ఇండస్ట్రీ 4.0 విభాగంలో.. నామ్‌టెక్ విద్యార్థులకు ‘వరల్డ్ స్కిల్స్’ పోటీలలో కాంస్య పతకం


నవతెలంగాణ హైదరాబాద్:  ప్రతిష్టాత్మక ‘వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ 2024’లో ఇండస్ట్రీ 4.0 విభాగంలో నామ్‌టెక్ (న్యూ ఏజ్ మేకర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) విద్యార్థులు కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఫస్ట్ బ్యాచ్‌కు చెందిన మెకానికల్ ఇంజనీర్లు సత్యజిత్ బాలకృష్ణన్, ధ్రుమిల్‌కుమార్ ధీరేంద్రకుమార్ గాంధీ ఈ ఘనత సాధించారు. ఈ పోటీలు ఫ్రాన్స్‌లోని‌ లియన్లో సెప్టెంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు జరిగాయి. వరల్డ్ స్కిల్స్ పోటీలను ‘ఒలింపిక్స్ ఆఫ్ స్కిల్స్’ అని పిలుస్తారు. ఈ పోటీలు రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నారు. యువకులు తమ ఆశయాలు సాధించేలా ప్రేరేపించడం, అభిరుచిని వృత్తిగా మార్చుకోవడంలో సహాయం చేస్తుంది. ఈ ఏడాది జరిగిన పోటీలలో 89 దేశాలకు చెందిన యువ నిపుణులు ఐదు రోజుల పాటు వివిధ విభాగాల్లో పోటీ పడ్డారు.
స్కిల్ ఇండియా మిషన్ వంటి కార్యక్రమాల ద్వారా భారతదేశాన్ని ప్రపంచానికి నైపుణ్య రాజధానిగా మార్చాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆశయాన్ని బలోపేతం చేస్తూ.. 4 కాంస్య పతకాలతో మొత్తంగా 12 పతకాలతో భారతదేశం 13వ స్థానంలో నిలిచింది. నామ్‌టెక్ తొలి ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ మాస్టర్స్ ప్రోగ్రామ్ (ఐపీఎంపీ 2024) కోహోర్ట్ నుంచి బాలకృష్ణన్, గాంధీ ఇద్దరూ వరల్డ్ స్కిల్స్ జాతీయ అధ్యాయమైన ఇండియా స్కిల్స్ పోటీలో ఛాంపియన్‌లుగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. మాన్యుఫ్యాక్చరింగ్ ఎగ్జిక్యూషన్ సిస్టమ్స్ (ఎంఈఎస్), ఆటోమేషన్ (సిమ్యులేషన్, డిజిటల్ ట్విన్), కనెక్టివిటీ (క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఐఐఓటీ), నైపుణ్యాలను పరీక్షించే ఇండస్ట్రీ 4.0 విభాగంలో గ్లోబల్ స్టేజ్‌లో భారతదేశం మొట్టమొదటి పోడియం ముగింపును సాధించింది. మేధస్సు (డేటా అనలిటిక్స్, విజువలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్). ప్రపంచంలో అభివృద్ధి చెందడానికి ఈ నైపుణ్యాలు అవసరం.
కేరళలోని త్రిసూర్‌కు చెందిన బాలకృష్ణన్ (24) మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసి డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్‌లో స్పెషలైజేషన్‌తో నామ్‌టెక్‌లో చేరారు. ఆయన స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ మాస్టర్స్ ప్రోగ్రామ్‌ను అభ్యసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ‌ జర్నీ ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. గుజరాత్‌లోని వడోదరలోని శంకరదాకు చెందిన గాంధీ (23) మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చదివిన తర్వాత అదే ప్రోగ్రామ్‌లో చేరారు. వరల్డ్ స్కిల్స్‌లో భారతదేశం తరుపున నామ్‌టెక్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లియోన్‌లో గెలుపొందడం ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా నామ్‌టెక్‌ డైరెక్టర్ జనరల్ అరుణ్‌కుమార్ పిళ్లై మాట్లాడుతూ ఇండస్ట్రీ 4.0లో సమగ్ర ఒక సంవత్సర పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ అందిస్తున్న సంస్థలలో ఒకటన్నారు. విద్యార్థులు సాధించిన ఈ విజయం నామ్‌టెక్ వినూత్న బోధనా విధానాన్ని హైలైట్ చేస్తుందన్నారు. మా అధ్యాపకుల అసాధారణ ప్రతిభకు ఇది గొప్ప విజయం అన్నారు. మా అనుభవపూర్వక అభ్యాస నమూనా ద్వారా స్వతంత్రంగా ఏదైనా పరిష్కరిస్తారని తెలిపారు. సిస్టమ్‌లు, భాగాలపై పట్టు సాధిస్తారన్నారు. మా ప్రోగ్రామ్‌లు గ్రాడ్యుయేట్‌లను ఇండస్ట్రీలో డిజిటల్, సుస్థిరత కార్యక్రమాలకు సహకరించడానికి సిద్ధంగా ఉన్న ప్రపంచ స్థాయి నిపుణులుగా మారుస్తాయని తెలిపారు. స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో సీనియర్ లెక్చరర్ దిశాంక్ ఉపాధ్యాయ వీరికి శిక్షణ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారన్నారు.