సెప్టెంబర్ 17 ఒక చారిత్రక సందర్భం. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు విలీనదినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాపితంగా విస్తృతంగా క్యాంపెయిన్స్ నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవం పేరుతో అధికారికంగా ఉత్సవాలు జరుపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ”ప్రజాపాలన దినోత్సవం” పేరుతో ఉత్సవాలకు పిలుపునిచ్చింది. గతేడాది బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహించిన బీఆర్‌ఎస్, ఎంఐఎంలు ఈ సంవత్సరం స్పందించలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమకాలంలో వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు ఐలమ్మ, దొడ్డి కొమరయ్యల పేర్లు విస్తృతంగా వాడుకున్న టీఆర్‌ఎస్ నాయకత్వం ఇప్పుడు మౌనం దాల్చింది. బీజేపీ మాత్రం ”రజాకార్” పేరుతో తమ అనుయాయులు విడుదల చేసిన చలన చిత్రాన్ని విస్తృతంగా ప్రచారంలో పెట్టి సాయుధ రైతాంగ పోరాటాన్ని మత కొట్లాటగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. నిరంతరం అదే ప్రచారం చేస్తున్నది. ఒకమతం నుండి మరొక మతం విమోచన సాధించినట్టు చరిత్రకు వక్రభాష్యం చెప్తున్నది. సెప్టెంబర్ 17న అసలు ఏం జరిగింది?
జులై 4, సెప్టెంబర్ 10 తేదీల ప్రాధాన్యతతో కలిపి చూసినప్పుడే సెప్టెంబర్ 17 ప్రత్యేకత సమగ్రంగా అర్ధమవుతుంది. విసునూరు జమీందార్ రామచంద్రారెడ్డి గూండాల దాడులకు దొడ్డి కొమరయ్య బలైనరోజు జులై 4. అదే జమీందారు దాడి నుంచి తనను, తన పంటను రక్షించుకునేందుకు సాహసోపేతమైన పోరాటం చేసిన ఐలమ్మ వర్ధంతి సెప్టెంబర్ 10. ఈ భూస్వామ్య, జమీందారీ వ్యవస్థ మీద సాగిన రైతాంగ సాయుధ పోరాట ఫలితమే హైదరాబాదు సంస్థానం, అందులో భాగంగా తెలంగాణ సెప్టెంబర్ 17న ఇండియన్ యూనియన్‌లో విలీనం. కుల, మత, ప్రాంతీయ భేదాల ప్రసక్తిలేని మహోద్యమమది. పేద రైతాంగం మీద దాడులు, దౌర్జన్యం చేస్తున్న భూస్వాములు హిందువులు. పాలకులు ముస్లింలు. భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తికోసం సాగిన పోరాటమది. దొడ్డి కొమరయ్య నేలకొరిగిన తర్వాత సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన నాయకత్వ బృందంలో మక్ధుం మొహియుద్ధీన్ ఒకరు. నిజాం రాచరికపు నిరంకుశత్వాన్ని నిలదీసిన కలంయోధులు షోయబుల్లాఖాన్, మక్ధుం మొహియుద్దీన్. భూస్వామ్య రాచరికాన్ని తిరస్కరించి సమసమాజం కోసం హైదరాబాదు నడిబొడ్డున ”కామ్రేడ్స్ అసోసియేషన్” ప్రారంభించిన ప్రముఖుల్లో ఆలం ఖుంద్‌మిరి ఒకరు. భూస్వామి దౌర్జన్యాలకు, నిజాం సైనికుల కుట్రలకు బలైన అమరుడు షేక్ బందగి. చాకలి ఐలమ్మ పంట రక్షణ కోసం తిరగబడి పోరాడిన దళ నాయకుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి. ఫలితంగా విసునూరు రామచంద్రారెడ్డి గూండాలు, నిజాం పోలీసులు భీమిరెడ్డి నర్సింహారెడ్డి నోట్లో మూత్రం పోశారు. హిందు భూస్వాములు, ముస్లిం రాజు, రజాకార్లు కలిసి రైతాంగం మీద దాడి చేయడానికి మతం అడ్డురాలేదు. తిరగబడిన రైతులకు, మేధావులకు కూడా మతం అడ్డురాలేదు.
1934లో కాకినాడలో కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైంది. 1939లో హైదరాబాదు నగరంలో కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించారు. 1941లో నైజాం ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ బీజం పడింది. మునగాల ప్రాంతం నుండి సూర్యాపేటలో అడుగుపెట్టిన చండ్ర రాజేశ్వరరావు కమ్యూనిస్టు బీజాలు నాటారు. 1946 అక్టోబర్‌లో ప్రారంభమైన సాయుధ పోరాటానికి నాయకత్వ బాధ్యత పుచ్చలపల్లి సుందరయ్యకు అప్పగించింది నాటి కమ్యూనిస్టు పార్టీ. కోస్తా ప్రాంతంలో సాగిన ఉప్పు సత్యాగ్రహంలోనూ, సహాయ నిరాకరణ ఉద్యమంలోనూ తెలంగాణ యువత పాల్గొన్నది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆంధ్ర ప్రాతం నుంచి అనేక మంది కమ్యూనిస్టు కార్యకర్తలు తరలివచ్చి ప్రత్యక్షంగా పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ పోరాట యోధులకు ఆంధ్ర ప్రాంతపు సరిహద్దు జిల్లాల ప్రజలు రక్షణ కల్పించారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులు సాయుధ పోరాటానికి, సైద్ధాంతిక అంశాలకు సంబంధించి తర్ఫీదునిచ్చారు. సింగరేణి కార్మికోద్యమనేత శేషగిరి విజయవాడలోనే తన రహస్య జీవితం గడిపారు.
1901లోనేే హైదరాబాదు నడిబొడ్డున శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం ప్రారంభమైంది. 1920 నాటికే ఖాజీపేట దగ్గర మడికొండలో తెలుగు గ్రంథాలయం ఉన్నది. 1922లో సురవరం ప్రతాపరెడ్డి ‘గోల్కొండ’ పత్రిక ప్రారంభించారు. అభివృద్ధి చెందిన దేశాల ప్రభావంతో కొందరు మేధావులు, వ్యాపారులు, చిన్నచిన్న పెట్టుబడిదారులు భాషా సాంస్కృతికోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఫలితంగా 1930లో జోగిపేటలో ఆంధ్ర మహాసభ ప్రారంభమైంది. మరోవైపు హైదరాబాదు సంస్థానంలో ఉన్న మరాఠి ప్రాంతంలో మహరాష్ట్ర పరిషత్, కన్నడ ప్రాంతంలో కన్నడ పరిషత్‌ల పేరుతో సాంస్కృతికోద్యమం సంఘటితమవుతూ వచ్చింది. ఆంధ్ర మహాసభ కార్యకర్తలు కమ్యూనిస్టు పార్టీవైపు ఆకర్షితులయ్యారు. అందువల్ల ఆంధ్ర మహాసభ సాంస్కృతికాంశాలకే పరిమితం కాకుండా, భూస్వాముల దోపిడీ, దౌర్జన్యాలపైన కూడా పోరాడింది. సాంస్కృతిక కృషిగా ప్రారంభమై, సంస్కరణోద్యమంగా రూపుదాల్చి సాయుధ రైతాంగ పోరాటంగా మారింది. క్రమంగా ఆంధ్ర మహాసభలో మూడు ధోరణులు ముందుకొచ్చాయి. 1934 నాటికే సనాతనులకు, సంస్కరణవాదులకు మధ్య సంఘర్షణ ప్రారంభమైంది. దాశరథి వెంకటాచార్య వంటి ఛాందసవాదులు సంస్కరణోద్యమాన్ని, ప్రజాస్వామ్య విలువలను కూడా సహించలేక పోయారు. సురవరం ప్రతాపరెడ్డి లాంటి ప్రజాస్వామ్యవాదులు ఛాందసవాదాన్ని తిప్పికొట్టారు. సంస్కరణోద్యమానికిి నడుం బిగించారు. 1943 నాటికి సంస్కరణవాదులకు, వర్గపోరాటానికి మధ్య సంఘర్షణ రూపుదాల్చింది. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి లాంటి నాయకులు జమీందారీ వ్యతిరేక వర్గపోరాటాన్ని ముందుకు నడిపారు. 1944 భువనగిరి మహాసభలో ఆంధ్ర మహాసభ చీలింది. రావి నారాయణరెడ్డి నాయత్వంలోని ఆంధ్ర మహాసభనే రైతాంగం నిజమైన ‘సంఘం’గా గుర్తించింది.
బ్రిటిష్ ఇండియాలో స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ, సామంత రాజ్యాలుగా ఉన్న సంస్థానాల్లో పోరాడవద్దని నిర్ణయించుకున్నది. కాంగ్రెస్ పార్టీ వైఖరి తెలంగాణలో ఆర్య సమాజం పేరుతో పనిచేస్తున్న మతోన్మాదులకే తోడ్పడ్డది. ఔరంగాబాద్ ప్రాంతానికి చెందిన అడ్వకేట్ ఖాసీం రజ్వీ నాయకత్వంలో ఏర్పడిన ‘రజాకార్’ సంస్థ దొరల గడీల కేంద్రంగా రైతాంగం మీద దాడులు చేసింది. ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టుల నాయకత్వంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటం మొదలైన తర్వాతనే నాటి మతోన్మాదుల ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయి. భారతదేశ స్వాతంత్య్రానంతరం సరిహద్దు ప్రాంతాల్లో భయంకరమైన మత కొట్లాటలు జరిగాయి. కానీ, హైదరాబాదు సంస్థానం భారతదేశంలో విలీనమైన సమయంలో కమ్యూనిస్టు ఉద్యమం, భూస్వామ్య వ్యతిరేక పోరాటం బలహీనంగా ఉన్న మరఠ్వాడ ప్రాంతంలో తప్ప, తెలంగాణలో అలాంటి మత కొట్లాటలు జరగలేదు.
1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఒకవైపు భారత దేశం, మరోవైపు పాకిస్థాన్ స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించాయి. డిసెంబర్ 29న నాటి హోంమంత్రి సర్దార్ పటేల్ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్‌తో యధాతథా ఒప్పందం సంతకాలు చేసారు. దీని ప్రకారం భారతదేశం, హైదరాబాదు సంస్థానం స్వతంత్ర మిత్ర దేశాలుగా వ్యవహరిస్తాయి. 1946 అక్టోబర్‌లో ప్రారంభమైన సాయుధ రైతాంగ పోరాటం 1948 సెప్టెంబర్ నాటికి ఉవ్వెత్తున లేచింది. గోల్కొండ కోటను కదిలించింది. నిజాం రాజు సింహాసనం కుప్పకూలే స్థితికి చేరుకున్నది. ఇంకేమాత్రం ఆలస్యం జరిగినా నిజాం రాచరికం ధ్వంసమై తెలంగాణ కమ్యూనిస్టుల వశమవుతుంది. ఇది గమనించిన నెహ్రూ ప్రభుత్వం సెప్టెంబర్ 13న ఇండియన్ యూనియన్ సైన్యాలను పంపారు. 17వ తేదీన హైదరాబాదు సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేస్తున్నట్టు నిజాం రాజు ప్రకటించాడు. ఒకవైపు తెలంగాణ రైతాంగం నరహంతక నిజాం రాజు మీద సాయుధ పోరాటం చేస్తుంటే, భారత హోంమంత్రి సర్దార్ పటేల్, నిజాం రాజు పరస్పరం అభివాదంతో స్నేహభావం పంచుకున్నారు. నిజాం రాచరికాన్నే తిరస్కరిస్తున్న తెలం గాణ ప్రజలమీద ఆ నిజాం రాజునే ‘రాజ ప్రముఖ్’గా నెహ్రూ-పటేల్ ప్రభుత్వం నియమించింది. క్రూరుడైన రజాకార్ నేత ఖాసీం రజ్వీని హోంమంత్రి సర్దార్ పటేల్ సకల మర్యాదలతో ప్రత్యేక విమానంలో పాకిస్తాన్‌కు పంపారు. ఉరికంబం ఎక్కవలసిన రాజుకే అధికారమిచ్చి గౌరవించడంతో పాటు, ఖాసీం రజ్వీ ప్రాణాలు కాపాడారు. అంతటితో ఆగలేదు. మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు నష్టపరిహారం, రాజ భరణాల పేరుతో ఏడాదికి కోటి రూపాయల చొప్పున ముట్టజెప్పారు. ఈ చరిత్రను బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న సర్దార్ పటేల్‌ను హిందువుల ప్రతినిధిగా చిత్రీకరిస్తున్నారు. నిజాం రాజు మీద యుద్ధం చేసి రాజును లొంగదీసుకున్నట్టు నమ్మబలుకుతున్నారు. మరోవైపు ఆనాటి నెహ్రూ ప్రభుత్వమే నిజాంరాజు మీద యుద్ధం చేసి హైదరాబాదు రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసినట్టు కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసుకున్న నెహ్రూ-పటేల్ ప్రభుత్వమే నిజాంరాజుతో మాత్రం యధాతథ ఒప్పందం చేసుకున్న విషయాన్ని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండూ మరుగుపరుస్తున్నాయి.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లేకపోతే విలీనం గానీ, సెప్టెంబర్ 17కు ప్రత్యేకతగానీ లేవు. ఇది కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన పోరాట ఫలితం. ఈ మొత్తం పోరాటంతో అణువంత సంబంధంలేని ఆర్‌ఎస్‌ఎస్ మరోవైపు ఆనాడు జమ్మూకాశ్మీర్ రాజ్యం భారతదేశంలో విలీనం కావడాన్ని వ్యతిరేకించింది. స్వతంత్ర రాజ్యంగానే ఉండాలని చెప్పింది. ఇలాంటి ఆర్‌ఎస్‌ఎస్ దాని రాజకీయ విభాగమైన బీజేపీ ఇప్పుడు తెలంగాణ చరిత్రను, జమ్మూ కాశ్మీర్ చరిత్రనూ వక్రీకరిస్తున్నాయి. కొత్త తరాన్ని తప్పు దారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రతిదానికి మతంరంగు పులుముతున్నాయి. అధికార దాహం, స్వార్థ రాజకీయ ప్రయోజనాలే తప్ప చరిత్రను చరిత్రగా చూసేందుకు వీరు సిద్ధంగా లేరు.
– ఎస్ వీరయ్య