ఆద్యంతం వైవిధ్యం

Variation throughoutనోయల్‌, రిషిత నెల్లూరు హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘బహిర్భూమి’. ఈ చిత్రాన్ని మహంకాళి ప్రొడక్షన్‌ బ్యానర్‌ పై మచ్చ వేణుమాధవ్‌ నిర్మిస్తున్నారు. రాంప్రసాద్‌ కొండూరు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ ఈవెంట్‌ను ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మచ్చ వేణు మాధవ్‌ మాట్లాడుతూ, ‘సినిమా మీద ప్యాషన్‌తో చిత్ర పరిశ్రమకు వచ్చాను. ప్రొడ్యూసర్‌గా మూవీస్‌ చేస్తున్నాను. ఈ సినిమాకు మా టీమ్‌ ఎంతో సపోర్ట్‌ చేశారు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. త్వరలో మంచి డేట్‌ చూసి గ్రాండ్‌గా థియేట్రికల్‌ రిలీజ్‌ చేస్తాం’ అని చెప్పారు. ‘ఈ సినిమాకు హీరో నోయెల్‌ ఎంతో సపోర్ట్‌ చేశారు. నోయెల్‌, ఫణి మధ్య కామెడీ సీన్స్‌ హైలెట్‌ అవుతాయి. మేము ‘బహిర్భూమి’ అని టైటిల్‌ ఎందుకు పెట్టాం అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. వెస్ట్రన్‌ కల్చర్‌ కంటే మన కల్చర్‌ చాలా గొప్పది. ఈ విషయాన్ని మా మూవీలో అంతర్లీనంగా చెబుతున్నాం’ అని దర్శకుడు రాంప్రసాద్‌ కొండూరు అన్నారు. హీరోయిన్‌ రిషిత నెల్లూరు మాట్లాడుతూ, ‘ఈ సినిమాతో హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయం అయ్యే అవకాశం దక్కింది. ఈ అవకాశం నాకు ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌ చెబుతున్నా. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది’ అని తెలిపారు. హీరో నోయల్‌ మాట్లాడుతూ, ‘చాలా మంచి మూవీ చేశాం. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ ఇందులో ఉంటాయి. త్వరలో థియేటర్స్‌లోకి సినిమా వస్తుంది. మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు.