పంత్‌, గిల్‌ శతక మోత

Pant, Gill century– సెంచరీలతో కదం తొక్కిన యువ బ్యాటర్లు
– భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 287/4 డిక్లేర్డ్‌
– బంగ్లాదేశ్‌ లక్ష్యం 515, ప్రస్తుతం 158/4
యువ బ్యాటర్లు రిషబ్‌ పంత్‌ (109), శుభ్‌మన్‌ గిల్‌ (119) చెపాక్‌లో సెంచరీ మోత మోగించారు. పంత్‌, గిల్‌ శతకాలతో చెలరేగటంతో తొలి టెస్టులో టీమ్‌ ఇండియా పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు పిండుకున్న రోహిత్‌సేన.. బంగ్లాదేశ్‌కు 515 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
టెస్టులో పునరాగమనాన్ని రిషబ్‌ పంత్‌ ఘనంగా చాటాడు. 634 రోజుల తర్వాత టెస్టు క్రికెట్‌ ఆడుతున్న రిషబ్‌ పంత్‌.. రీ ఎంట్రీలోనే సెంచరీతో చెలరేగాడు. తనదైన ట్రేడ్‌మార్క్‌ షాట్లతో విజంభించిన పంత్‌.. విలక్షణ షాట్లతో బంగ్లాదేశ్‌ బౌలర్లపై శివతాండవం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా నిష్క్రమించిన గిల్‌ ఈసారి మూడంకెల స్కోరు అందుకున్నాడు.
515 పరుగుల భారీ ఛేదనలో బంగ్లాదేశ్‌ ఎదురీదుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టాప్‌ ఆర్డర్‌లో నాలుగు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ 158 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌ విజయానికి మరో 357 పరుగులు అవసరం కాగా.. భారత్‌ విక్టరీకి మరో ఆరు వికెట్ల దూరంలో నిలిచింది. భారత్‌, బంగ్లాదేశ్‌ తొలి టెస్టులో నేడు నాల్గో రోజు ఆట.
నవతెలంగాణ-చెన్నై
చెపాక్‌ టెస్టులో టీమ్‌ ఇండియా విజయానికి చేరువైంది!. బ్యాట్‌తో, బంతితో తిరుగులేని ప్రదర్శన కనబరుస్తున్న భారత్‌ నాల్గో రోజే గెలుపు గీత దాటేందుకు సిద్ధమవుతోంది. యువ బ్యాటర్లు శుభ్‌మన్‌ గిల్‌ (119 నాటౌట్‌, 176 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), రిషబ్‌ పంత్‌ (109, 128 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతక మోగించారు. దీంతో బంగ్లాదేశ్‌ ముంగిట 515 పరుగుల కొండంత లక్ష్యం నిలిచింది. మరో రెండున్నర రోజుల ఆట మిగిలి ఉండగా ఛేదన షురూ చేసిన బంగ్లాదేశ్‌ అశ్విన్‌ స్పిన్‌ మాయకు అప్పుడే నాలుగు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ నజ్ముల్‌ హొసేన్‌ శాంటో (51 నాటౌట్‌, 60 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో బంగ్లాదేశ్‌ పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ ఛేదనలో 37.2 ఓవర్లలో 158/4 పరుగులు చేసింది.
అశ్విన్‌ మాయ
515 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ దూకుడు చూపించింది. ఓపెనర్లు జాకిర్‌ హసన్‌ (33), షాద్‌మ్యాన్‌ ఇస్లామ్‌ (35)లు తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించారు. పిచ్‌ నుంచి సహకారం లేకపోయినా పేస్‌ దళపతి బుమ్రా తొలి బ్రేక్‌ అందించాడు. జాకిర్‌ హసన్‌ను సాగనంపి వికెట్ల వేటకు తెరతీశాడు. ఆ తర్వాత ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ మాయజాలం చూపించాడు. ఓ ఎండ్‌లో నజ్ముల్‌ శాంటో (51 నాటౌట్‌) పేస్‌, స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అజేయ అర్థ సెంచరీతో కెప్టెన్‌ ముందుండి నడిపించాడు. కానీ మరో ఎండ్‌లో అశ్విన్‌ మాయ చేశాడు. ఇస్లామ్‌, మోమినుల్‌ హాక్‌ (13) సహా ముష్ఫీకర్‌ రహీమ్‌ (13)లను అశ్విన్‌ అవుట్‌ చేశాడు. శాంటో, షకిబ్‌ (5 నాటౌట్‌) అజేయంగా క్రీజులో నిలిచారు. భారత్‌ విజయానికి మరో ఆరు వికెట్ల దూరంలో నిలువగా.. బంగ్లాదేశ్‌కు మరో 357 పరుగులు అవసరం. బ్యాటర్లలో లిటన్‌ దాస్‌, మెహిది హసన్‌ మిరాజ్‌ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది.
ఆ ఇద్దరు శతక్కొట్టారు
ఓవర్‌నైట్‌ స్కోరు 81/3తో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌.. యువ బ్యాటర్లు శుభ్‌మన్‌ గిల్‌ (119 నాటౌట్‌), రిషబ్‌ పంత్‌ (109) శతకాలతో వేగంగా పరుగులు పిండుకుంది. ఓ ఎండ్‌లో పంత్‌ ధనాధన్‌ దంచికొట్టగా.. మరో ఎండ్‌లో గిల్‌ సమయోచిత ఇన్నింగ్స్‌ నమోదు చేశాడు. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 88 బంతుల్లోనే పంత్‌ అర్థ సెంచరీ సాధించాడు. 124 బంతుల్లో సెంచరీ బాదిన పంత్‌.. రీ ఎంట్రీని ఘనంగా చాటాడు. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో అర్థ సెంచరీ అందుకున్న గిల్‌.. 161 బంతుల్లో శతకం సాధించాడు. స్పిన్నర్లు, పేసర్లపై పంత్‌ విలక్షణ షాట్లతో అలరించగా.. గిల్‌ ఆఖరు వరకు అజేయంగా నిలిచాడు. కెఎల్‌ రాహుల్‌ (22 నాటౌట్‌) నాలుగు ఫోర్లతో మెరిశాడు. 64 ఓవర్లలో 4 వికెట్లకు 287 పరుగులు చేసిన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌ను 514 పరుగుల ఆధిక్యంతో డిక్లరేషన్‌ ప్రకటించింది.
స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 376/10
బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ : 149/10
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : యశస్వి (సి) లిటన్‌ (బి) రానా 10, రోహిత్‌ (సి) జాకిర్‌ (బి) టస్కిన్‌ 5, గిల్‌ నాటౌట్‌ 119, కోహ్లి (ఎల్బీ) మిరాజ్‌ 17, పంత్‌ (సి,బి) మిరాజ్‌ 109, రాహుల్‌ నాటౌట్‌ 22, ఎక్స్‌ట్రాలు : 5, మొత్తం : (64 ఓవర్లలో 4 వికెట్లకు) 287 డిక్లేర్డ్‌.
వికెట్ల పతనం : 1-15, 2-28, 3-67, 4-234.
బౌలింగ్‌ : టస్కిన్‌ అహ్మద్‌ 7-1-22-1, హసన్‌ మహ్మద్‌ 11-1-43-0, నహిద్‌ రానా 6-0-21-1, షకిబ్‌ 13-0-79-0, మిరాజ్‌ 25-3-103-2, మోమినుల్‌ 2-0-15-0.
బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌ : జాకిర్‌ (సి) యశస్వి (బి) బుమ్రా 33, ఇస్లామ్‌ (సి) గిల్‌ (బి) అశ్విన్‌ 35, నజ్ముల్‌ శాంటో నాటౌట్‌ 51, మోమినుల్‌ (సి) రాహుల్‌ (బి) 13, ముఫ్ఫీకర్‌ రహీమ్‌ (సి) రాహుల్‌ (బి) అశ్విన్‌ 13, షకిబ్‌ నాటౌట్‌ 5, ఎక్స్‌ట్రాలు : 8, మొత్తం : (37.2 ఓవర్లలో 4 వికెట్లకు) 158.
వికెట్ల పతనం : 1-62, 2-86, 3-124, 4-146.
బౌలింగ్‌ : బుమ్రా 7-2-18-1, సిరాజ్‌ 3.2-1-20-0, ఆకాశ్‌ 6-0-20-0, అశ్విన్‌ 15-0-63-3, జడేజా 6-0-29-0.