నిమజ్జనానికి వేళాయే.!

నవతెలంగాణ – మల్హర్ రావు
నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడు నేడు, రేపు గంగఒడిలోకి, గణేశ్ నిమజ్జనాలకు వెళ్ళేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారు. నిమజ్జన ప్రాంతాలను ఇటీవల కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి, సిఐ నాగార్జున రావు, కొయ్యుర్ ఎస్ఐ నరేశ్ పరిశీలించారు. నిమజ్జన ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మండలంలో  సుమారు రెండు వందలకు పైగా వినాయక మండపాలను ఏర్పాటు చేయగా సోమవారం వందకు పైగా విగ్రహాలను వివిధ ప్రాంతాల్లో నిమజ్జనం చేసేందుకు ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేసుకున్నాయి. నిమజ్జనం చేసే పలు ప్రాంతాలను ఇప్పటికే అధికారులు పరిశీలించారు.
నిబంధనలు ఇవీ..
శోభాయాత్ర సందర్భంగా టపాసులు, డీజేలకు అనుమతి లేదు. ఊరేగింపు సమయంలో కండిషన్లో ఉన్న వాహనాలపైనే విగ్రహాలను తరలించాలి. చిన్నారులు, వృద్ధులు నిమజ్జన ప్రాంతాలకు వెళ్లవద్దు. ఒకవేల వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి.. పోలీసులకు సహకరించాలి. నిమజ్జనం శాంతియుతంగా నిర్వహించాలి. నిమజ్జన ప్రాంతాల్లో పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా ఉంచడంతో పాటు గొడవలు సృష్టించే వారి కదలికలపై పోలీసుల నిఘా ఉంటుంది. విలువైన వస్తువులు ధరించవద్దు.మద్యం తాగి వాహనాలు నడుపవద్దు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దు. మంచినీటి చెరువులో నిమజ్జనం చేమొద్దు. ఎవరి శోభాయాత్రలో వారే ఉండాలి. ఇతరుల శోభయాత్రలో జోక్యం చేసుకుని ఘర్షణలు పడొద్దు.