నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం నగరంలోని ఓ ప్రయివేటు కళాశాలకు చెందిన విద్యార్థి ప్రమాదవశాత్తు కళాశాల భవనంపై నుంచి పడి మృతిచెందాడు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి గ్రామానికి చెందిన మట్టప్పల్లి లోకేష్ (16) ఖమ్మంలోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతున్నాడు. ఆదివారం రాత్రి నిద్రలేచి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కళాశాల భవనం మూడు అంతస్తు నుంచి కింద పడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు ఆ విద్యార్థిని ఖమ్మంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం మృతిచెందాడు. లోకేష్ మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ కళాశాల ఎదుట లోకేష్ బంధువులు ఆందోళన నిర్వహించారు.