బీసీ కులగణనకు కార్యాచరణ రూపొందించండి

– బీసీ కమిషన్‌కు సీఎం ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీసీ కులగణనకు కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో బీసీ కులగణనకు అనుసరించాల్సిన విధి, విధానాలపై సీఎంతో పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్‌, బీసీ కమిషన్‌ చైర్మెన్‌ జి.నిరంజన్‌, సభ్యులతో చర్చించారు. బీసీ కులగణన ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. కులగణన ప్రక్రియకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. బీసీ కులగణన వెంటనే ప్రారంభించి, వేగంగా ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.