస్తుంది. తాను అపార్ట్‌మెంట్ కింద ఉన్నానని, టెడ్‌తో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నానని అడుగుతుంది. కన్నీళ్ళతో టెడ్‌ను కలిసి తాను బాగా ఆలోచించానని, బిల్లీని అతనింటి నుండి దూరం చేయడం తప్పని అనిపిస్తుందని, తాను కోర్టు ద్వారా పొందిన హక్కుని ఉపసంహరించుకుంటున్నానని చెప్తుంది. ఒక్కసారి బిడ్డను కలుస్తానని కోరుతుంది. టెడ్ ఆమెను ఒంటరిగా పైకి పంపిస్తాడు. తల్లిగా ఆమె హక్కుని గౌరవిస్తాడు. భర్తగా ఓడినా, మనిషిగా, తండ్రిగా గెలిచిన టెడ్‌ను స్నేహభావంతో చూస్తూ బిడ్డను కలుసుకోవడానికి చివరి సీన్‌లో తాను వదిలివచ్చిన ఆ ఇంట్లోకి మళ్ళీ వెళుతుంది జోయానా.
ఈ సినిమాలో పిల్లల బాధ్యత, స్త్రీ అవసరాలు, తల్లితండ్రుల హక్కులు, భార్యా భర్తల సంబంధంలోని ఆధిపత్య ధోరణుల మీద గొప్ప చర్చను లేవదీసే విషయాలున్నాయి. సంసారం ఒక ఊబిలా మారి స్త్రీ అస్థిత్వాన్ని దోచే వ్యవ్యస్థగా తయారయినప్పుడు స్త్రీ పడే బాధ జోయానా పాత్రలో చాలా గొప్పగా చూపించారు. ఆమె నిర్ణయం పట్ల కోపం రాదు ఎవరికీ. ఆమె స్థితిని ప్రేక్షకులు ఆలోచించేలా ఉంటుంది మెరిల్ స్ట్రిప్ నటన, దర్శకుడి దర్శకత్వ శైలి కూడా జోయానా పట్ల కోపం కాకుండా సానుభూతి రేకెత్తించే విధంగా ఉండడం గమనించాలి ఇది ఈ కథలో కష్టం అయినా సాధించి చూపించారు దర్శకులు.
పదిహేను నెలలు బిడ్డకు దూరంగా ఉండి తన మానసిక స్థితికి వైద్యం చేయించుకుని, సంసారం కలిగించిన గందరగోళం నుండి బైటపడి, బిడ్డ కోసం జోయానా తిరిగి వస్తుంది. ఆమెతో జీవితం పంచుకున్న టెడ్ ఓ మర మనిషి. బిడ్డను ఏనాడూ పట్టించుకోని వ్యక్తి. అతని సంరక్షణలో బిడ్డ ఆనందంగా ఉండగలడని ఆమె ఆనుకోలేకపోవడానికి టెడ్‌తో ఆమె గడిపిన జీవితం కారణం. కాని కోర్టులో టెడ్ వాదన, అతని మాటల్లో చేతల్లో వచ్చిన మార్పు బిల్లి కోసం అతను చేస్తున్న త్యాగం, స్నేహితురాలు మార్గరెట్ కూడా టెడ్ గురించి చెప్పడం ఇవన్నీ గమనించాక బిల్లి తండ్రి దగ్గర ఉండడమే మంచిదనే ఆలోచనకు జోయానా వస్తుంది అందుకే కోర్టు కేస్ నెగ్గిన తరువాత కూడా మొండి పట్టుదలకు పోదు. మరోసారి బిల్లీ జీవితంలో తాము తీసుకువచ్చే ఆ బలవంత మార్పు వల్ల బిడ్డ మనసు గాయపడుతుందని ఆమె అర్ధం చేసుకుంటుంది. అందుకే బిడ్డపై హక్కు, ప్రేమ ఉన్నా బాధ్యతగా ప్రవర్తించి ఓ తల్లిగా బిడ్డ క్షేమం కోసం తన హక్కును, తన గెలుపును, తన మాతత్వాన్ని పక్కన పెట్టి కేవలం బిల్లీ శ్రేయస్సు కోరే వ్యక్తిగా ప్రవర్తిస్తుంది.
టెడ్ సంసారం అనే చట్రంలో తాను జోయానాను బంధించానని, తనపై తాను పట్టు కోల్పోయే విధంగా ఆమెను మానసిక హింసకు గురి చేసానని అర్ధం చేసుకుంటాడు. అందుకే ఆమె వెళ్లిపోయిందన్న కోపాన్ని వదిలేస్తాడు. అందులో తన పాత్ర కూడా ఉందని ఒప్పుకుంటాడు. ఓ సందర్భంలో బిల్లీ ‘అమ్మ నా వల్లే ఇల్లు వదిలేసింది, నేను ఆమెను చాలా సతాయించేవాడిని’ అని ఏడుస్తున్నప్పుడు ‘ఇందులో నీ తప్పు లేదు, అమ్మ వెళ్లిపోవడానికి నేనే కారణం’ అని బిడ్డను ఓదారుస్తాడు. తానే పొరపాటు చేశానని ఒప్పుకుంటాడు. అందుకే కోర్టులో తన తరుపు లాయర్ జోయానా వ్యక్తిగత జీవితాన్ని కోర్టుకు ఈడుస్తుతున్నప్పుడు టెడ్ దాన్ని ప్రతిఘటిస్తాడు. తానూ మంచి భర్తగా ప్రవర్తించలేదని కోర్టు ముందు ఒప్పుకుంటాడు. విడాకులు తీసుకున్న ఇద్దరు వ్యక్తులు ఒకరిపై మరొకరు కసితో కోపంతో రగిలిపోతూ బతకవలసిన అవసరం లేదని, తమ బంధం విచ్ఛిన్నం అవడంలో తమ వంతు తప్పును గుర్తించి మంచి వ్యక్తులుగా మారవచ్చని ఈ సినిమా స్పష్టం చేస్తుంది. బిడ్డకు ఏది మంచిదో ఇద్దరూ కలిసి ఆలోచించి మంచి తల్లిదండ్రులుగా ఉండవచ్చని ప్రస్తావిస్తుంది.
అలాగే బిడ్డలను కేవలం స్త్రీలే పెంచగలరని, అది పురుషుల పని కాదనే వాదననూ ఈ సినిమా కొట్టిపడేస్తుంది. మనసు, మార్గం ఉంటే పురుషులూ అదే స్థాయిలో పిల్లల అవసరాలు తీరుస్తూ వారిని పెంచగలరని, ఒంటరి తల్లులు, తండ్రులు తమ బాధ్యతలను గుర్తించి సమయానుకూలంగా తమ ప్రాధన్యతలను నిర్ణయంచుకుంటూ కుటుంబ వ్యవ్యస్థలో మనగలరని చెప్పడం కూడా ఈ సినిమా ఉద్దేశం.
ఈ సినిమాపై అప్పటికీ, ఇప్పటికీ ఎంతో చర్చ జరుగుతూనే ఉంది. అయితే కోర్టులో జరిపిన వాదనలలో కొన్ని లోపాలున్నాయని, బిడ్డ సంరక్షణకు సంబంధించిన కోర్టు వాదనలు అసంపూర్తిగా ఉన్నాయని కొందరు లాయర్లు వాదించారు. అలా కొన్ని లోపాలు ఈ సినిమాలో ఉండవచ్చు. కానీ ఓ జంట విడిపోయే సందర్భంలో పడే సంఘర్షణను, సంసారంలో ఆ దంపతుల మధ్య పెరిగే దూరం వారి జీవితాలలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో, దాన్ని అధిగమించడానికి ఆ ఇద్దరూ ఎంతటి ఘర్షణను అనుభవిస్తారో, చివరకు మంచి వ్యక్తులుగా, మంచి తల్లి తండ్రులుగా ఆ ఇద్దరూ ఈ కథలో తమను తాము ఎలా తీర్చిదిద్దుకోగలిగారో, కష్టమైన సమయాలలో వారిద్దరూ ఎలాంటి పరిపక్వతను ప్రదర్శించారో ఈ సినిమా చాలా గొప్పగా చూపిస్తుంది. సినిమాగా బిల్లీ పాత్ర వేసిన ఆ ఏడు సంవత్సరాల బాల నటుడు జస్టిన్ హెన్రీ అమోఘమైన నటనను ప్రదర్శించాడు. అందుకని అతనికి ఆస్కార్ నామినేషన్ లభించింది. ఆస్కార్ చరిత్రలో నామినేషన్ లభించిన అతి చిన్న నటుడిగా జస్టిన్ హెన్రీ రికార్డును ఇప్పటికీ ఎవరూ అధిగమించలేదు.
– పి.జ్యోతి,
98853 84740