తెర‌వెనుక ‘రంగులు’

'Colors' behind the scenesసినిమా చూస్తున్నంతసేపూ ఓ రంగుల ప్రపంచం కనపడుతుంది. అన్యాయాలపై, అక్రమాలపై, దౌర్జన్యాలపై తిరగబడటం, నాయకుడు విజయం సాధించడం చూస్తుంటే ఆనందం కలుగుతుంది. అందులో కథ, బాధితులవైపు నిలబడుతుంది. హీరో బాధితులకు న్యాయం జరిగేట్టు పోరాడుతాడు. చాలా వరకు సినిమా న్యాయం వైపే ఉంటుంది. కానీ అది సినిమానే. సినిమా అల్లిక కథ, అందులోదంతా నటన. నిజ జీవితంలో వేరుగా ఉంటుంది. సినిమా హీరో లంతా బయట మాత్రం అంత నిజాయితీగా ఏమీ ఉండరు. ఈ విషయాలను ఎప్పుడో మన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ తన ‘పాకుడు రాళ్లు’ నవలలో చాలా వివరంగా రాశారు. ఇప్పుడు ప్రత్యక్షంగానే చూస్తున్నాము. అన్న దాతలను ఉన్నతంగా చూపించే సినిమాలు అందులోని హీరో హీరోయిన్లు బయట, వారిని హేళన చేస్తారు. స్త్రీల పట్ల గౌరవంగా నటించే నటులు అత్యంత అభ్యంతరంగా స్త్రీల గురించి మాట్లాడతారు. కులము, మతము, ప్రాంతము, రాజకీయము, అసూయ, ద్వేషాలు అన్నీ ఈ రంగుల తెరలకింద మనం చూస్తాము.
అందుకు ఓ ఉదాహరణ, జానీ మాస్టరుగా చెప్పబడుతున్న కొరియో గ్రాఫర్‌ వ్యవహారం. నృత్యం అంటే మనకెంతో ఆనందం వేస్తుంది.అదొక గొప్పకళ. అది ఒకప్పుడు. ఇప్పుడు బజారులో అమ్మబడు తోన్న నైపుణ్యం మాత్రమే. సినిమా అంటే యువతలో ఎప్పటికీ ఎంతో క్రేజ్‌ ఉంటుంది. సినిమాలో పనిచేయటం అనేది ఒక జీవిత లక్ష్యంగా పని చేస్తున్న వాళ్లూ, వెంపర్లాడుతున్న వాళ్లూ అనేకం.అందులో ముఖ్యంగా ఆడపిల్లలు ఈ సినీ జగత్తులోకి రావటానికి ప్రయత్నం చేస్తే ఎదురయ్యే సమస్యలు ఎన్నో ఉంటాయి. అనేక అనుభవాలూ మనముందున్నాయి. కొన్నయితే భయంకర మైనవిగా కనపడతాయి. ఆడపిల్లలపై వివక్ష ఏరంగంలోనైనా సాగుతున్నదే.
జానీ మాస్టారు, తనతో పనిచేస్తున్న ఒక మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగికంగా దాడి చేశాడని, ఓ నలభై పేజీల ఫిర్యాదు, ఆ మహిళే పోలీసు స్టేషన్‌లో ఇచ్చింది. క్విడ్‌ ప్రోకో ఒప్పందాలు ఇప్పటివేం కాదు. క్యాస్టింగ్‌ కౌచ్‌పై మీటూ ఉద్యమాలు చాలా రోజులుగా జరుగుతున్నాయి. ఆ మహిళా కొరియో గ్రాఫర్‌ ఫిర్యాదు ఆధా రంగా జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె మైనర్‌గా ఉన్నప్పుడే లైంగిక దాడి జరిగినందున ఫోక్సో కేసు పెట్టారు. కోర్టు రిమాండుకు పంపింది. అవకాశాలు ఇవ్వాలంటే, తాము చెప్పినట్లు వినాలని అనేక మంది సినీ పురుష పుంగవులు వేధించడం దారుణం. లైంగిక వేధింపులకు దిగడం సహించ రానిది. చట్టప్రకారం విచారణ చేసి చర్యలు తీసుకోవాలనే అందరూ కోరుతున్నారు. ఎప్పుడో 2020లో జరిగిన సంఘటనను ఇప్పుడు ఆ మహిళ చెప్పడానికి కారణ మేమిటనీ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. తనను మతం మార్చుకోమని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసి నట్టూ ఆమె చెపుతున్నది. కచ్చితంగా విచారణ చేయాలి. దోషిని శిక్షించాలి. కానీ సందులో సడేమియాలా అది లవ్‌జీహాద్‌ అని, మతపరమైన అంశంగా మార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇదే సందర్భంలో పూనమ్‌కౌర్‌ అనే ఉత్తరాది హీరోయిన్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డా డని నేనెప్పుడో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశానని, కానీ ఏ చర్యలూ తీసుకోలేదని ఆరోపించారు. డబ్బు, రాజకీయ ప్రాబ ల్యాలు కూడా ఇలాంటి వాటిలో ప్రధానపాత్ర పోషిస్తున్నాయి.
కేరళలో తమ సినిమా ఫీల్డులో మహిళల రక్షణ, దాడులకు సంబంధి ంచిన వివరాలు సేకరించడానికి హేమకమిటీని వేసి, అన్నింటినీ బయటపెట్టింది. చర్యలకూ ఉపక్రమించింది. అలాంటి ప్రయత్నం మన తెలుగు, తమిళ, హిందీ సినిమా రంగంలోనూ జరగాలి. అప్పుడే వేధిం పులకు గురవుతున్న మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్ప గలుగు తారు. అయితే టాలీవుడ్‌లో ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి, మహిళల రక్షణకు సరైన గైడ్‌లైన్స్‌ ఏవీలేవని, ఇది అన్‌ ఆర్గనైజ్‌డ్‌ సెక్టార్‌గా ఉందని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు. జానీ మాస్టర్‌ కేసుకు సంబంధించి, ఎన్ని భిన్న వాదనలు వినిపిస్తున్నా గానీ తెలుగు సినిమా రంగంలో కొనసాగు తున్న ఈ మురికి, అనైతిక, నేరపూరిత విషయాలపై సమగ్ర దర్వాప్తు జరపవలసే ఉన్నది. కనపడ్డంత రంగుల ప్రపంచం కాదని, వివక్షతలు, దాడులు అన్నీ ఇందులో ఉన్నా యనేది గుర్తించి అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం తగిన చర్యలూ తీసుకోవాలి.