భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5. దీని నుంచి రాబోతున్న ఒరిజినల్ ఫిల్మ్ ‘లవ్, సితార’. ఈనెల27 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అనేక భావోద్వేగాల కలయికగా ఈ ఫ్యామిలీ డ్రామా తెరకెక్కింది. ఓ కుటుంబంలోని సభ్యుల మధ్య ఉండే వివిధ రకాలైన సమస్యలను, ఎమోషన్స్‌ను చక్కగా ఎలివేట్ చేసే సినిమా ఇదని ట్రైలర్‌ను చూస్తుంటే అర్థమవుతుంది. రోనీ స్క్రూవాలా ఆర్‌ఎస్‌విపి మూవీస్ నిర్మాణంలో వందనా కటారియా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. శోభితా ధూళిపాళ మాట్లాడుతూ,’ఇందులో నటిచడం చక్కటి అనుభూతినిచ్చింది. నేను పోషించిన పాత్రలో అనేక షేడ్స్ ఉన్నాయి. వైవిధ్యమైన పాత్ర. స్వతంత్య్ర భావాలున్న ఇంటీరియర్ డిజైనర్ పాత్రలో నటించాను. నిజాయితీగా ఉండే ఓ అమ్మాయి తన జీవితంలో ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎలా ఎదుర్కొందనేదే కథ. చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి’ అని అన్నారు. డైరెక్టర్ వందన కటారియా మాట్లాడుతూ, ‘ఇది ప్రేక్షకులకు ఓ ఆహ్లాదకరమైన ప్రయాణం. చక్కటి ఫ్యామిలీ డ్రామా. వినోదంతో పాటు ప్రేమ, కుటుంబంలో వ్యక్తుల మధ్య ఉండే భావోద్వేగాలను ఇందులో చక్కగా చూపించాం’ అని అన్నారు.