వయసు తగ్గించుకోవాలంటే…

To reduce age...ఆ మధ్య పెన్షనర్స్‌ డే సందర్భంగా నాకు ఆహ్వానం అందింది. ఆ రోజు జరిగే సభలో పాల్గొనడానికి వెళ్లినప్పుడు వక్త పెన్షనర్స్‌ సమస్యల గురించి అనేక విషయాలు చక్కగా మాట్లాడారు. ఆ తర్వాత ఒకరిద్దరు వక్తల తర్వాత నన్ను సైకాలజిస్ట్‌గా సంబోధిస్తూ మాట్లాడవలసిందిగా పిలిచారు. రిటైర్‌మెంట్‌ జీవితంలో ప్రతి ఒక్కరూ అనారోగ్య సమస్యలతో సతమతమవుతారు. అందుకే నేను ‘వయస్సు తగ్గించుకోవాలనుకుంటే…’ అని అన్నానో లేదో ‘ఎలా…’ అనే ప్రశ్న శ్రోతల నుండి రావడం మొదలైంది.
అప్పుడు నేను… వయస్సు తగ్గించుకునేందుకు మంత్రం ఏమీ లేదు. మనల్ని మనం శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతులమైనప్పుడు వున్న వయస్సు కంటే తక్కువగా కనిపించవచ్చు. చనిపోయేవరకు కొందరు ఆరోగ్యం మీద శ్రద్ధపెట్టి తమ ఆహార విహారాదుల విషయాల్లో క్రమశిక్షణ పాటిస్తారు. అదే వారికి శ్రీరామరక్షగా నిలుస్తుంది అని చెప్పాను.
సైకాలజిస్టుల ప్రకారం ప్రతి వ్యక్తికీ మూడు విధాలైన వయస్సులుంటాయి అంటారు. 2. క్రోనలాజికల్‌ ఏజ్‌ (మన యధార్థ వయస్సు), 2. బయోలాజికల్‌ ఏజ్‌ (శరీరాన్ని బట్టి కనిపించే వయస్సు), 3. సైకలాజికల్‌ ఏజ్‌ (మానసిక వయస్సు).
క్రోనికల్‌ ఏజ్‌ అంటే మన పుట్టిన తేదీని బట్టి లెక్కించే వయస్సు. ఇది మన నిజమైన వయస్సు.
బయోలాజికల్‌ ఏజ్‌ అనేది మనం ఫుడ్‌ ఎథిక్స్‌ పాటించడం… అంటే ఏది మన ఆరోగ్యాన్ని సురక్షితంగా వుంచుతుందో అది మాత్రమే తింటూ క్రమపద్ధతిలో వుండడం. ఏది బడితే అది జిహ్వ చాపల్యంతో నోరూరించే పదార్థాలన్నింటిని తింటుండడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోయి ఎక్కువ వయసుగల వారిగా కనిపించడం జరుగుతుంది. అంటే మన శరీరాన్ని చూసినప్పుడు అంచనా వేసే వయస్సును బయోలాజికల్‌ ఏజ్‌ అంటారు.
సైకలాజికల్‌ ఏజ్‌ అంటూ మన ఆలోచనల్ని ప్రతిబింబిస్తూ అసలు వయస్సు కంటే ఎక్కువ వయస్సువారిలాగానో, లేదా తక్కువ వయస్సువారిలాగానో కనిపించడం. ప్రతి విషయాన్ని బూతద్దంలో పెట్టి చూసే అలవాటున్నవాళ్లు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కనిపిస్తారు. ఈ కారణంగా వారి ముఖం ముడతలు పడి అసలు వయసు కంటే ఎక్కువ వయసు గలవారిగా కనిపిస్తారు.
కొందరు మాత్రం ఏ విషయాన్ని ఎంత ఆలోచించాలో అంత మాత్రమే ఆలోచించి వదిలిపెడతారు. ఎలాంటి ఒత్తిళ్లకూ, మానసిక ఆందోళనలకూ గురికాకుండా ఎప్పుడూ సంతోషంగా వుంటారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంభిస్తారు. ప్రత్యేకంగా మానసిక ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తూ జీవిస్తుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థవారు నిర్వహించిన 2021 సర్వే ప్రకారం భారతీయుల సగటు వయస్సు 70.8 సంవత్సరాలు. అంటే 71 సంవత్సరాలు.
డబ్ల్యు.హెచ్‌.ఒ వారు సూచించిన వయస్సు కంటే కొందరు ఎక్కువకాలం జీవిస్తూ చనిపోయే వరకు ఆరోగ్యవంతులుగా వుంటారు. మొన్నీమధ్యే కాలం చేసిన రామోజీరావుగారినే ఉదాహరణగా తీసుకుందాం. అనేక వ్యాపార సంస్థలను నిర్వహిస్తూ కూడా ఎలాంటి ఒత్తిళ్లకూ, ఆందోళనలకూ గురికాకుండా 87 సంవత్సరాలు జీవించి అనేకులకు మార్గదర్శి అయ్యారు.
సాంబశివన్‌ స్వామినాథన్‌ (యం.ఎస్‌.స్వామినాథన్‌) హరితవిప్లవ పితామహునిగా పేరుగాంచిన ఆయన తన 93వ ఏట మరణించారు. అంటే ఆయన జీవన విధానాలే అన్నేండ్లు జీవించడానికి కారణంగా చెప్పవచ్చనేది నిర్వివాదాంశం. భారతదేశ 9వ ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నర్సింహారావుగారు 88 ఏండ్ల వయసులో చనిపోయారు. వారు రాజకీయం, సాహిత్యంలో నిష్ణాతులు. తీరిక చేసుకుని తనకంటూ ఓ గంట కాలాన్ని పుస్తక పఠనం కోసం కేటాయించేవారు. ఈ అలవాటును జీవిత కాలం కొనసాగించి చిరస్మరణీయులయ్యారు.
నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడం సాధ్యంకాదని అనుకోకూడదంటారు మనోవైజ్ఞానికులు. ఆహార నియమాల్లో క్రమశిక్షణ పాటిస్తూ జీవిస్తే మంచి ఫలితం రావచ్చనేది వారి అభిప్రాయం.
హౌటు స్టాప్‌ వర్రీయింగ్‌ అండ్‌ స్టార్ట్‌ లివింగ్‌ అనే పుస్తకంలో అనేక విషయాలు తెలుపుతూ మానసికంగా ఒత్తిళ్లు, ఆందోళనలకు గురికాకుండా సంతోషంగా వుంటూ ఆరోగ్యకరమైన జీవన శైలి పాటిస్తూ అధిక ఆలోచనలకు తావివ్వకుండా ఎప్పుడూ ఏదో పనిలో నిమగం అవ్వాలని చెబుతాడు డేల్‌ కార్నగీ.
అలవాట్లలో క్రమశిక్షణ లోపించినప్పుడే వయస్సు మళ్లిన వారిలా కనిపిస్తుంటారు. పాజిటివ్‌గా జీవించడం అలవాటు పడిన వారి మనసు, శరీరం సహకరించకుంటాయంటారు శాస్త్రజ్ఞులు.
డాక్టర్‌ స్టీలింగ్‌ స్మిత్‌ తన నూరవ జన్మదినం జరుపుకుంటున్నప్పుడు పత్రికా విలేకరులు అతని ఆరోగ్య రహస్యం గురించి అడిగారు. అందుకాయన ‘మొదటి యాభై సంవత్సరాలు నా కడుపును జాగ్రత్తగా గౌరవించాను. ఆ తరువాత యాభై సంవత్సరాలు అది నా ఆరోగ్యాన్ని కాపాడుతూ సహాయ పడింది’ అని జవాబిచ్చారు.
అంటే సమతుల ఆహారం తీసుకోవడం ముఖ్యం. సమతుల ఆహారం అంటే మనం తక్కువ కేలరీల ఆహారం తీసుకుంటాం. తద్వారా మన వయస్సు పెరగడం నెమ్మదిస్తుందని సెయింట్‌ లూయీస్‌ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనలతో గుర్తించారు. తక్కువ కాలనీలు గల ఆహారం తీసుకోవడం వల్ల కాన్సర్‌, డయాబెటీస్‌ వంటి వ్యాధులు కూడా దూరమయ్యే అవకాశం వున్నట్టు కూడా చెబుతారు.
హాలెండ్‌కు చెందిన మాస్ట్రిచ్‌ పరిశోధకులు దీర్ఘాయుష్కులై జీవించడానికి నాలుగు సూత్రాలు సూచించారు. మొదటిది మత్తుపదార్థాలు, పొగాకు వినియోగానికి అలవాటు పడకూడదు. రెండోది బరువు పెరగకుండా చేతనైనంత సేపు వ్యాయామం చేయడం. మూడోది పండ్లు, కూరగాయలు, నట్స్‌, ముడి ధాన్యాలు ఆహారంలో చేర్చడం, నాలుగోది తక్కువ మోతాదులో మాంసాహారం, మద్యం వంటివి తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం జీవించడమే కాక తక్కువ వయసున్న వారిలా కనిపిస్తారు.
మనోవిజ్ఞాన శాస్త్రంలో సెల్ఫ్‌ ఇమేజెస్‌… అంటే మనసులో మన గురించిన ఊహాచిత్రాలు ఏర్పరచుకుని చూడడం అలవాటు పడితే మన వయస్సు కంటే తక్కువ వయస్సు గల వారిగా కనిపించే అవకాశం వుంటుందని చెప్తారు. నిత్యం మన శరీరం, మనసు కలిసి పనిచేసేటట్టు ప్రయత్నించగలిగితే ఎప్పుడూ ఉత్సాహవంతులుగా, యంగ్‌గా కనిపించడం ఏమంత కష్టమైన పని కాదని అనేక పరిశోధనలు తెలుపుతున్నాయి.
– పరికిపండ్ల సారంగపాణి, 9849630290, కౌన్సిలింగ్‌ సైకాలజిస్ట్‌,