నిజాంకు మోడీకి పోలికలున్నాయా?

Does Nizam have similarities with Modi?సెప్టెంబర్‌ నెల రాగానే తెలంగాణలో విమోచన దినమని కొందరు, విలీన దినమని మరి కొందరు చర్చలు ప్రారంభిస్తారు. వాటిని కాదని ప్రస్తుత కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 17ను ప్రజాపాలనా దినమని ప్రకటించింది. అవన్నీ సరేగానీ, ప్రస్తుత భారత ప్రధాని మోడీకి, ఒకప్పుడు తెలం గాణ రాజ్యాన్ని పాలించిన నిజాం రాజుకు ఏవైనా దగ్గరి పోలికలు ఉన్నాయా – అని మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. నిశితంగా గమనిస్తే చాలా ఉన్నాయి. మోడీ ప్రభుత్వపు నేటి తీరుతెన్నులు ఇప్పుడు దేశ ప్రజలందరికీ తెలుసు. కానీ, నాటి హైదరాబాద్‌ పాలకుడి పరిపాలనా విధానాలు నేటితరం వారికి అంతగా తెలియకపోవచ్చు.అందువల్ల ఆ విషయాలు ఒకసారి సమీక్షించుకుందాం. పరమత ద్వేషం- ప్రజల్ని పీడించడం- ప్రయివేటు సేవలకు అధికారాలివ్వడం- స్వయాన విద్యా విహీనులు కావడం-వంటి అనేక అంశాల్లో నిజాం రాజుకు, ప్రధాని మోడీకి పోలికలున్నాయి. ఆనాడు నిజాం ప్రభుత్వం రజాకార్లకు అధికారమిస్తే, ఈనాడు మోడీ ప్రభుత్వం గో సంరక్షకులకు, జై శ్రీరామ్‌ సేనకు, సనాతన వాదులకు అధికార మిచ్చింది. ఆనాడు రజాకార్లు మహిళలతో నగంగా బతుకమ్మ లాడిస్తే, ఈనాడు మోడీ భక్తులు మణిపూర్‌ లో మహిళల్ని నగంగా ఊరేగించారు.నిజాం-మోడీ ఇద్దరూ నిరంకుశ పాలకులే! వీరిద్దరిదీ ప్రజావ్యతిరేక విధానాలే! సాయుధ పోరాటంలో తెలంగాణ ప్రజలు నిజాం అధికారాన్ని మట్టి కరిపిం చారు. ఈ దేశప్రజలు తమ పోరాటాలతో మోడీ ప్రభుత్వ విధానాలను తిప్పి కొడుతున్నారు. దేశ వ్యాప్తంగా వెలసిన షహీన్‌బాగ్‌లు, రైతుల నిరసనలు తక్కువేమీ కాదు. హైద్రాబాద్‌ నిజాంది గత చరిత్ర అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న ఆరెస్సెస్‌ ప్రచారక్‌ మోడీది – నడుస్తున్న చరిత్ర. మోడీ పాలన అమోఘంగా సాగుతోంది.అనే ఒకవర్గం ఉన్నట్టే-అధ్వాన్నంగా ఉందని అసహ్యించుకునే వారే అధికం! నిజాం మంచోడు, సెక్యులర్‌ అన్నది కొద్దిమందయితే, ఏపాటి సెక్యులర్‌? అని ప్రశ్నించే ప్రజలే అధికం!
నిజాం రాజు అంత మంచోడే అయితే, గిరిజన నాయకుడు కొమురం భీం ఎందుకు ఆయన మీద తిరగబడ్డాడు? ఎందుకు పోరాడాడు? మనం ఆలోచించాలి. నిజాం గొప్పోడే అయితే నిజాం రజా కార్లపై- షోయబుల్లాఖాన్‌ ఎందుకు అక్షరాయు ధాలు సంధించాడు? ఎందుకు హత్య చేయబడ్డాడు? రచయితల్ని, హేతువాదుల్ని హత్య చేయించడంలో మోడీ ఏమీ వెనకబడలేదు. నిజాం మంచోడే అయితే మరి చిట్యాల ఐలమ్మ ఎందుకు నవాబు పాలన మీద తిరగబడింది? కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ వాళ్లూ ఎందుకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు? ‘మా నిజాము రాజు తరతరాల బూజు’ అని మహా కవి దాశరథి ఎందుకు ఎద్దేవా చేశాడూ? స్వయంగా తుపాకిపట్టి ఎందుకు పోరాడాడు? గోల్కొండ ఖిల్లా కింద గోరి కడతామని యాదగిరి ఎందుకు పాటెత్తుకున్నాడు? ఆ బీద్‌ రోడ్డులో నారాయణ్‌రావు పవార్‌ ఎందుకు నిజాం కారుమీద బాంబు విసిరాడూ? నిజాం మంచోడు, గొప్పోడు- అని అన్నవాడికి మెదడు సరిగా పనిచేసి ఉండదు. ఇన్నేండ్ల తర్వాత వీరనారి ఐలమ్మ పోరాటానికి గుర్తింపు లభించింది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాగ్రెస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు మార్చింది. నిజాం రాజు నిజాయితీ గురించి ఒక విష యం చెప్పుకోవాలి. ఆయన మన ప్రధాని మోడీలాగా ఎం.ఎ. డిగ్రీ సృష్టించుకోలేదు. అయితే తనకూ దేవుడికి (అల్లాకు) సంబంధం ఉందని- మోడీ లాగే ప్రకటించుకున్నాడు.
ఏడో నిజాం నవాబ్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ అధికారంలోకి రాగానే తన తండ్రి కాలం నుండి మంత్రి పదవిలో ఉన్న కిషన్‌ పర్‌షాద్‌ను తొలగించాడు. ఒక హిందువుకు అత్యున్నత పదవిలో ఉండే అర్హత లేదనే కదా? పరమత సహనం నిజాంకు మోడీకి ఒకేలా ఉన్నట్టుంది కదా? ఇంకా ”తూ కిషన్‌ పర్షాద్‌ హైతో-మై ఖుదా పర్షాద్‌ హూ” అని ఈసడించుకున్నాడు. నువ్వు కృష్ణుడి ప్రసాదమైతే, నేను ఖుదా (అల్లా) ప్రసాదాన్ని అని నిజాం చెప్పుకున్నాడు. నాన్‌ బయాలజికల్‌ ప్రధాని మాటలు ఇలాగే ఉన్నాయి కదా? పైగా హిందువుల గుర్తులపై, బొట్లపై నిజాం తన మతద్వేషాన్ని వెళ్లగక్కాడు. మోడీ తక్కువ వాడా? ‘వారు వేసుకున్న బట్టలతోనే మీరు వారిని గుర్తుపట్టొచ్చు’ అని ద్వేషాన్ని దేశవ్యాప్తం చేశారు. నిజాం దౌర్జన్యాలనన్నింటినీ ఆరోజుల్లో ‘రహబరే దక్కన్‌’ అనే ఉర్దూ పత్రిక ధైర్యంగా ప్రచురించింది. ఇక్కడి ప్రజలను ఊచకోత కోసేందుకు లాతూర్‌ నుండి ఒక పరమ కిరాతకుడైన ఖాసిం రజ్వి అనేవాణ్ణి పిలిపించి, నిజాం అతని అనధికార సైన్యమైనా రజాకార్లకు మితిమీరిన స్వేచ్ఛనిచ్చాడు. అందుకే వారి దౌర్జాన్యాలు హీనాతి హీనంగా ఉండేవి. మోడీ హయాంలో జరిగిన, జరుగుతున్న గుజరాత్‌, మణిపూర్‌ మారణకాండలు, దళితులపై దాడులు. అన్యమతస్తుల ఇండ్లపై చేస్తున్న బుల్‌డోజర్‌ దాడులూ, కూల్చి వేతలూ నాటి రజాకార్ల ఆగడాల్ని తలపిస్తున్నాయి. అలాగే రైతుల్ని పీడించడంలో నిజాంకు మోడీకి దగ్గరి పోలికలున్నాయి. ఆనాడు నిజాం విధించే పన్ను (శిస్తు) ఎన్ని రెట్లు అధికంగా ఉండేదంటే-రైతుల రాబడిని మించి ఉండేది. ప్రపంచ ధనికుల్లో ఒకడిగా నిజాం గుర్తింపబడ్డాడంటే కారణం ఇదే. అదంతా పేద రైతుల పొట్టకొట్టి సంపాయించిందే. అధికారికంగా ఇంకా బయటపడలేదు గానీ, మోడీ కూడా ప్రపంచ ధనికుల్లో ఒకడు. దేశ విదేశాల కాంట్రాక్టులన్నీ మోడీ అదానీకి ఇప్పించి, వచ్చిన లాభాలన్నీ తన ఖాతాలో వేసుకుంటున్నాడనీ, ఆ రకంగా అదానీ పేరు చెప్పి మోడీ ప్రపంచ ధనికుల్లో ఒకడవుతున్నాడన్న వాదన ఉంది. ఈ విషయం ఢిల్లీ అసెంబ్లీలో నాటి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తన ప్రసం గంలో వెల్లడించాడు. అది భరించలేకే ఆయన్ను తప్పుడు కేసులో ఇరికించి జైల్లో వేయించాడని విశ్లేషకులు చెప్పిన మాట.
నిజాం కనుసన్నల్లో – ఖాసిం రజ్వీ ఆధ్వర్యంలో – రజాకార్లు ఆనాటి పేద రైతుల నుండి పన్ను వసూలు చేసేవారు. పన్ను చెల్లించని రైతుల గోర్ల కింది మాంసం కత్తిరించి, గోర్లు ఊడబెరికే వారు. భర్తల సమక్షంలో భార్యల్ని అత్యాచారానికి గురిచేసేవారు. భార్యల కండ్లెదుట భర్తల్ని నరికి చంపేవారు. ఈ బాధలు పడలేక రైతులెవరైనా పారిపోతే వారి ఆచూకీ చెప్పమని కుటుంబ సభ్యుల్ని హింసంచేవారు. ఆచూకీ చెప్పలేకపోతే, ఇంట్లో ఉన్న పిల్లలను ఎగరేసి, కత్తిని గుచ్చి చంపేసేవారు. ఆ రోజుల్లో రజా కార్లను చూసిన వాళ్లు ఎవరూ బతికిన దాఖలాలు లేవు. రజాకార్లు గుర్రాల మీద ఊళ్లోంచి పోతూ ఉంటే ప్రజలు ఇండ్లలోకి వెళ్లి తలుపులేసుకునేవారు. తలుపు సందుల్లోంచి భయం భయంగా చూసే వారు. ఎవరైనా పొరపాటున రజాకార్ల దండుకు ఎదురుపడితే వారిని గుర్రాలకు కట్టి పాశవికంగా ఈడ్చుకెళ్లేవారు. చచ్చిన తర్వాతే వదిలేసి వెళ్లేవారు. ఇప్పుడు ఆలోచిస్తే అసలు వీళ్లు మనుషులేనా అని అనిపిస్తుంది. ఇలాంటి వారిని దేశం మీద వదిలేసిన నిజాం రాజు మనిషేనా అని అనుమానపడాల్సి వస్తుంది.రజాకార్ల దుర్మార్గాన్ని హైద్రాబాద్‌ సంస్థానం 13 సెప్టెంబర్‌ 1948 వరకు భరించక తప్ప లేదు. అప్పటికి భారత దేశానికి స్వాతంత్రం లభించింది. కానీ, హైద్రాబాద్‌ సంస్థానం మాత్రం కిరాతక నిజాం అఘాయిత్యాలకు గురవుతూనే వచ్చింది. భారత ప్రభుత్వానికి ఎవరైనా సహకరిస్తే, వారందరి ప్రాణాలు తీస్తామని రజాకార్లు ఇక్కడి ప్రజల్ని బెదిరించారు. ఆ సమయంలో సుమారు ముప్పయి రెండు వేల మంది స్థానికులు సికింద్రాబాద్‌ మిలట్రీ కంటోన్మెంట్‌లో తలదాచుకున్నారు.
రజాకార్ల అండదండలతో పరిపాలన వెలగబెట్టిన చివరి నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ స్వతంత్ర రా జ్యంగా ఉండిపోవాలని గట్టి ప్రయత్నమే చేశాడు. భారత యూనియన్‌ ప్రభుత్వం అందుకు ఒప్పు కోలేదు. అప్పుడు చివరి ప్రయత్నంగా పాకిస్థాన్‌లో భాగంగా ఉండడానికి ప్రయత్నించాడు. బంగ్లాదేశ్‌ ఏర్పడక ముందు అది తూర్పు పాకిస్థాన్‌-గా పాకిస్థాన్‌లో భాగంగా ఉండేది. దూరమైనా సరే, తన హైదరాబాదు సంస్థానం కూడా పాకిస్థాన్‌లో భాగం కావాలనుకున్నాడు. భారత యూనియన్‌ ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు. లొంగిపోవాలని ఒత్తిడి తెచ్చింది.కానీ అది సాధ్యం కాలేదు.17 సెప్టెంబర్‌ 1948న భారత ప్రభుత్వం, హైదరాబాదు నిజాం సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేసుకుంది.
చివరి నిజాం ఉస్మాన్‌ (ఉన్మాద్‌) అలీఖాన్‌ తన పాలనలో మెజారిటీ ప్రజల భాష అయిన తెలు గును నిషేధించాడు. తెలుగు పత్రికలు దొంగతనంగా చదువుకోవాల్సి వచ్చేది. ప్రజలు తమ పండుగలు, ఊరేగింపులు, సభలు-సమావేశాలు బహిరంగంగా జరుపుకునే వీలుండేది కాదు. నాటి కవులు, రచయి తలు, పాత్రికేయులు ఎన్నోకష్టాలు పడ్డారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేస్తున్నది కూడా అదే-కవుల్ని, రచయితల్ని చంపించడం లేదా జైల్లో వేయించడం, పాత్రికేయుల్ని మీడియా సంస్థల్ని కొని, తన గోదీ మీడియాను తయారు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఒక దేశం – ఒకే ఎన్నికలు – ఒకే భాష – ఒకే మతం లాంటి వాటికి మోడీ ప్రాముఖ్యమిచ్చి అభాసుపాలవుతున్నాడు కదా? నాటి నిజాం నియంతృత్వ పాలనను మత మార్పిడులను ప్రశ్నించిన భాషోద్యమకారుల్ని, పాత్రికేయుల్ని కమ్యూనిస్టు ఉద్యమ కారుల్ని, కాంగ్రెస్‌ కార్యకర్తల్ని నిజాం ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా హత్య చేయించేది. వట్టికోట అళ్వారు స్వామిని, దాశరధి కృష్ణమాచార్యను జైల్లో పెట్టింది ఆనాటి నిజాం ప్రభుత్వమే కదా? ప్రత్యక్షంగా తుపాకి పట్టుకుని నిజాంకు వ్యతిరేకంగా పోరుసల్పిన కవి యోధుడు దాశరథికున్న ఘన చరిత్ర ప్రపంచంలో మరో కవికి లేదు కదా? రక్తంతో తడిసిన నాటి హైదరాబాదు సంస్థానపు చరిత్ర పుటలు ఎన్నటికీ తడి తడిగానే ఉంటాయి. అలాగే ఇప్పటి మణిపూర్‌, గుజరాత్‌ మారణ కాండలు కూడా!
– సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్ర వేత్త (మెల్బోర్న్‌ నుంచి)

– డాక్టర్‌ దేవరాజు మహారాజు