కవిత్వపు పల్లకీపై ఊరేగిన దేశీయ పలుకుబడి

Domestic renown paraded on the poetical palanquinతెలంగాణ అనగానే సంస్కృతికి పర్యాయపదం. కాలమెంత ఆధునికమైనా,సాంకేతికమైనా,నాగరీకమైనా తెలంగాణ జనులు వాళ్ల సంస్కృతిని కొలుస్తారు. గులాబీల కన్నా తంగేడుపూలకే మొక్కుతారు.మేడమిద్దెల స్వర్గం కన్నా మట్టినే తలుస్తారు. డిజేలు పక్కన మోగుతోన్నా బోనమెత్తుకుని పూనకమాడతారు. దేశీయమైన సోయి తెలంగాణ గాలినిండా పరివ్యాప్తమై ఎపుడూ ఉంటూనే వుంది. అక్కడి కవులు మట్టిమీద కాళ్లూని కాదు, కలమూనుతారు. మట్టిలో మట్టిగంధంగా చెమటోడ్చే మనుషులకు కావ్యంతో చుట్టరికాలు కలుపుతారు. అలా కవనపల్లకీపై దేశీయతను నుడికారపుసొంపుగా ఊరేగిస్తోన్న నవీనకలం నాగిళ్లరమేష్‌ .అతడి నుడులకూర్పుకి పెట్టుకున్న శీర్షిక నల్లకొడిసె వన్నెకాడు.ఇదివరలో అతడి కవిత్వపుటొరలో నింపుకొన్న ఆయుధాలు వడిసెలరాళ్లు. ఆ రాళ్లతో గుండెలను తట్టే నానీలను పలికించాడు. మరొకటి ఉద్ధరాశిపూలచెట్టు. కైకిలికిపోయే అమ్మ శ్రామికతను కవిత్వ రసాలోకంగా బొమ్మకొట్టించాడు. పదాలను బతుకు వీచికలుగా ప్రసరించిన గతమే కాదు వర్తమానమూ వుంది. అదే నల్లకొడిసెవన్నెకాడు.
పాలకొడిశె, నల్లకొడిశె చెట్లుంటాయి. ఈ కవి జీవితానికి ప్రతీకగా నిలిచిందీ,నీడపట్టిందీ నల్లకొడిశె.దాని వన్నెలో వున్నవాడు ఈ కవి నాగిళ్ల రమేషే.శ్రమజీవితాన్ని పుష్కలంగా బతికొచ్చిన నోస్టాల్జియా అతడు. ఆ శ్రమజీవితపు నెమరేతలో ఈ కవిత్వపుసారమంతా వ్యక్తమయింది. మనసుపదను గల్ల ఈ కవి తనను తాను దేవులాడుతున్నాడు.ఈ సంపుటి సాక్షిగా తనలాంటి పల్లెమట్టివాసనల బాలకులను వెతుకులాడుతున్నాడు.
”పెండతో మెత్తువేసిన గాదెలోకి దిగి/ గిన్నెతోటి అడుగువడ్లను ఎత్తేటందుకు/ ముక్కులనిండా నెత్తినిండా/ దుమ్ము పోసుకున్న ఆ పోరడేడీ!?/ నెత్తికి తువ్వాలపేగు కట్టుకుని/ జప్పజప్ప మునుం ఎల్లి/ ముసలి అవ్వకు ఎదురుమునుం గోసే/ నల్లకొడిసె వన్నె ఆ పోరగాడు నాగ్గావాలె”
కవి భద్రతగల ఉద్యోగజీవితంలో వున్నా మూలాలను మరువలేదు. పల్లెను గుండెలోంచి తీసేయలేదు. పల్లె ఆనవాళ్లను నాలుకపైనుంచి తోసేయలేదు. పల్లెలో మట్టిలో వెన్నొంచి పాడుబడే జనాల పనిదృశ్యాలను సూక్ష్మదృష్టితో రాసాడు. రాయలవారు ఆముక్తమాల్యదలో రాసిన గ్రామీణ జీవిత దృశ్యాలను గుర్తుకుతెచ్చాడు. రాయలవారి కలానికి వున్న పల్లెదృశ్యాల నిశితత్వం ఈ కవిలోనూ వుంది. అయితే రాయలోరిది చూసిన అనుభూతి. నాగిళ్లరమేష్‌ ది పల్లెలో కోటి అడుగుల మట్టిజాతరగా తిరుగాడిన అనుభవం. స్వానుభవైక పల్లెటూరి శ్రమజీవన వైభవాన్ని పుటలీకరించాడు ఈ కవి. పెండతో మెత్తువేసిన గాదె, కిందగ్గోసిన కల్లంమడి పదనవాసన పీల్చడం, ఇరికికొమ్మను నరుకుతూ గొడ్డలిచిప్ప కాలుకి తాకడం, పారలేకున్న సర్రసర్ర కాలువను తెంపడం, గొడ్లను కాసుకుంటూ దూపకి గట్టుదోనెల్లోని వాననీళ్ల మాధుర్యాన్ని చవిచూడటం వంటి దృశ్యాలు ఈనాటి కుర్రతరం ఎరుగదు. గనకే నాగిళ్ల ఆగామీ తరాలముందు పల్లెదృశ్యాలకుప్పవోశాడు. పల్లె అణువణువునీ తన అణువణువు పులకింతగా నింపుకున్న క్రియాశీలకవి నాగిళ్లరమేష్‌ .
నలుపువన్నెను తనివితీరా చూసేటోళ్లుండరు. తాత్వికత మనసునిండిన మనుషులే నలుపువన్నె మనుషులను అక్కునజేర్చుకుంటారు. నల్లనివాడు పద్మనయనంబుల వాడని పాడతారు. ఈ కవి శ్రమచేతలచేత నలుపుబారిన దళితబహుజనులకు ప్రతీకగా తీసుకున్నాడు. ప్రేమార ఆ మనుషుల పాటుబడే గుణాన్నీ, నీతిని,స్వచ్ఛతను కావ్యవేదికల మీద నిలిపాడు.ఆ మనుషుల్లో ఒకప్పుడు ఒకడైన ఈ కవి వాళ్ల బురదపాదాలకు కవితాభివందనాలు చేసాడు. దేశీయ పలుకుబడితో వాళ్ల జీవన వైభవాలను మూర్తీభవింపజేసాడు. ఆ తీరునిపుడు గమనిద్దాం.
”గుండె అర్రల నిండా/ పజ్జొన్నకర్రలలాంటి/ ఆకలిజెండాలు వుంటాయి/ నువ్వు దళారీచేతిలో మోసపోతున్నా/ రాజ్యపు చేతిలో మోసపోతున్నా/ మట్టిమీదున్న మట్టంత నమ్మకమే/ నిన్ను బతికిస్తుందని కదా/ మట్టిబెడ్డలకిందా నీ ఆత్మగింజను/మళ్లీ మళ్లీ దాసుకుంటావు/నీవే గింజై/ నీ తనువే మట్టై”. రైతు సాగుని ఆత్మగింజగా ఎలా అంకితభావంతో పండిస్తాడో అలతిఅలతి జనులభాషలో రాయగల నిపుణత నిండుగున్నోడీ కవి.
పొలంగెట్టుకాడ, మూలవాగు కాడ, తండాతల్లి పొయ్యి వూదేకాడ, సెమటచుక్కలు బతుకుపువ్వులయ్యేచోట మన్నులో తలకాయబెడతడీ కవీ.మన్నును కుంకుమ జేసే చేతులకు పబ్బతివడుతడు. తన వాక్యాలు పచ్చని బీరపూలపాదై గుడిసెను కావ్యనాయకను చేస్తుంది. మరొకవాక్యం వలసపాఠమవుతుంది. ఇంకోవాక్యం లోకపుచెట్టు మండమండకు మమతలను మొగ్గ తొడిగించాలని ముందుకురుకుతుంది.
నాగిళ్లలో మట్టిమీద మహాప్రేమ కనవడుతుంది. మట్టిలో మట్టిగంధమై గుబాళించే మనుషుల మీద ఇష్టం తెలుస్తున్నది. మట్టి మనుషుల పదాలనే సిరాకి సోపతి కుదిర్చాడు.మట్టిపదాలను కవిత్వపెదాలగా రమణింపజేసి సంపుటికి అనుబంధంగా అతికించాడు. ప్రాకృతిక సోయిని మతిగనిచ్చాడు. కొన్ని మట్టిపదాలను బుక్కుదాం.
1.”వసంత వాసనల నలుగువెట్టుకున్న పెండ్లిపిల్ల/అడివి”
2.”దూదిపూల మబ్బులహారం/నేలతల్లి మెడకు చుట్టుకునే /ఆవుసు”
3.”ఒక్కొక్కసారి కల్లుమండువ/బోధివృక్షం”
4.”తడిని దాచుకున్న ఇసుకపొర/సోపతి”
5.”రెండు సేతుల ఇత్తునం ఏసే మా అవ్వ/ద్విపదకావ్యం”
ఇలా గంపకెత్తితే నిండి పొర్లుపోయేన్ని కమ్మకమ్మని మట్టిపదాలున్నాయి. బ్రివిటీనీ,నవ్యతను, ఊహాశక్తినీ, భావాలను చిత్రాలుగా గీసే నిపుణత సంపుటిసుతన పలికించడం చేశాడు. ఆఖరిముద్దలో నెయ్యి కలిపి తిన్నంత రుచులూరించారు.
దేశీయపదాలను ఒడుపుగా దిగుబడి చేసుకున్నాడు. జీవితాన్ని పులుముకున్న నలుపువన్నెల దుమ్ముదమ్ము పదాలను,వాక్యాలను సంబురంగా వాడుకున్నాడు. గుజులుగుజులుగా వున్న వరినారు,పునాసకు పుదిచ్చిన ఇత్తునం గంప,గెరువిచ్చిన వానకు పురివిప్పె నెమలి,లొట్టపీసు పూలను సుక్కలపర్వతం జేసే కొంగలు వంటి పల్లె పదచిత్రాలతో ఇబ్బడిముబ్బడి సహజసౌందర్యాన్ని కవిత్వంగా సమకూర్చాడు. సాగుతది,విసిరేస్తది,దండం బెడతది, ఎరుకజేస్తది,నవ్వుతది వంటి క్రియలను, ఇంకింత,గియింత, ఇంతాంత,అసొంటి వంటి పదాలను అభిరుచితో వాడకం చేసాడు. వలె,లాగా ఉపమాలంకారంలో వున్నట్టు దేశీయనుడిలో సిమిలీవాచకంలా అసొంటిని తెచ్చాడు.
కవికి తాత్వికతలో ప్రవేశం వున్నప్పుడు,అతడి కవిత్వంలో ఆవేశం లేని నది కనవడుతుంది. తేటబడిన ప్రవాహం కనబడపడుతుంది. నాగిళ్ల దేశీయపదాలతో సరళతాత్వికతను సాధించాడు.
”కల్లంబండ మీద ఉసుకె కలువని దినుసువోలె/బతుకుని తూర్పార వట్టుకొనుడు ఇష్టం”
”మూలవాగు మూలవాగు/నా మైలను తెల్లగా కడిగేందుకు/ నాలోనే పారు,నాతోనే పారు”
నాగిళ్లరమేష్‌ నల్లకొడిసె వన్నెకాడు దేశీయనుడితో పాటు, దళిత బహుజన ఆదివాసీ జనుల వెతలతోపాటు, మానవ సంబంధాలను, అంతర్లీన ప్రసక్తాలుగా సమకాలీనత, తాత్వికత విరివిగా వచించాడు. పల్లెలో శ్రమజనుల బతుకు దృశ్యాలను పరిపూర్ణంగా దర్శింపజేసాడు. శీర్షికలను పెట్టడంలో శ్రద్ధ కనబరిచాడు. కొన్ని కవిత్వనిర్మాణ శిల్పాలు, ఎత్తుగడలు ఒకేలా అనిపించాయి. కనబడితే బాగుణ్ణు, అలా జరిగితే బాగుణ్ణు, అవ్వాలనివుంది లాంటి నిర్మాణాలు మరింత వైవిధ్యాన్ని రాస్తే సంపుటి శిల్ప ప్రజ్ఞను చేరేది. మట్టితోని అభివ్యక్తులు పెక్కుసార్లు పునరుక్తం కాకుండా చూడాల్సింది. చిన్ని చిన్ని విషయాలే ఇవి. అయితే నాగిళ్లరమేష్‌ కవిత్వమంతా ఎన్నదగినదీ,నాణ్యమైనదీ. చర్చించదగిందీ, దేశీయనుడుల అన్వయింపులో అతడి కలం మంచిచేర్పు. పల్లె ఉపమానాలను బహుగా కావ్యస్థం చేసాడు. అతడు విస్తతిగల వస్తువులని ఆవిష్కరించాడు. నల్లకొడిసె వన్నెకాడు నాగిళ్ల రమేష్‌

– మెట్టానాగేశ్వరరావు, 9951085760