వీట్ తో వావ్..

వీట్ తో వావ్..గోధుమ పిండిలో ఉండే పీచు, విటమిన్లు, పోషకాలు అనేక చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. భారతీయుల ప్రధాన ఆహార పదార్థాలలో ఒకటైన గోధుమ పిండిలో చాలా ఆరోగ్యకరమైన గుణాలు ఉన్నాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. బలవర్ధకమైన, ఆరోగ్యకరమైన గోధుమపిండి, రవ్వతో చేసే కొన్ని రెసిపీలునేటి మానవిలో…
డ్రై ఫ్రూట్స్‌ బిస్కెట్స్‌
ఇంట్లో తయారు చేసుకునే బిస్కెట్స్‌ అనగానే చాలా మందికి గుర్తొచ్చేవి మైదా పిండితో చేసేవి. కానీ గోధుమ పిండితో రుచికరమైన బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు. అంతేకాదు వీటిల్లో డ్రై ఫ్రూట్స్‌ కూడా మిక్స్‌ చేయవచ్చు. సాధారణంగా బిస్కెట్లు అంటే పిల్లలకు చాలా ఇష్టం. ఇలా ఇంట్లోనే హెల్దీగా తయారుచేసి పిల్లలకు ఇస్తే.. ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు ఇవి నిల్వ కూడా ఉంటాయి. చాలా తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. మరి హెల్దీ అండ్‌ టేస్టీగా ఉండే ఈ గోధుమ పిండి బిస్కెట్లను ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, టూటీ ఫ్రూటీ, బాదం పప్పు, జీడిపప్పు, యాలకుల పొడి, పాలు, పంచదార లేదా బెల్లం పొడి, బటర్‌ లేదా నెయ్యి. ఉప్పు, వంట సోడా, ఆయిల్‌.
తయారీ విధానం: ముందుగా ఒక ప్లేట్‌లోకి డ్రై ఫ్రూట్స్‌, ట్రూటీ ఫ్రూటీలను తీసుకుని చిన్నగా కట్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని ఇందులో పాలు, పంచదార, యాలుకల పొడి, బటర్‌ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులో ఉప్పు, వంట సోడా, గోధుమ పిండి, డ్రై ఫ్రూట్స్‌ కూడా వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిపై మూత పెట్టి ఓ అరగంట నాననివ్వాలి. బాగా నానిన పిండిని ముద్దలుగా చేసుకొని మందంగా ఉండే చపాతీలా చేసుకోవాలి. దీన్ని కావాల్సిన షేప్‌లో బిస్కెట్లుగా కట్‌ చేయాలి. ఇప్పుడు వీటిని కడాయిలో వేసుకుని.. ఆయిల్‌లో ఎర్రగా అయ్యేంత వరకూ వేయించి.. పక్కకు తీసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి డ్రై ఫ్రూట్స్‌ బిస్కెట్లు సిద్ధం. వీటిని గాలి తగలకుండా నిల్వ చేస్తే.. పది రోజుల వరకూ ఉంటాయి.
లడ్డూలు
కావలసిన పదార్థాలు : గోధుమపిండి – అరకప్పు, బెల్లం తురుము – ఒక కప్పు, నెయ్యి – పావు కప్పు, కొబ్బరి తురుము – నాలుగైదు స్పూన్లు, జీడిపప్పు – గుప్పెడు, బాదం – గుప్పెడు, కిస్‌ మిస్‌ -గుప్పెడు. ఉప్పు – చిటికెడు, యాలకుల పొడి – అర స్పూను
తయారీ విధానం : స్టవ్‌ మీద కళాయి పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత గోధుమ పిండిని వేయించుకోవాలి. అది ఉండ లు కట్టకుండా చూసుకోవాలి. పచ్చివాసన పోయి కాస్త రంగు మారేవరకు వేయించుకోవాలి. తర్వాత ఆ పిండిని ఒక గిన్నె లోకి తీసుకొని పక్కన పెట్టు కోవాలి. ఇప్పుడు అదే కళాయి లో బెల్లం తురుమును వేసి తీగపాకం రానివ్వాలి. అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండిని కూడా వేసి బాగా కలపాలి. అలాగే బాదం పప్పులు, కిస్‌మిస్‌లు, తరిగిన జీడిపప్పులు, కొబ్బరి తురుము, యాలుకల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమం కాస్త గట్టిపడేదాకా కలుపుతూ ఉండండి. ఆ తర్వాత పావు కప్పు నెయ్యిని అందులో వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని చల్లారే వరకు అలా వదిలేయాలి. తర్వాత దాన్ని ఉండలుగా చుట్టుకొని గాలి చొరబడని డబ్బాలో వేసుకోవాలి. అవి 15 నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. వీటిని తినడం వల్ల పిల్లల్లో రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది.
క్రిస్పీ దోశలు..
కావాల్సిన పదార్థాలు : గోధుమ పిండి – అరకప్పు, బియ్యం పిండి – పావు కప్పు, ఉప్పు – తగినంత, ఇంగువ -చిటికెడు, జీలకర్ర – అర టీస్పూన్‌, కరివేపాకు – 1 రెబ్బ, పచ్చిమిర్చి – 2, అల్లం – అంగుళం, ఉల్లిపాయ – 1 పెద్దది, పెరుగు – 1 టేబుల్‌ స్పూన్‌
తయారీ విధానం : ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చిని బాగా కడిగి సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్‌ బౌల్‌ తీసుకుని దానిలో గోధుమ పిండి, బియ్యం పిండి, ఉప్పు, ఇంగువ వేసి బాగా కలపాలి. దానిలో పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉల్లిపాయ, అల్లం వేసి బాగా కలపాలి. ఇందులో కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఉండలు లేకుండా పిండిని బాగా కలపాలి. దోశల బ్యాటర్‌ను సిద్ధం చేసుకునేందుకు అవసరమైన నీటిని వేయాలి. పిండిలో ఉండలు లేకుండా బాగా కలిపాలి. దానిలో పెరుగు కూడా వేసి కలిపి ఓ పది నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు స్టౌవ్‌ వెలిగించి దానిపై దోశ పాన్‌ పెట్టండి. అది వేడి అయ్యాక నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న దోశ మిశ్రమాన్ని తీసుకోండి. పిండిని మరోసారి బాగా కలిపి దోశలు పోసుకోండి. అంచులకు కాస్త నూనె వేసి మీడియం మంట మీద దోశలను వేయండి. ఒక వైపు ఉడికిన తర్వాత దోశను మరోవైపు తిప్పి కాల్చండి. దీని అంచులు గోల్డెన్‌ కలర్‌, క్రిస్పీగా మారినప్పుడు దోశను తిప్పితే మంచిది. ఇలా చేస్తే కనుక రెండో వైపు కాల్చాల్సిన పని ఉండదు. ఇలా తయారు చేసుకున్న గోధుమ దోశలను… కొబ్బరి లేదా పల్లీ చట్నీలతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
ఇడ్లీ
ఇడ్లీ పిండి లేనప్పుడు మార్నింగ్‌ టిఫిన్‌ తయారు చేయాలనుకుంటే గోధుమ రవ్వతో ఇలా చేయండి. సైడ్‌ డిష్‌గా కొబ్బరి చట్నీ, టమోటా చట్నీ, సాంబార్‌ మరింత అద్భుతంగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు : గోధుమ రవ్వ – ఒక కప్పు, పెరుగు – పావు కప్పు, పచ్చిమిర్చి – సన్నగా తరిగినది పావు కప్పు, కరివేపాకు – కొద్దిగా, తురిమిన క్యారెట్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు, సన్నగా తరిగిన బీన్స్‌- రెండు టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – ఒక టేబుల్‌ స్పూన్‌, నూనె – కావలసినంత.
తయారీ విధానం: ముందుగా పెరుగును ఒక స్పూన్‌తో మిక్స్‌ చేసుకోవాలి. తర్వాత స్టౌ మీద పాన్‌ పెట్టి అందులో రెండు టీస్పూన్ల నూనె పోసి వేడయ్యాక ఆవాలు, శెనగపప్పు, ఇంగువ పొడి వేసి తాలింపు వేయాలి. తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. అందులో గోధుమ రవ్వ వేసి మీడియం మంట మీద కొద్దిసేపు వేయించి చల్లారనివ్వాలి. చల్లారాక, గోధుమ రవ్వను పెరుగులో వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి, అవసరమైతే కొన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. తర్వాత తురిమిన క్యారెట్‌, బీన్స్‌ మరియు కొంచెం కొత్తిమీర వేసి బాగా కలపాలి 3-5 నిమిషాలు నాననివ్వండి. చివరగా పిండిని కలిపి ఇడ్లీ ప్లేట్‌లో పోసి 10-12 నిమిషాలు ఉడకబెడితే రుచికరమైన గోధుమ రవ్వ ఇడ్లీ రెడీ.
సమోస
కావలసిన పదార్థాలు : గోధుమపిండి – అర కప్పు, ఉప్పు – తగినంత, నూనె డీప్‌ ఫ్రైకి సరిపడా, స్టఫింగ్‌ కోసం : ఆవాలు – ఒక స్పూను, జీలకర్ర – ఒక స్పూను, క్యారెట్‌ తురుము – కప్పు, ఉల్లి తరుగు – ఒక కప్పు, క్యాప్సికం తరుగు – ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను, రెండు పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా.
తయారీ విధానం : ఒకపాత్రలో గోధుమపిండి, ఉఫ్పు, తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టౌవ్‌ మీద బాండీలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. అందులో ఉల్లి తరుగువేసి ఎర్రగా వేయించుకోవాలి. అల్లంవెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత క్యారెట్‌ తురుము, క్యాప్సికం, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి కొద్దిగా వేగాక దింపేయాలి. చపాతీ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చిన్న చపాతీలుగా చేసుకోవాలి. అందులో వండి పెట్టుకున్న క్యారెట్‌, క్యాప్సికం కూరను స్టఫింగ్‌ చేసుకొని సమోసా ఆకారంలో చుట్టుకోవాలి. స్టౌమీద బాండీలో డీప్‌ ఫ్రైకి సరిపడా నూనెవేసి బాగా కాగాక వీటిని వేసి బంగారు రంగులోకి వచ్చేలా వేయించుకోవాలి.