అంతా హడావుడిగా ఉంది. భారీ టెంట్ వేస్తున్నారు. ఎయిర్ కండీషన్లు, మైకులు, పెద్ద కుర్చీలు, మొ|| ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఛోటా, మోటా నాయకులు వచ్చి సూచనలు, సలహాలు చెబుతూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు! ప్రస్తుత రాజకీయ నాయకుడు, గతంలో ఫిల్మ్ హీరో అయిన ‘కవర్’స్టార్ ఆ టెంట్‌లో దీక్ష చేయబోతున్నాడు! అందుకే ఏర్పాట్లు!
ఎట్టకేలకు టెంట్ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి! అంతా సిద్ధం! అభిమానుల కోలాహలం, కేరింతల మధ్య కవర్‌స్టార్ టెంట్‌లోకి వచ్చాడు. నుదిట వీర తిలకం, కాషాయ వస్త్రాలతో చూడము చ్చటగా ఉన్నాడు. మైకు తీసుకు న్నాడు.”వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ కల్తీ చేయటం ఎంతో అపవిత్రం! అసలు కల్తీ చేయటానికి వారికి మనసెలా వచ్చింది! ఇదేమైనా హోటల్‌లోపెట్టె బిర్యానియా? దేవదేవుడి ప్రసాదం! అంత మహోన్నతమైన ప్రసాదం కల్తీ అయినం దుకు నేను ఈ రోజు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాను! మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కూడా ఇంతకు ముందు ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ తప్పును ఇక్కడ చెప్పి, మీరు కూడా ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొని పాప పరిహారం చేసుకోండి” అన్నాడు.
సూటు, బూటూ వేసుకున్న ఒక పెద్దమనిషి వచ్చాడు. ”అయ్యా నేను డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌ను నా ఇలాకాలో ఎన్నో ప్రాణావసర మందులు కూడా కల్తీ చేస్తున్నారు! వాటిని నేను చూసీ చూడనట్లు వదిలేస్తున్నాను. దానికి పరిహారంగా నేను కూడా మీతో పాటు ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొంటున్నాను” అంటూ ఒక ఓఆర్‌ఎస్ ప్యాకెట్ కవర్‌స్టార్ చేతిలో పెట్టాడు!
”ఇదేమిటి! ఇందులో ఏమైనా కల్తీ అయ్యిందా?” అడిగాడు కవర్‌స్టార్.
”లేదు సార్? ఇదేమీ కల్తీ కాలేదు! మీరు దీక్ష విరమించేటప్పుడు తీసుకోవటానికి తీసుకొచ్చాను?” అన్నాడు డ్రగ్ ఇన్‌స్పెక్టర్.
మరొక పెద్దమనిషి వచ్చాడు ”అయ్యా! ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాను. నా పరిధిలోని అనేక స్టార్ హోటల్స్, తినుబండారాలు అమ్మే కార్పోరేట్ కంపెనీలు కల్తీ చేస్తుంటాయి! నేను వాటిని ఏనాడు డిస్ట్రబ్ చేయకుండా నా అఫీసులో నేనుంటాను! ఎప్పుడో ఏడాదికోసారి బయటకు వచ్చి తనిఖీ చేస్తుంటాను!” అంటూ టిఫిన్ బాక్స్ కవర్‌స్టార్ చేతిలో పెట్టాడు.
”ఇదేమిటి? నాకే లంచమిస్తావా? ” అంటూ బాక్స్ విసిరి కొట్టబోయాడు కవర్‌స్టార్.
”సార్ అది లంచం కాదు సార్! మీరు దీక్ష విరమించిన తర్వాత తినడానికి మా ఇంటి నుండి తెచ్చిన అల్పాహారం! నా భార్య చేసింది. కల్తీ ఎంత మాత్రం లేదు సార్!” అన్నాడు ఫుడ్ ఇన్‌స్పెక్టర్.
”ఆ ముక్క ముందే చెప్పాల! ఆ..” అన్నాడు కవర్‌స్టార్.
మరొకడు వచ్చాడు!
”అయ్యా! నేను ఇప్పటివరకు నలుగురి మహిళలపై అత్యాచారం చేశాను!”… అంటూ ఏదో చెప్పబోయాడు!
”ఆగు.. రేపిస్టులకు ఇక్కడ స్థానం లేదు!” అని కవర్ స్టార్ అంటూండగానే కొందరు పూ భక్తులు ఆ రేపిస్టుకు శాలువా కప్పి, పెద్ద గజమాల వేసి కేరింతలు కొడుతూ, కిందికి తీసుకుని పోయారు!
ఒక పారిశ్రామిక వేత్త వచ్చాడు.
”అయ్యా! నాకు ఆరు పరిశ్రమలు ఉన్నాయి! అందులో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు కూడా ఇవ్వను. ఇరవై వేల మంది కార్మికులు నా వద్ద పనిచేస్తున్నారు. ఏ ఒక్క కార్మిక చట్టమూ నేను అమలు చేయటం లేదు! అందుకుగాను పాప పరిహారం కోసం నేను కూడా మీతో పాటు ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొంటున్నాను”! అంటూ దీక్షలో కూర్చున్నాడు.
రోల్స్‌రాయిస్ కారు దిగి ఒక పెద్దాయన వచ్చాడు. ”నేను మన దేశంలోని ప్రముఖ బ్యాంకుల వద్ద డెబ్బయి మూడు వేల కోట్ల రూపాయల అప్పు చేసి పదేండ్లయ్యింది! ఆ అప్పు బ్యాంకులకు తిరిగి చెల్లించ లేదు! అందుకే ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొని పరిహారం చేసుకుందామని వచ్చాను! ఇదిగో ఈ పదివేలు మీకు విరాళం ఇస్తున్నాను”! అంటే చెక్ ఇచ్చాడు.
”అయ్యో రామా! మీరు చెక్ ఇచ్చిన తర్వాత ఇంక ప్రాయశ్చిత్త దీక్ష అవసరమే లేదు! ఎలాగూ మీ బాకీని మొండి కింద జమకట్టి మన పెద్దాయన తప్పక రద్దు చేస్తాడు! నాదీ హామీ! వెళ్లిరండి!” అన్నాడు కవర్‌స్టార్.
రోల్స్ రాయిస్ వెళ్లిపోయింది.
మరో వ్యక్తి వచ్చాడు.
”సార్! మన రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు, పెద్ద బిల్డింగ్స్ కట్టే కాంట్రాక్టర్‌ను. ప్రభుత్వాలు మారినా, మా కాంట్రాక్టు పనులు కొనసాగుతూనే ఉంటాయి! రూ. వంద కోట్ల పనిని రెండు వందల కోట్ల పనిగా మార్చి ప్రజాధనాన్ని కొట్టేస్తాము. ఎవరి కమీషన్లు వారికి ముట్టజెబుతుంటాము! అందుకే మా కాంట్రాక్టర్ల అందరి తరపునా ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొనటానికి వచ్చాను! అన్నట్లు మన దీక్ష చేస్తున్న టెంట్ నేనే వేయించాను!” అన్నాడు కాంట్రాక్టర్.
”నీవే టెంట్ వేయించావా? టెంట్ ఉంటదా లేక ఊడిపోతుందా?” ఆందోళనగా అడిగాడు కవర్‌స్టార్.
”ఇది ప్రజల కోసం చేయలేదు! మన కోసం చేసిన పని పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది! ఆందోళన పడకండి సార్! ” అన్నాడు కాంట్రాక్టర్.
విభిన్న వ్యక్తులు వచ్చి తమ పాపాలకు, తప్పులకు తగిన రీతిలో ప్రాయశ్చిత్తం చేసుకోవటం చూసిన కవర్‌స్టార్ ఉప్పొంగిపోయాడు. తన ప్రాయశ్చిత్త దీక్ష ఇంతమందిని కదిలించినందుకు ఎంతగానో గర్వపడ్డాడు. తప్పులు, పాపాలు చేసినవాళ్లందరూ ఇదే విధంగా ప్రాయశ్చిత్తం చేసుకునేలా ప్రాయశ్చిత్త చట్టం అసెంబ్లీలో చేయాలని నిర్ణయించుకున్నాడు! ఇదే చట్టం పార్లమెంటులో కుడా చేయమని పెద్దాయనకు సలహా ఇవ్వాలని కూడా అనుకున్నాడు! ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు తన భుజం తట్టుకుంటున్న కవర్‌స్టార్‌కి ముగ్గురు తేజోమూర్తులు కనబడ్డారు. తొందర్లోనే వారిని పోల్చుకున్నాడు.
”హేరు సుమన్! ఏంటీ మేకప్ తీయలేదు! అన్నమయ్య పార్ట్-2 లో యాక్ట్ చేస్తున్నావా? వీళ్లిద్దరూ భానుప్రియ, శ్రీకన్య కదూ! వీరు కూడా మేకప్‌లోనే ఉన్నారెందుకు? షూటింగ్ లొకేషన్ ఎక్కడా?” అన్నాడు.
”నాయనా! మేము అన్నమయ్య సినిమా షూటింగ్‌లో నుండి రావటం లేదు! నేను నిజమైన వేంకటేశ్వరుడను! వీరిరువు మదీయ పత్నులు పద్మావతీ దేవి, బీబీ నాంచారీ దేవి!” అన్నారు స్వామి వారు!
”నీవు వేంకటేశ్వరుడవా! కాదు! సీనియర్ ఎన్టీఆర్ పోలికలు లేనే లేవు! కాబట్టి నేను నమ్మను!” అంటూ కవర్‌స్టార్ మెడ మీద చేయి వేసి రుద్దుకున్నాడు.
”నాయనా నీవు నమ్మితే ఎంత? నమ్మకుంటే ఎంత? నేను నిజమైన వేంకటేశ్వరుడనే వారిరువురూ నా దేవేరులే. మేము కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి వెళుతున్నాము” అన్నాడు స్వామి వారు.
కవర్ స్టార్ ఆనందానికి అవధుల్లేవ్! తన ధీక్ష సాక్షాత్తూ స్వామివారినే కదిలించింది! తన పవర్ అలాంటిది మరి!” లడ్డూ కల్తీ అయినందుకు స్వామి వారు కూడా దీక్షకు సిద్దం అయ్యారన్న మాట! అనుకుని ఏదో చెప్పబోయాడు.
”నాయనా లడ్డూ కల్తీ అయినందుకు నేను బాధపడటం లేదు! మీ మెదళ్లు కల్తీ అయినందుకు బాధపడి ప్రయాశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. ఈ సకల చరాచర విశ్వంలో నాకు అందరూ సమానమే! దుష్టరక్షణ, శిష్టశిక్షణ చేస్తున్నారు! నా లడ్డూ కల్తీ అయ్యిందని, మీరు పూర్తిగా నిరూపించలేదు. ఒక వేళ కల్తీ అయిన మాట నిజమే అయితే, కల్తీ నెయ్యి సరఫరా చేసిన వారిని ఇంతవరకూ ఎందుకు శిక్షించలేదు! కనీసం కేసు కూడా పెట్టలేదు కదా! అంటే నా లడ్డూ కల్తీ అయ్యిందని మీరు బాధ పడటం లేదు! కల్తీ పేరు చెప్పి నా భక్తులను రెచ్చగొడుతున్నారు! మీ రాజకీయ లబ్ది కోసం నన్ను వాడుకుంటున్నారు! ఇంతకు ముందు శ్రీరామ చంద్రుని వాడుకుని, కేంద్రంలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది! ఇప్పుడు రాష్ట్రంలో నన్ను వాడుకుం దామని మీరు చూస్తున్నారు! పసిపాప తాగే పాలనుండి అవసాన దశలో ఉన్నవారి గొంతులో పోసే తులసినీరు వరకు సర్వం కల్తీ జరుగుతుంటే మీరు కండ్లు మూసుకుని, లడ్డూ కల్తీ అంటూ అల్లకల్లోలం చేస్తున్నారు! నేనే ఇక్కడి నుండి వెళ్లిపోతున్నాను” అంటూ దేవేరులతో సహా స్వామివారు అంతర్థానమయ్యారు.
– ఉషాకిరణ్