సాయుధ పోరాటాలతోనే స్వేచ్ఛ స్వాతంత్య్రం

Adilabadనవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
తెలంగాణ సాయుధ పోరాటం ద్వారానే ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు లభించాయని, కానీ తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రను పాలకులు వక్రీకరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు నళినిరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విమోచన దినోత్సవం పేరిట బీజేపీ చేపట్టే కార్యక్రమాలు ప్రజలను మభ్య పెట్టేందుకేనని అన్నారు. నైజాం వ్యతిరేక పోరాటంలో బీజేపీ పాత్ర ఏమాత్రం లేదన్నారు. తెలంగాణ పోరాటాన్ని హిందూ, ముస్లింల మధ్య జరిగిన గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని స్పష్టం చేశారు. తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని, ట్యాంక్‌ బండ్‌పై సాయుధ పోరాట యోధుల విగ్రహాలు పెడతామని, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను చేర్చుతామని చెప్పిన ప్రభుత్వం ఎందుకు ఆ హామీలను నెరవేర్చలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటాల రాములు, అరుణ్‌ కుమార్‌, మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమీనాఖాన్‌, బీకేఎంయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్ధాంగి రమేష్‌, ఖండాల గణేష్‌, సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు షేక్‌ పాషా, బెజ్జంకి నర్సింగరావు, కృష్ణవేణి, సంగీత పాల్గొన్నారు.
కాసిపేట : తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలని సీపీఐ మండల కార్యదర్శి దాగం మల్లేష్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్మరించుకుంటూ నిర్వహించే వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కాసిపేట మండల కేంద్రంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సీపీఐ మండల కార్యదర్శి దాగం మల్లేష్‌ మాట్లాడుతూ నిజాం రాచరిక పాలనకు, కరుడు గట్టిన భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా సాగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ వాస్తవ చరిత్రను చీకటి పొరల్లోకి నెట్టాలనుకుంటున్న బీజేపీ ఆటలు సాగనీయమన్నారు. 1956 వరకు గవర్నర్‌గా నిజాం ఉన్నాడు మరి అలాంటప్పుడు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద శక్తులు హైదరాబాద్‌ సంస్థానం విమోచన జరిగిందని ఎలా చెబుతారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తప్పుడు భాష్యాలు చెబుతూ ఇది హిందూ ముస్లింలకు జరిగిన ఒక సంఘర్షణగా చిత్రీకరించే దుష్ప్రచారాన్ని సీపీఐ పార్టీ ఎదుర్కొంటూ వాస్తవ చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్తున్నదని, దేశ స్వాతంత్ర పోరాటానికి, హైదరాబాద్‌ సంస్థానంలో జరిగిన భూస్వామ్య నిరంకుశ పాలనకు ఏనాడు మద్దతు తెలుపకుండా పాలకవర్గాలకు వత్తాసు పలికిన ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు నేడు చరిత్రను కప్పిపుచ్చి ప్రజలు చేసిన త్యాగాలను చెప్పకుండా చేసే అబద్ధపు ప్రయత్నాలను ఎండగడతామన్నారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్‌ వర్కర్స్‌ జిల్లా కార్యదర్శి జాడి పోచం, పులి శంకర్‌, దాగం రాయలింగు, దుర్గం పోశం, గోదారి లింగమూర్తి, బండారి సత్తయ్య పాల్గొన్నారు.