విద్య ఎక్కడుంటే అభివృద్ధి అక్కడే బడుల్లో క్రీడల పీరియెడ్‌ ఉండాలి

– తెలంగాణపై కేంద్రం వివక్ష
– రాష్ట్రానికి ఒక్క విద్యాసంస్థనూ కేటాయించలేదు

– విద్యాదినోత్సవంలో మండలి చైర్మెన్‌ గుత్తా
– బాలల భవితకు బంగారు బాటలు వేద్దాం : సబిత
– అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి : మహమూద్‌ అలీ
– మూడేండ్లలో విద్యలో సమూల మార్పులు : తలసాని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విద్య ఎక్కడుంటుందో అభివృద్ధి అక్కడుంటుందని, అభివృద్ధి చెందిన దేశాలే ఇందుకు నిదర్శనమని శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో విద్యాదినోత్స కార్యక్రమాన్ని ఆ శాఖ నిర్వహించింది. ముఖ్యఅతిథిగా హాజరైన గుత్తా మాట్లాడుతూ అన్నారు. విద్యుత్‌ వినియోగం, తలసరి ఆదాయం, జీఎస్‌డీపీలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. విద్యా,వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగం, విద్యుత్‌రంగం ప్రధాన కార్యక్రమాలుగా రాష్ట్ర ప్రభుత్వం భావించిందని చెప్పారు. విద్యపై ప్రత్యేక ఆసక్తి ఉన్నందునే 1,002 గురుకులాలను సీఎం కేసీఆర్‌ స్థాపించారని వివరించారు. ఏదో ఒక పాఠశాలలో విద్యార్థి నకలు కొట్టినా గోరంతలు కొండంతలు చేసే పరిస్థితి ఉందని అన్నారు. యూపీఏ హయాంలో మోడల్‌ స్కూళ్లను ప్రారంభించారని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మోడల్‌ స్కూళ్ల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెట్టిందన్నారు. దీంతో మన రాష్ట్ర ప్రభుత్వమే 192 మోడల్‌ స్కూళ్లను నిర్వహిస్తున్నదని వివరించారు. మెడికల్‌ కాలేజీ, నవోదయ విద్యాసంస్థ, గిరిజన విశ్వవిద్యాలయం వంటివి రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేయకుండా వివక్ష చూపుతున్నదని విమర్శించారు. తాను చదువుకునే రోజుల్లో సాయంత్రం క్రీడలు నేర్పించేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. క్రీడల కోసం ప్రత్యేకంగా ఒక పీరియెడ్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. పీఈటీలను నియమించాలని సూచించారు. స్కావెంజర్లు, వాచ్‌మెన్లు లేరని, ఆ సమస్యల మీద తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఇందులో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. బడి కేవలం పిల్లలదే కాదని, ఉపాధ్యాయులది కూడా అని వివరించారు. సొంత ఇంటిలాగే ఉపాధ్యాయులు బడిని కాపాడుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ను గురుకుల పాఠశాలగా మార్చే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు.
ప్రయివేటుకు ధీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతున్నాం : సబిత
ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతున్నామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. గురుకులా లకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ, పీజీ, లా కాలేజీ కలిపి 1,200 వరకు గురుకులాలున్నాయని, కేజీ టు పీజీ ఉచిత విద్యలో ఇది భాగమని వివరించారు. తెలంగాణ రాకముందు విద్యారంగానికి రూ.ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేస్తే, ఇప్పుడు రూ.23 వేల కోట్లు కేటాయిస్తున్నామని అన్నారు. విజన్‌ ఉన్న నాయకుడు కేసీఆర్‌ వల్లే ఇది సాధ్యమైందన్నారు. డిగ్రీలో కొత్త కోర్సులను ప్రారంభించిన ఉన్నత విద్యామండలిని ఆమె అభినందిం చారు. మన ఊరు-మనబడి బృహత్తర కార్యక్రమమని చెప్పారు. సర్కారు బడుల దశదిశను మార్చేలా సీఎం కేసీఆర్‌ దాన్ని రూపొందించారని వివరించారు. 93 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు న్యాక్‌ గ్రేడ్‌ రావడం ఆషామాషీ కాదని అన్నారు. గతంలో స్కూళ్లు ప్రారంభమయ్యాక రెండు, మూడు నెలలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు ఇచ్చే పరిస్థితి ఉండేద న్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో వెంటనే ఇస్తున్నామని చెప్పారు. గతంలో పాఠ్యపుస్తకాలకు రూ.130 కోట్లు ఖర్చు చేసే వాళ్లమని, ఇప్పుడు రూ.190 కోట్లు ఖర్చయ్యిందని వివరించారు. సర్కారు బడుల్లోని విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ అంగీకరించారని అన్నారు. మధ్యాహ్న భోజనం గతంలో దొడ్డు బియ్యం వండేవారని, ఇప్పుడు సన్నబియ్యంతో అందిస్తున్నామని గుర్తు చేశారు. పేద విద్యార్థులు ఉదయం తినకుండా వస్తా రనే ఉద్దేశంతో మంగళవారం నుంచి రాగిజావ అందిస్తామని వివరించారు. దీనిద్వారా 28,606 ప్రభుత్వ పాఠశాలల్లోని 25,26,907 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగు తుందని చెప్పారు. 18 ఏండ్లు నిండిన అమ్మాయిలకే కళ్యాణలక్ష్మి వర్తిస్తుందని అన్నారు. ఈ కారణం వల్ల అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నత విద్య చదువుకోవడం ఆనందంగా ఉందన్నారు. మహిళా విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు ప్రకటించారు. ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ ఇస్తున్నామని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దామన్నారు.
సమాజంలో చదువుకు ఎంతో ప్రాధాన్యత : తలసాని
సమాజంలో చదువుకు ఎంతో ప్రాధాన్యత ఉందనిపశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. చదువు… చదువు అంటూ విద్యార్థులను ఒత్తిడికి గురి చేయొద్దని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను కోరారు. క్రీడలు, సాంస్కృతిక అంశాలకు కూడా ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. రాబోయే మూడేండ్లలో విద్యారంగంలో సమూల మార్పులొస్తాయని చెప్పారు. ఆ తర్వాత ఉత్తమ విద్యాసంస్థ, ఏ ర్యాంకు వచ్చినా తెలంగాణకే దక్కుతుందని వివరించారు. ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి మాట్లాడుతూ మన ఊరు మనబడి పాఠశాలల్లో వసతుల కల్పనకే పరిమితమని చెప్పారు. జూనియర్‌, డిగ్రీ, పీజీ, సాంకేతిక కాలేజీలతోపాటు విశ్వవిద్యాలయాలనూ అభివృద్ధి చేయాలని కోరారు. విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలన్నారు. హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందిందని అన్నారు. దేశంలోనే సీఎం కేసీఆర్‌ నెంబర్‌వన్‌గా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలోని 133 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 93కు న్యాక్‌ గ్రేడ్‌ ఉందని ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి చెప్పారు. విద్యార్థుల నమోదు నిష్పత్తి జాతీయ స్థాయిలో 27.3 శాతం ఉంటే, తెలంగాణలో 39.1 శాతం ఉందన్నారు.
మహిళలకు సంబంధించి జాతీయ స్థాయిలో 27.9 శాతం ఉంటే, తెలంగాణలో 40.3 శాతం ఉందని వివరించారు. ఎస్సీలు జాతీయ స్థాయిలో 23.9 శాతం ఉంటే, తెలంగాణలో 39.3 శాతం ఉందని చెప్పారు. విద్యార్థులకు ఉపాధి, నాణ్యమైన విద్య అందించడం కోసం చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ కోర్సులు, బీఎస్సీ ఆనర్స్‌ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులను ప్రారంభించామని అన్నారు. మన ఊరు మనబడి ప్రారంభించినా, విద్యార్థులకు రాగిజావ అందించినా ఇంకా చేయా ల్సిన పనులు చాలా ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన చెప్పారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లను ప్రశం సాపత్రం ఇచ్చి సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మెన్‌ వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.