నవతెలంగాణ – కంఠేశ్వర్
కేంద్ర ప్రభుత్వం జూలై 1వ తేదీ నుండి తీసుకువచ్చిన నూతన నేర న్యాయ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ శివారులోని బోర్గం బ్రిడ్జి వద్ద గల భూమారెడ్డి కన్వన్షన్ మిని ఫంక్షన్ హల్ లో నూతన నేరన్యాయ చట్టాల పై మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవర్, ఐ.పి.యస్. ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ.. జులై 1వ తేదీ నుండి భారత ప్రభుత్వ నూతన నేర న్యాయ చట్టాలు – 2023 అమలులోకి వచ్చిన తరుణంలో పలుకేసుల దర్యాప్తు విచారణలో పాటిస్తున్న నూతన విధానాల పై మీడియా మిత్రులకు అవగాహన కల్పించేందుకు, భారతీయ న్యాయ సన్నిహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత,భారతీయ సాక్ష్య అధినియం లకు సంబంధించిన పలు చట్టాల న్యాయ శాస్త్ర గ్రంధాలలో గల ప్రతీ అంశాల గురించి క్షణ్ణంగా తెలియజేశారు.ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్), సీఆర్పీసీ చట్టాన్ని భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), అదేవిధంగా ఎవిడెన్స్ యాక్ట్‌ను భారతీయ సాక్ష్యఅధినియమం చట్టాలుగా మార్పు చేశారన్నారు.ఐపీసీలో 511 చట్టాలు ఉంటే వాటిని బీఎన్ఎస్లో 358కి తగ్గించారని చెప్పారు. అదేవిధంగా సీఆర్పీసీలో 484 వరకూ ఉంటే వాటిని బీఎన్ఎస్ఎస్లో 531కి పెంచారని, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 167 చట్టాలు ఉంటే వాటిని బీఎస్ఎలో 170కి పెంచారన్నారు.కేంద్రప్రభుత్వం అందరికీ అవసరమైన, ఆమోదయోగ్యమైన చట్టాలను ఏర్పాటు చేసిందని వివరించారు. ఈ అవగాహణ కార్యక్రమం పూర్తిగా పవర్ పాయింటు ప్రజంటేషన్ ద్వారా వివరించడం జరిగింది.ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు గల సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా అదనపు డి.సి.పి (అడ్మిన్ ) కోటేశ్వర రావ్, అదనపు డి.సి.పి ( ఎ.ఆర్ ) శంకర్ నాయక్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, స్పెషల్ బ్రాంచ్, ఎ.ఆర్, ట్రాఫిక్, సి.సి.ఆర్.బి ఎ.సి.పిలు రాజావెంకట్‌రెడ్డి, బస్వారెడ్డి , శ్రీనివాస్, శ్రీనివాస్ రావు, నాగయ్య, నారాయణ, రవీంధర్ రెడ్డి సి.ఐలు ఇతర అధికారులు పాల్గొన్నారు.