మంత్రి సహకారంతో శరవేగంగా అభివృద్ధి

Rapid development with ministerial support– 14 నెలల్లో  పనులు అన్ని పూర్తి 

– ఏ మున్సిపాలిటీకి రాని నిధులు నల్లగొండకు వచ్చాయి
– మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్లగొండ పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం మున్సిపల్ సమావేశ మందిరంలో సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాబోయే 14 నెలల్లో పూర్తి చేస్తామని  అన్నారు. పట్టణంలో 186 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నడుస్తున్నాయని, 55 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ బకాయిలను కూడా ఇటీవలే క్లియర్ చేశామని అన్నారు. అమృత్ పథకం కింద త్రాగునీటి ట్యాంకుల పనులు వేగవంతంగా నడుస్తున్నాయని వివరించారు. అభివృద్దె ధ్యేయంగా పనిచేస్తున్న మంత్రి సహకారంతో పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తామని అన్నారు. వివిధ పనుల నిమిత్తం 238 కోట్లకు ప్రతిపాదనలను పంపించామని త్వరలోనే వస్తాయని అన్నారు. మంత్రి సహకారంతో సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసామని, శివారు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. 21 కోట్లతో వరద కాలువలను నిర్మిస్తున్నామని, ఏ మున్సిపాలిటీకి లేని నిధులు నల్లగొండకు తీసుకువచ్చామని అన్నారు. నల్లగొండ పట్టణంలో కుక్కల నివారణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డులలో ఒకేసారి అభివృద్ధి పనులను ప్రారంభించాలని అందుకు కావలసిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, ఈఈ రాములు, పలువురు కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.