70వ దశకంలో జరిగిన చిప్కో ఉద్యమం మొదలుకొని ప్రస్తుతం ముందుకొచ్చిన ”దామగుండం” రక్షణో ఉద్యమం వరకు ఎంతో మంది పర్యావరణవేత్తలు, పర్యావరణ ప్రమాదాన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. 300 చెట్లను కాపాడుకునేందుకు జరిగిన ”చిప్కో” ఈ యాభై ఏండ్లలో దేశంలో అనేక కీలకమైన సహజ వనరులు, పర్యావరణ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. చిప్కో ఉద్యమం ”గౌరాదేవి” అనే మహిళా నేతృత్వంతో ప్రారంభమై ”సుందర్ లాల్ బహుగుణ” నాయకత్వంలో విస్తృతపరచబడింది. అదే తరహాలో తెలంగాణలోని వికారాబాద్ జిల్లా ”దామగుండం” అటవీ ప్రాతంలో సుమారు మూడువేల ఎకరాల్లోని 12లక్షల పై చిలుకు చెట్లను రక్షించేందుకు ”జర్నలిస్టు తులసీచందు” ఒకడుగు ముందుకేసింది. స్పందించే సమూహాన్ని తట్టిలేపింది. ”జర్నలిస్టు తులసిచందు” చొరవతో ఇప్పుడు ”దామగుండం” రక్షణ కోసం చిప్కో తరహా ఉద్యమం అవసరమనే నినాదం ముందుకాచ్చింది. ఈ పిలుపులో సహజ వనరుల పరిరక్షణ కోసం తపించే శక్తులు వ్యక్తులు, ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ హితులు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజాసంఘాలు, కవులు, రచయితలు ప్రతిఒక్కరూ ”దామగుండం” రక్షణ మూమెంట్లో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి పేరుతో మానవ మనుగడకు ముప్పు తెచ్చేలా దామగుండం అడవిని విధ్వంసం చేయడం మనిషి ఆయుష్షుతో, ప్రకృతితో చెలగాటమాడటం కాక ఏమవుతుందని ప్రశ్నించాలి.
జీవ మనుగడకు ఈ భూమ్మీద అనుకూలమైన పర్యావరణం ఉండటం తప్పనిసరి. కానీ అభివృద్ధి పేరుతో పాలకుల కనుసన్నల్లో జరుగుతున్న విధ్వంసం వల్ల పర్యావరణం విపరీతమైన ఇబ్బందులకు గురవుతోంది. ముఖ్యంగా అడవులను విచక్షణారహితంగా నరికివేయడం, సహజ వనరుల విధ్వంసానికి పాల్పడటం ఫలితంగా అనేక పర్యావసానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ప్రకృతిని చూసే విధానం యుగయుగానికి మారవచ్చు, కానీ ప్రకృతి మారదంటారు ప్రసిద్ధ ప్రకృతి తత్వవేత్త మసనోబు. నిజంగా ప్రకృతి మారడం లేదా అనే ప్రశ్న రావడం సహజం. ప్రకృతి స్వభావంలో మార్పులేదు. కానీ అభివృద్ధి పేరిట ప్రకృతిని కొల్లగొట్టే విధానాలతో దాని సహజ గమనాన్ని అడ్డుకునే ప్రయత్నాలు శతాబ్దాలుగా జరుగుతూనే వున్నాయనేది కాదనలేని సత్యం! ఈ నేపథ్యంలోనే పర్యావరణ సమస్య తలెత్తుతోంది. ముందే చెప్పినట్లుగా మానవాళి ప్రశాంతంగా జీవించాలంటే ప్రకృతి, పర్యావరణం సజావుగా ఉండాలి. దీనికి విరుద్ధంగా సాగించే ప్రయాణం మానవ అస్తిత్వానికి పెనుసవాలే. సాంకేతికత, వృద్ధి పేరిట ప్రకృతి గుండెల్లో చిచ్చుపెట్టే ధోరణి అవాంఛనీయం. ఏమాత్రం క్షేమం కానిది. ప్రకృతి – పర్యావరణం – అభివృద్ధి మధ్య అనుసంధానాన్ని సాధించడానికి బదులుగా ఒకదానికొకటి పోటీగా నిలబెట్టడంలో దుర్మార్గంగా వ్యవహరించే ధోరణి పెరిగింది. సముద్రాల, నదుల, పర్వతాల, అడవుల ఉనికికి ముప్పుగా పరిణమించే విధానాలు అమలవుతున్నాయి.
ఫలితంగా పర్యవసానాలు రానున్న యాభయేండ్లలో ఊహించని విపత్కర పరిస్థితులు ముందుకొచ్చే ప్రమాదం ఉందని అనేక అధ్యయనాలు ఇప్పటికే తెలుపుతున్నాయని గమనించాలి. ఇలాంటి పరిస్థితులున్న నేపథ్యంలో అభివృద్ధి పేరుతో వేల ఎకరాల్లోని ”దామగుండం” అడవిలో సుమారు 12లక్షల పై చిలుకు చెట్లను తొలగించి ”రాడార్ ప్లాంట్” ఏర్పాటు చేయాలనే ఆలోచన సరైనది కాదు. అడవుల్ని అంటి పెట్టుకుని శతాబ్దాలుగా జీవిస్తున్న జనాన్ని వారి జీవన మనుగడను ప్రశ్నార్థకం చేయడమే అవుతుంది. గత రెండు మూడు దశాబ్దాలలో చోటుచేసుకున్న విపత్తులు నగరాల ఉనికినే చెల్లాచెదరు చేశాయనే వాస్తవాన్ని కూడా మరువొద్దు. ప్రకృతిని జయించడం పేరిట విధ్వంసానికి పాల్పడటం తను కూర్చున్న కొమ్మని తానే నరుక్కోవడం అవుతుందని గుర్తించాలి. ”దామగుండం” అడవిని ధ్వంసం చేస్తే హైదరాబాద్ నగరానికి ఎంతటి ముప్పు వాటిల్లనుందో ఇప్పటికే అనేక విశ్లేషణలు తేటతెల్లం చేశాయి. అందుకోసమే అడవుల సంరక్షణ అవసరాన్ని, ప్రకృతి – పర్యావరణాన్ని కాపాడుకునే అవసరాన్ని మనిషి గుర్తించాలి. ముఖ్యంగా పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. అడవుల నరికివేత, పర్యావరణ సమతుల్యత దెబ్బతీనే విధంగా చేపట్టే చర్యలు మానుకోవాలి.
చివరిగా…”చిప్కో” సత్యాగ్రహ ఉద్యమం ఆనాడే కాదు, ఇవాళ కూడా మనకు మన ప్రపంచానికి ఎంతో స్ఫూర్తిదాయకం.ఆ స్పూర్తి ప్రస్తుతం ”దామగుండం” రక్షణకోసం జరుగుతున్న ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. అటవీ సంపద, పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ, ప్రకృతితో మమేకమై జీవించడం మొదలైన ఎన్నో పాఠాలు మనకు చిప్కో ఉద్యమంతో పాటు ఆ స్పూర్తితో జరిగిన అనేక ఉద్యమాలు నేర్పిస్తు న్నాయి. శాంతియుతంగా గాంధేయ మార్గంలో చెట్లను కౌగిలించుకొని ఒక మహిళా నాయకత్వంతో చిప్కో ఉద్యమం మొదలైన విధంగా యాభై ఏండ్ల తరువాత అనివార్యంగా తెలంగాణలో ముందుకొచ్చిన దామగుండం అడవి రక్షణకోసం మహిళా అయినటువంటి ”జర్నలిస్టు తులసిచందు” వాయిస్‌తో ఉద్యమం మొదలైంది. ఈ ”సేవ్ దామగుండం” ఉద్యమం కూడా అనేక అనుభవాలు నేర్పుతూ చరిత్రలో నిలిచిపోక తప్పదు. ”చిప్కో” తరహాలో జరిగే శాంతియుత సత్యాగ్రహ ఉద్యమాన్ని బలపరుద్దాం..బాసటగా నిలుద్దాం..భాగస్వామ్యం అవుదాం…