మ‌న‌మూ ర‌క్తదానం చేద్దాం!

Let's donate blood!‘నా దగ్గరేముంది ఇవ్వడానికి?’ అని మాత్రం అనకండి. మీలోనే ఓ అమతభాండం ఉంది. మీరు దానం చేసే ప్రతి రక్త బిందువూ ప్రాణాపాయంలో ఉన్నవారికి ఆత్మబంధువు. రక్తం అంగడి సరుకైతే తల తాకట్టు పెట్టయినా కొనుక్కోవచ్చు. తయారు చేయగలిగే అవకాశమే ఉంటే ఏ ల్యాబ్‌లోనైనా సష్టించుకోవచ్చు. ఏ హిమాలయాల్లోనో దొరుకుతుందని తెలిస్తే.. ఆశావాదంతో అన్వేషిస్తూ వెళ్లొచ్చు. అలా కుదరదే. ఎవరో ఒకరు రావాలి. చిరునవ్వుతో సూది గుచ్చుకుని స్వచ్ఛందంగా తీసివ్వాలి.

ఏదైనా పరిమితిని అధిగమించాలంటే, అదే సమస్యను ఎదుర్కొంటున్న ఓ పదిమందిని కూడగట్టాలి. సంఘంగా ఏర్పడాలి. కలిసి మాట్లాడుకోవాలి. బాధలు పంచుకోవాలి. పరిష్కారం వెతుక్కోవాలి. మన రక్తం మనల్ని బతికిస్తుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇతరుల జీవం నిలబెడుతుంది. రక్తం అమతభాండం లాంటిది. పంచుకున్నకొద్దీ పెరుగుతుంది. ప్రమాదాల్లోనో, ప్రసూతి సమయంలోనో, శస్త్ర చికిత్సల కారణంగానో ‘ఎవరికి రక్తం అవసరమైనా.. స్వచ్ఛందంగా అందిద్దాం. మన రక్తంలో మానవత్వం ప్రవహిస్తున్నదని నిరూపించుకుందాం అని బలంగా నమ్మిన డివైఎఫ్‌ఐ (భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య) ఖమ్మం జిల్లా కమిటీ తొలి అడుగుగా ‘భగత్‌ సింగ్‌ బ్లడ్‌ డోనార్స్‌ క్లబ్‌’ ని ఏర్పాటు చేసింది. ఇందు కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఎవరికి రక్తం అవసరమైనా ఇక్కడే అభ్యర్థన పెడతారు. అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రాంతాల వారూ ఉంటారు. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రంగారావుకు రక్తం కావాలంటూ తాజాగా ఓ పోస్టు కనిపించింది. భద్రాచలం చెందిన అనసూయ అభ్యర్థన కూడా ఆ జాబితాలో ఉంది. ఇలాంటి ప్రకటనలకు సభ్యుల్లోంచే ఎవరో ఒకరు స్పందిస్తారు. రక్తదానానికి ముందుకొస్తారు. ఎక్కడ అవసరమైతే అక్కడకు వెళ్తారు. రక్తదాతలకు ఓ వాట్సాప్‌ గ్రూపు కూడా ఉంది. ఆ వేదిక ద్వారానే సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటారు. రక్తదానంతో ప్రాణాలు నిలుపుకున్న ఆ ఇద్దరి కళ్లలోనూ ఆనందబాష్పాలు. ఇలా ‘వేల రక్తదానాలు అంటే.. వేల ప్రాణాలు.. వేల జీవితాలు’ నిలిపిన భగత్‌ సింగ్‌ బ్లడ్‌ డోనార్స్‌ క్లబ్‌ – ఖమ్మం పరిచయ కధనం ఈ వారం జోష్‌.
శరీరంలోని వివిధ అవయవాలకు ప్రాణవాయువును చేరవేసే వాహకం.. రక్తం. మనిషికి శ్వాస ఎంత ముఖ్యమో, రక్తమూ అంతే ప్రధానం. శ్వాస ద్వారా మనం తీసుకున్న ప్రాణవాయువును ప్రధాన అవయవాలైన.. గుండె, మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలతో పాటు అన్ని అంతర్గత భాగాలకూ అందిస్తుంది రక్తం. రోడ్డు ప్రమాదాలు, ఇతర సంఘటనలు జరిగినప్పుడు రోగి శరీరంలోని రక్తం ధారాపాతంగా బయటికి పోతుంది. ఫలితంగా ఒంట్లోని రక్తం తగ్గిపోతుంది. మెదడు, గుండె తదితరాలకు రక్త సరఫరా నిలిచిపోవడంతో.. ఆక్సిజన్‌ కూడా అందదు. వివిధ అవయవాలు పనిచేయడం మానేస్తాయి. ఈ పరిస్థితుల్లో రోగి మరణించే ఆస్కారమూ ఉంది. కాబట్టే ప్రమాదాల్లో తీవ్ర రక్తస్రావానికి గురైనవారికి తక్షణం రక్తం అవసరం. మహిళల విషయానికొస్తే.. చాలా మందికి కాన్పుల సమయంలో రక్తస్రావం జరుగుతుంది. అలాంటప్పుడు బయటి నుంచి రక్తం అవసరం అవుతుంది. గుండె, కాలేయం, కిడ్నీలు తదితర భాగాలకు శస్త్రచికిత్సలు జరిగినప్పుడు, ఇతర ఆపత్సమయాల్లోనూ రోగులకు రక్తం ఎక్కించాల్సిందే. ఆలస్యమైనకొద్దీ ప్రాణగండమే. అలాంటి విపత్కర పరిస్థితిలో ఖమ్మంలో అందరికీ గుర్తువచ్చేది భగత్‌ సింగ్‌ బ్లడ్‌ డోనార్స్‌ క్లబ్‌.
మానవుడు తరతరాలుగా అజ్ఞానంపై యుద్ధం చేస్తూ విజ్ఞానపు వెలుగు దారులను వేస్తున్నాడు. ప్రకతి వైపరీత్యాల నుండి రోగాలు, మూఢ నమ్మకాలు కమ్మిన చీకటి దారులను చీలుస్తూ ”సైన్స్‌ చూపిన వెలుగుబాటలో సంఘర్షిస్తూ జీవిస్తున్నాడు. ప్రకతి ప్రసాదించిన ఆకులు, పండ్లు, కాయలు, మూలికలు వైద్యానికి అందిన వరాలు. కాలం గడిచిన కొద్దీ ప్రయోగశాలలు, వైద్య రంగం ఎన్నో రుగ్మతలకు టీకాలు, మందులు అందించాయి.
వైద్య రంగంలో వచ్చిన మార్పుల్లో ‘అవయవదానం’ నేత్ర దానం, రక్త దానం, మానవ జాతికి సైన్స్‌ ఇచ్చిన బహుమానాలే. ‘తిండి కలిగితె కండ కలదోరు’ అన్నాడు గురజాడ. కానీ ఈ దేశంలో ఒక్క పూట తిండికే నోచుకోని అభాగ్య జీవులెందరో. తొణికిసలాడే చెరువులా శరీరం కూడా రక్తంతో నిండుగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. పేదల పాలిట పెనుశాపమై కూర్చుంది ఈ దేశ ప్రజల ‘రక్త హీనత’. ఎన్నో జబ్బులకు, మరణాలకు కారణం రక్త హీనత. రక్త హీనతకు కారణం పౌష్టికాహార లోపం. అసలు ఆహారమే దొరకని మనిషి పౌష్టికాహారం ఎలా తింటాడు. బుక్కెడు బువ్వకు మొగమాసే దేహాలు ఆరోగ్యంగా ఉండే అవకాశమే లేదు. ఉక్కు నరాలున్న యువతకు అవకాశమే లేదు.
ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశానికి, స్వరాజ్యం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలు గడుస్తున్నా రక్తహీనత సమస్యగానే వుంది. దీనికి కారణాలు వెతుకుతూనే ఎన్నో స్వచ్చంద సంస్థలు, వ్యక్తులు, యువజన సంఘాలు, రక్తదాన ప్రాధాన్యతను గుర్తించి, రక్తదానం చేస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. ఆ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఎ) ఈ రక్తదాన యజ్ఞాన్ని 9 సంవత్సరాలుగా కొనసాగిస్తూ ప్రజాసేవ చేస్తున్నది. యువతీ, యువకులు, వామపక్ష మేధావులు, సైన్స్‌ ఉద్యమ కార్యకర్తలు, డాక్టర్లు, మానవతావాదులు, అభ్యుదయవాదులు అందరూ డివైఎఫ్‌ ఐని అభినందిస్తూ సహకరిస్తున్నారు. కుల, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా, ఖమ్మం జిల్లాతో పాటు, హైద్రాబాద్‌, నల్గొండ, సూర్యాపేట, వరంగల్‌ తదితర జిల్లాలన్నింటికి రక్తదాన సేవ విస్తరింపజేసారు. నేటికి 3,700 రక్తదానాలు చేసి ఎందరి ప్రాణాలో కాపాడిన సంఘం డివైఎఫ్‌ఐ. 2017 మార్చి 23న భగత్‌ సింగ్‌ వర్థంతి సందర్భంగా ఆయన ఆశయాల వారసులుగా భగత్‌ సింగ్‌ బ్లడ్‌ డోనార్స్‌ క్లబ్‌ ఏర్పాటు చేసింది డివైఎఫ్‌ఐ. ”రక్తదాతలు కండి- ప్రాణదాతలు అవ్వండి” అనే నినాదాన్ని ఇచ్చింది.
ప్రారంభమైన మొదటి రోజే 150 మందికి బ్లడ్‌ టెస్ట్‌ చేసి గ్రూపుని ఏర్పాటుచేసి 50 మందితో రక్తదానం చేయించింది. భగత్‌ సింగ్‌, చేగువేరా, అంబేద్కర్‌, సుందరయ్య, స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ నాయకులు, శాస్త్రవేత్తలు, సంఘ సంస్కర్తలు లాంటి మహనీయుల జయంతి, వర్ధంతుల సందర్భాలలో బ్లడ్‌ టెస్టింగ్‌ శిబిరాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తుంది. 150 మందితో ప్రారంభమైన గ్రూపు నేటికి 1,500 మంది యువతీ, యువకులను చేర్చుకుంది. వారందరి యొక్క బ్లడ్‌ గ్రూప్స్‌, వారి వివరాలు అన్నింటిని నిత్యం పర్యవేక్షిస్తూ సంబంధాలు కొనసాగిస్తున్నది. వీరిలో దాదాపు 200 మంది మహిళలు ఉండటం విశేషం.
ప్రభుత్వ వైద్యశాలలు, ప్రయివేట్‌ వైద్యశాలల్లో ఎవరికి రక్తం అవసరమున్నా డివైఎఫ్‌ఐ కార్యాలయానికి కాల్‌ చేస్తే వెంటనే స్పందించి సహకరిస్తున్నది. బాధ్యతగా జిల్లా కమిటి సభ్యులు, బ్లడ్‌ డోనార్స్‌ క్లబ్‌ సభ్యులు నిత్యం ఆ సేవలో నిమగమై ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎక్కడ ప్రమాదాలకు గురైనవారున్నా, రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీలున్నా, తలసేమియా పిల్లలకు, ఇతర వ్యాధులతో రక్తం కొనుక్కోలేని పేదవారికి రక్తదానం చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా కాలంలో, మహమ్మారికి భయపడకుండా మొక్కవోని దీక్షతో వ్యాధిగ్రస్తులకు, ప్రజల దగ్గరకు వెళ్ళి రక్తదానం చేయడమే కాకుండా, వైద్య సేవలు, ఆహారం, నిత్యావసర వస్తువులు అందించి ప్రజల మన్ననలు పొందింది.
ఈ రక్తదానం కార్యక్రమం చేయడం చాలా శ్రమతో కూడుకున్నది. అందుకే దీనిని మూడు తంతుల పనిగా ఏర్పాటుచేసి బాధితులకు రక్తాన్ని అందజేస్తున్నారు. మొదటిది బ్లడ్‌ టెస్టింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేసి, గ్రూపును నిర్ధారించి ఆ నిర్ధారించిన వారితో గ్రూపు టెస్టింగ్‌ లిస్టులు తయారుచేయడం, వాటి ద్వారా సామాజిక మాధ్యమాలలో గ్రూపులు ఏర్పాటు చేయడం. రెండవది బ్లడ్‌ కావల్సిన వారు అడిగిన వెంటనే ఆ గ్రూపు వున్న వ్యక్తులకు సమాచారం అందించి ఇవ్వడానికి ముందుకు వస్తున్న దాతలను తీసుకొని రావడం. ఇక మూడవది బ్లడ్‌ బ్యాంకుకు తీసుకెళ్ళి అవసరమైన వారికి బ్లడ్‌ ఇప్పించడం. ఈ మొత్తం పనిలో డివైఎఫ్‌ఐ కార్యకర్తలతో పాటుగా దాతల సహకారం కూడా కీలకంగా ఉంటుంది.
భగత్‌ సింగ్‌ బ్లడ్‌ డోనార్స్‌ క్లబ్‌ కమిటీ
9 మంది సభ్యులతో నడుస్తుంది. కన్వీనర్‌ రావులపాటి నాగరాజు, కో-కన్వీనర్‌ కొంగరి నవీన్‌, ఎస్‌.కె. రోషన్‌ బేగ్‌, సత్తెనపల్లి నరేష్‌, గడ్డం విజరు, భట్టు రాజు, బొడ్డు మధు, జక్కంపూడి కష్ణ, ఎస్‌.కె. నాగూర్‌ పాషాలతో పాటుగా, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి మద్దాల ప్రభాకర్‌, షేక్‌ బషీరుద్దీన్‌, చింతల రమేష్‌, కూరపాటి శ్రీను, శీలం వీరబాబు, భూక్యా ఉపేందర్‌ నాయక్‌, పొన్నం మురళి, దిండు మంగపతి, కె. సుజాత, పఠాన్‌ రోషనీఖాన్‌, పదముత్తుం ఉష, గుమ్మా ముత్తారావు, దాసరి మహేందర్‌, షేక్‌ అఫ్టల్‌, కనపర్తి గిరి అందరూ అభినందనీయులు. ఎంతో మంది ప్రాణాలను నిలుపుతున్న భగత్‌ సింగ్‌ బ్లడ్‌ డోనార్స్‌ క్లబ్‌ ఆత్మీయు లందరికీ భగత్‌ సింగ్‌ 117వ జయంతి సందర్భంగా మానవతా జిందాబాద్‌ అంటూ అరుణారుణ వందనాలు.
– రౌతు రవి, ఖమ్మం.

సాధ్యమైనంత ఎక్కువమందికి బ్లడ్‌ అందిస్తున్నాం
ప్రతిరోజు కనీసం ఒక్కరికైనా బ్లడ్‌ ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాతో పాటుగా చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా రోజు ఫోన్స్‌ వస్తుంటాయి. అడిగిన ఎక్కువసార్లు బ్లడ్‌ ఇస్తున్నాం కొన్ని సందర్భాల్లో రేర్‌ గ్రూప్స్‌ అడిగినప్పుడు ప్రకతి వైపరీత్యాలు ఉన్నప్పుడు, సీజనల్‌ వ్యాధులు వచ్చినప్పుడు ఒకేసారి ఎక్కువమంది బ్లడ్‌ అడుగుతున్నారు , ఇటువంటి పరిస్థితుల్లో బ్లడ్‌ అందించ లేనప్పుడు చాలా బాధ కలుగుతుంది. కొన్నిసార్లు ఒకేరోజు 10 నుంచి 15 మంది కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి ఒకేరోజు ఒకే పేషెంట్‌కి 5 మంది ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. యాక్సిడెంట్స్‌ గర్భిణి స్త్రీలు, తలసేమియా బాధితులకు, రక్త అందించి వారి ప్రాణాలు కాపాడినప్పుడు మా శ్రమను మర్చిపోయి చాలా ఆనందిస్తున్నాం. ఇతర వ్యాధులతో బాధపడుతూ రక్తం కొనుక్కోలేని పేదవాళ్లకు రక్తం ఇచ్చినప్పుడు వారి కతజ్ఞతలు మా వైపు చూస్తున్నప్పుడు, సంఘాన్ని మమ్మల్ని పొగిడినప్పుడు మా బాధ్యతను మరింత గుర్తుచేస్తుందని భావిస్తున్నాను. ఇది ఏ ఒక్క వ్యక్తికి సాధ్యం కాని పని ఆశయ బలం, సమిష్టితత్వంగా కమిటీగా పని చేయడం వలన మాత్రమే సాధ్యమవుతుంది. సాటివారికి సహాయ పడగలను ఆలోచన ఉండడం చాలా గొప్ప విషయం అలాంటి యువత రక్త దానం చేయడానికి సిద్ధంగా ఉండటం వలనే ఈ భగత్‌ సింగ్‌ క్లబ్‌ నడిపించగలుగుతున్నాం. అలా రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చిన దాతలు అందరికీ ధన్యవాదాలు. మేము రక్తదానం చేసిన ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్న వేరొకరికి రక్తదానం చేయాలని మేము కోరుకుంటున్నాము. మా కృషి చిన్నదే కావచ్చు. కానీ మమ్మల్ని చూసి మరికొంతముందుకు వస్తే అది చాలా ఉపయోగకరంగా వుంటుంది. అందుకు అనుగుణంగా క్లబ్‌ను విస్తరిస్తే ప్రయత్నాలు చేస్తున్నాం.
– షేక్‌ బషీరుద్దీన్‌, డివైఎఫ్‌ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి
భగత్‌ సింగ్‌ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌ ప్రధాన బాధ్యులు

మా నిబద్ధతలను పెంచుతుంది
డివైఎఫ్‌ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భగత్‌ సింగ్‌ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌ నుంచి ఇప్పటివరకు 3701 మందికి అత్యవసర పరిస్థితుల్లో బెడ్‌ అవసరమైన వారికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నేను కూడా ఒక భాగస్వామి అయినందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అలాగే నా వ్యక్తిగతంగా 8సార్లు బ్లడ్‌ ఇవ్వడం జరిగింది
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి బ్లడ్‌ ఇచ్చి వారి పరిస్థితి మెరుగుపడిన అప్పుడు వారు భగత్‌ సింగ్‌ బ్లడ్‌ ఓనర్‌ కు కాల్‌ చేసి ప్రమాదం లేదు మీరు సహాయం చేసినందుకు మీకు రుణపడి ఉంటాము థాంక్యూ అని అన్నప్పుడు చేసే పని మీద ఇంకా గౌరవం మా నిబద్ధత పెరుగుతుంది.
– కొంగరి నవీన్‌, భగత్‌ సింగ్‌ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌ కో కన్వీనర్‌