నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సోమవారం నిర్వహించ తలపెట్టిన రైతు నిరసన కార్యక్రమాన్ని ఈనెల 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు రైతు జేఏసీ నాయకులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ అందించాలని, రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని, వరికి రూ.500 బోనస్ అమలుకై ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి రైతు జేఏసీ ఆధ్వర్యంలో ఈ రైతు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసిందే. కాగా పసుపు బోర్డు ఉద్యమకారుడు ముత్యాల మనోహర్ రెడ్డి మృతి చెందడం, సోమవారం రోజున మిలాద్ ఉన్ నబి సందర్బంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడం, గణపతి నిమజ్జన కార్యక్రమాలు ఉండడం వలన తహశీల్దార్లు అందుబాటులో ఉండని కారణంగా తహసిల్దార్ కార్యాలయాల ముందు ధర్నా, తహసీల్దార్లకు మెమొరండం ఇచ్చే కార్యక్రమాన్ని 19వ తేది గురువారానికి వాయిదా వేయడం జరిగిందని జేఏసీ నాయకులు ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల రైతులు ఈ విషయాన్ని గమనించి తిరిగి 19న జరిగే రైతు నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రైతు జేఏసీ నాయకులు ప్రకటనలో కోరారు.