తల్లిదండ్రులను అర్థం చేసుకోండి

Understand the parentsఈ లోకంలో నిస్వార్థమైనది తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే. తమ పిల్లల భవిష్యత్‌ బాగుండాలి అనే స్వార్థం మాత్రమే అందులో ఉంటుంది. మరి పిల్లలకు కూడా తల్లిదండ్రులపై అలాంటి ప్రేమ ఉండాలి కదా! అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ప్రేమ కేవలం వారు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. పెరిగే కొద్ది కొంత మంది పిల్లలకు తల్లిదండ్రులపై ప్రేమ, గౌరవం తగ్గిపోతున్నాయి. కానీ తల్లిదండ్రులు అలా ఉండలేరు. జీవితంలో చివరి దశలో ఉన్నా పిల్లలపై ప్రేమ మాత్రం తగ్గదు. తమని పట్టించుకోకపోయినా పిల్లలు జీవితాంతం సుఖంగా, సంతోషంగా ఉండాలని మనసరా కోరుకుంటారు. అలాంటి ఓ కథనమే ఈ వారం ఐద్వా అదాలత్‌లో మీ కోసం…
వృద్ధాప్యంలో ఉన్న భార్యాభర్తలు కలిసి ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చారు. భర్త రాఘవయ్యకు 70 ఏండ్లు, భార్య మంగమ్మకు 65 ఏండ్లు ఉంటాయి. ఈ వయసులో వీరికేంటి సమస్యా హాయిగా ఉండొచ్చు కదా అనుకుంటున్నారా! రాఘవయ్య, మంగమ్మకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అందరికీ పెండిండ్లు అయిపోయాయి. వారికి పిల్లలు కూడా ఉన్నారు. కూతురు వేరే దేశంలో ఉంటుంది. అప్పుడప్పుడు ఇండియాకి వచ్చిపోతుంటుంది. రాఘవయ్య పిల్లలను బాగా చదివించాడు. పెద్ద అబ్బాయి సుమిత్‌ ఎంబీఏ చేశాడు. ప్రస్తుతం జాబ్‌ చేసుకుంటూనే రాఘవయ్య నడిపే జనరల్‌ స్టోర్‌ కూడా అతనే తీసుకున్నాడు. రాఘవయ్యకు పెద్ద ఇల్లు ఉంది. మూడు అంతస్తుల భవనం. ముగ్గురు పిల్లలకు ఒక్కొక్కటి అని కట్టించాడు. చిన్న బాబు సృజన్‌ స్టాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. కొడుకులతో పాటుగా కోడళ్లు కూడా ఉద్యోగం చేస్తున్నారు. అంతా బాగానే ఉంది.
అయితే తల్లిదండ్రులు వాళ్లకు భారమయ్యారు. ఇప్పుడు వాళ్లకు ఎలాంటి ఆదాయం లేదు. ఉన్న షాపు పెద్ద కొడుకు తీసుకొని నడిపించుకుంటున్నాడు. దాంతో పాటు రెండు షటర్లకు వచ్చే అద్దె కూడా అతనే తీసుకుంటాడు. రాఘవయ్య చేతికి ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదు. షటర్లకు వచ్చే అద్దె ఇవ్వమన్నా ఇవ్వడు. కనీసం వాళ్ల అవసరాలైనా తీరుస్తున్నారా అంటే అదీ లేదు. ఇక చిన్న కొడుకు ఇల్లు మొత్తం తీసుకున్నాడు. దానిని కిరాయికి ఇచ్చి అద్దె వసూలు చేసుకుంటున్నాడు.
రాఘవయ్య, మంగమ్మ ఇద్దరూ కష్టపడి కట్టించుకున్న ఇల్లు అది. ఈ వయసులో సంతోషంగా ఉండేందుకు ఎంతో ఆశతో కట్టుకున్నారు. అలాంటి ఇల్లు ఇప్పుడు వారికి లేకుండా బయటకు పంపించేశారు. ఇదేంటి అంటే ‘పెద్దోడికి షాపులు ఇచ్చావు, నేను ఇల్లు తీసుకుంటాను’ అంటాడు చిన్నోడు. ఇక కూతురు ఎక్కడో విదేశాల్లో ఉంది. అన్నలతో మాట్లాడదామని ప్రయత్నిస్తే ‘ఇది మా కుటుంబ వ్యవహారం. ఇందులో నువ్వు జోక్యం చేసుకోవద్దు’ అన్నారు. ఆమె ‘ఇంట్లో నా వాటా ఉంది కదా! అది అమ్మానాన్నలకు ఇవ్వండి’ అంటే అది కూడా చేయడం లేదు. అందుకే కూతురు వారి ఖర్చుల కోసం నెలకు ఐదు వేలు పంపిస్తుంది.
‘ప్రస్తుతం మూడు వేలకు ఓ చిన్న గది అద్దెకు తీసుకొని ఈ వయసులో మేము వేరుగా ఉంటున్నాం. ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిని కొడుకులు మాకు దూరం చేశారు. నిలువ నీడ లేకుండా పోయింది. పోలీస్‌ స్టేషన్‌కు వెళితే ‘మేమేం చేయలేము, కోర్టులో కేసు వేసుకోండి’ అంటున్నారు. తెలిసిన వాళ్లు చెబితే మీ దగ్గరకు వచ్చాము. మీరైనా మాకు సహాయం చేయండి. ఆ ఇల్లు మొత్తం మాకు వద్దు. మేము ఉండేందుకు రెండు గదులు, షాపు కిరాయిలో సగం ఇస్తే మా ఖర్చులు మేము చూసుకుంటాం. నా కూతురు ఎలాగో ఇల్లు వద్దు అంటుంది. అది కూడా వాళ్లనే తీసుకోమనండి. మాకు మాత్రం బతికేందుకు కొంత ఇవ్వమని చెప్పండి. మేము సంపాదించిన దాని కోసం కూడా ఇప్పుడు మేము అడుక్కోవలసి వస్తుంది. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదు’ అంటూ ఆ వృద్ధ దంపతులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
మేము ఆ ఇద్దరు కొడుకులను పిలిపించి ‘మీ తల్లిదండ్రులు కష్టపడి సంపాదించుకున్న ఇంటిని వారికి కాకుండా చేశారు. వాళ్లు తలచుకుంటే మీ ఇద్దరి పైనా కేసు పెట్టి ఆయన సంపాదించిన ఆస్తి ఆయన తీసుకోవచ్చు. కానీ వాళ్లు అలా చేయడం లేదు. నా పిల్లల భవిష్యత్‌ బాగుండాలి, సుఖంగా, సంతోషంగా ఉండాలి, మేము సంపాదించి మొత్తం వారికే కదా! అని వాళ్లు ఆలోచిస్తున్నారు. అలాంటి వారిని ఈ వయసులో ఇబ్బంది పాలు చేస్తున్నారు. వాళ్లను పట్టించుకోకుండా రోడ్డున పడేశారు. వాళ్లేమి మొత్తం ఇల్లు వాళ్ల ఆధీనంలో ఉంచుకోవాలని అనుకోవడం లేదు. ఉండటానికి రెండు గదులు, బతకడానికి కొంత డబ్బు కోరుకుంటున్నారు. మిమ్మల్ని సంపాదించింది. ఏమీ ఇవ్వమనడం లేదు. ఇప్పటి నుండు ఒక పోర్షన్‌లో వాళ్లు ఉంటారు. మిగిలినవి మీరు అద్దెకు ఇచ్చుకోండి. షాపు కిరాయిల్లో సగం మీ నాన్న అకౌంట్లో వెయ్యండి. అలా కాదని వాళ్లను ఇబ్బంది పెడితే పరిస్థితి మరోలా ఉంటుంది. మేము కేసు పెడదాం అంటే మీపై ప్రేమతో వాళ్లు వద్దన్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోండి. ప్రేమగా చూసుకోండి’ అని చెప్పాము. ఇద్దరు కొడుకులు మేం చెప్పిన దానికి అంగీకరించారు. ఒక పోర్షన్‌ ఖాళీ చేయించి తల్లిదండ్రులకు ఇచ్చేందుకు అంగీకరించారు. అలాగే షాపు కిరాయిల్లో సగం వాళ్ల ఖర్చులకు ఇస్తామని చెప్పారు. రెండు నెలల తర్వాత రాఘవయ్య వచ్చి ‘మా ఇంట్లో మేము ఉంటున్నాం మేడమ్‌’ అంటూ సంతోషంగా చెప్పారు.
– వై వరలక్ష్మి, 9948794051