వానపాములు.. అందరికీ నేస్తాలు

Earthworms are friends of allఅప్పటిదాకా నీలంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది. మబ్బులు పట్టి చీకటిగా మారింది. అడవిలోని జంతువులు భయంతో చెట్ల కిందకు, సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నాయి. వాన చినుకులు మొదలయ్యాయి. క్రమేణా వాన పెద్దదయ్యింది. చెట్ల కిందకు చేరుకున్న జంతువులు పెద్దవానకు తడిసి వణకసాగాయి. ఇంతలో నేల పైన మట్టిలోంచి ఒక పెద్ద వానపాము బయటకు వచ్చింది. ఆ వెనకాలే పిల్ల వానపాము చిన్న మట్టిముద్దను పక్కకు తోసి ఠీవిగా బయటకు వచ్చింది. దానిని చూడగానే తల్లి వానపాము నువ్వెందుకు బయటకు వచ్చావు? నిన్ను బయటకు రావొద్దని చెప్పానుగా! నా మాటంటే భయం లేదా! అన్నది.
దానికి పిల్ల వానపాము వాన చూసి చాలా రోజులైంది. ఇవాళ సరదాగా తడవాలనిపించింది. అందుకే బయటకు వచ్చాను. ఈ వర్షంలో కాసేపు ఆడుకోనివ్వమ్మా! ప్లీజ్‌.. అంటూ తన మెత్తటి శరీరాన్ని వంపులు తిపవితూ పైకి కిందకు లేపుతూ నృత్యం చేయసాగింది. చెట్ల కింద వానకు తడుస్తూ నిలబడ్డ జంతువులు పిల్ల వానపాము నృత్యాన్ని తదేకంగా చూడసాగాయి. వాటికి పిల్ల పాము చేష్టలు సరదాగా ఉన్నాయి. ఇంతలో తల్లి వానపాము పిల్లను ఉద్దేశించి చాల్లే.. నీ అల్లరి పనులు. నోర్మూసుకుని లోపలికి పోయి ఆడుకో! అన్నది. దానికి పిల్ల వానపాము నువ్వు నన్ను లోపలికి ఎందుకు పొమ్మంటున్నావో నాకు తెలుసు అన్నది. దానికి తల్లి చిన్నదానివి చిన్నదానిలా ఉండు. పెద్దపెద్ద మాటలు మానుకొని లోపలికి పో అని గద్దించింది.
తల్లీపిల్ల వాదనను జంతువులు ఆసక్తిగా గమనించసాగాయి. తల్లి వానపాము పిల్లను ప్రేమగా దగ్గరకు తీసుకుంది. చిన్నా! నువ్వు చిన్నదానికి.. ఇప్పుడే నీకీ కష్టం దేనికి? భూమి లోపలికి వెళ్లి హాయిగా నీ స్నేహితులతో ఆడుకో. పెద్దయితే నీకీ పని తప్పదు అన్నది. జంతువులు తల్లీ పిల్ల వానపాముల మాటలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. వాటికి ఆ మాటలు అర్థం కాలేదు. ఉండబట్టలేక చెట్ల కింద నుంచే వాటిని ప్రశ్నించాయి. మీ మాటలు మాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. మీరు చూస్తే చిన్న జీవులు.. చేసేంత కష్టమైన పనేంటి? అని ప్రశ్నించాయి. దానికి పెద్ద వానపాము బ్రహ్మదేవుడు మనందరినీ సృష్టించాడు. అనంతరం ఒక్కో జీవికి ఒక్కో పని అప్పగించాడు. మాకు భూమిని సారవంతం చేసే పని అప్పగించాడు.
సారవంతం అంటే ఏమిటి? ప్రశ్నించాయి జంతువులు.
ఈ నేలపై మూడొంతుల నీరు ఉంటుంది. మిగిలిన ఒకవంతు భూమి ఉంటుంది. దాన్ని సారవంతం చేసే బాధ్యత కొంతవరకు మాది. పంటలు బాగా పండాలంటే దుక్కి దున్నాలి. దుక్కి దున్నటం అంటే రైతు నాగలితో నేలను దున్నుతాడు. దానివల్ల నేల సారవంతం అవుతుంది. పై మట్టి కిందకు.. కింద మట్టి పైకి చేరటంతో పంటలు బాగా పండుతాయి. మేం రైతుకు మా వంతు సహాయంగా భూమిని సారవంతం చేస్తాం. అందుకే మమ్మల్ని అందరూ రైతు నేస్తం అంటారు. మేం మట్టిని శరీరంలోకి తీసుకుని సారవంతం చేసి విసర్జిస్తాము. తద్వారా భూమి సారవంతం అవుతుంది.. పంటలు బాగా పండుతాయి. అంతెందుకు చెట్లు పెరగాలన్నా .. పండ్లు కాయాలన్నా మా పాత్ర కూడా అంతో ఇంతో ఉంటుంది. ఈ అడవిలో కూడా భూమిని సారవంతం చేసేందుకు నేను లోపలి నుంచి బయటకు వచ్చాను. వర్షాకాలంలో మట్టి మెత్తబడుతుంది. త్వరితంగా సారవంతం చేయటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల నేను బయటకు వస్తుంటే తానూ వస్తానని వెంటబడింది. వద్దని ఎంత వారించినా నన్ను అనుసరించింది. నాతోపాటు భూమిని సారవంతం చేస్తానని అంటుంది. ఈ వయసులో దాని వల్ల ఈ పని అవుతుందా! మీరే చెప్పండి అని జంతువులతో అన్నది.
జంతువులు తల్లీ పిల్ల వానపాములను ఉద్దేశించి మాకు ఆహారంగా పండ్లు, దుంపలు అందించటానికి మీరెంతో శ్రమిస్తున్నారు. మీ వల్లే మాకు ఆహారం దొరుకుతుందని ఈరోజు తెలుసుకున్నాం. అలాగే చెట్లు పెరగటంలో మీ పాత్ర మరువలేనిది. మీ మేలు మర్చిపోలేం. చిన్నదైన పిల్ల పాము సైతం భూమి సారవంతానికి ఆరాటపడుతుంది. మీరు రైతులకే కాదు ఈ భూమ్మీద సమస్త ప్రాణకోటికి నేస్తాలు అని మెచ్చుకున్నాయి. వాన తగ్గాక జంతువులు తమ స్థావరాలకు వెళ్లాయి. తల్లీ పిల్ల వానపాములు భూసారవంతం పనిలో మునిగిపోయాయి.

– తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర, 9492309100