అన్ని రంగాలలో ఆస్కార్‌ గెలుచుకున్న మొదటి చిత్రం

First film to win Oscars in all categoriesఅన్ని దేశాలలోను కొందరు స్త్రీలను మగవారి ఆనందం కోసం అందుబాటులో ఉంచే వ్యవ్యస్థ ఉండేది. ఆ స్త్రీలు గొప్ప సభ్యతా సంస్కారాలను అలవర్చుకుని ఎన్నో కళలలో నిష్ణాతులయి సమాజంలో గౌరవాన్ని పొందేవారు. ఫ్రాన్స్‌ లో అటువంటి ఓ కుటుంబంలో పుట్టిన జిల్బియర్ట్‌ అనే ఓ అమ్మాయి కథ ఈ ‘జిజి’. 1944 లో ఫ్రెంచ్‌ భాషలో కోలెట్‌ అనే రచయిత్రి రాసిన ‘జిజి’ అనే నవల ఆధారంగా ఆ భాషలో 1949 లోనే ఓ సినిమా వచ్చింది. ఈ ఫ్రెంచ్‌ నవలను 1953 లో ఇంగ్లీషులోకి అనువదించిన తరువాత ఈ కథ ఓ మ్యూజికల్‌ స్టేజ్‌ డ్రామాగా ఇంగ్లీషు ప్రజలను అలరించింది. ‘జిజి’ ను బ్రాడ్వే సంస్థ డ్రామాగా మలుస్తూ ప్రధాన పాత్ర కోసం నటులను పరిక్షిస్తున్న సమయంలో రచయిత్రి కోలెట్‌ ఓ హోటల్‌ లో ఆథ్రి హెప్బర్న్‌ ను చూశారు. ఆ పాత్రకు ఆమె కచ్చితాంగా సరిపోతుందని కోలెట్‌ భావించడంతో ఆథ్రీ హెపబర్న్‌ నటనా జీవితం మొదలయింది. తరువాత ఆమె ఓ గొప్ప సినీ నటిగా హాలీవుడ్‌ లో పేరు తెచ్చుకుంది. ఎమ్‌. జీ. ఎమ్‌. సంస్థ ‘జిజి’ ని సినిమాగా తీయాలనుకున్న సమయంలో హెప్బర్న్‌ నే ప్రధాన పాత్రలో నటింపచేయాలని అనుకున్నారు. కాని కొన్ని కారణాల వల్ల లెస్లీ కారాన్‌ ఆ పాత్రకు ఎంపికయ్యారు.
పారిస్‌లో నివసిస్తున్న ధనవంతుడైన గాస్టన్‌ విలాస పురుషుడు. ఇతని మేనమామ కూడా జీవితాన్ని జాలీగా గడిపే రకం. గాస్టన్‌ ఎంతో విలాసంగా అందమైన స్త్రీల మధ్య గడిపుతున్నా అతనికి ఆ జీవితం ఆనందాన్ని ఇవ్వదు. ఎందరో స్త్రీలతో అతను స్నేహం చేస్తాడు. కాని వారికి తన డబ్బు మాత్రమే ముఖ్యం అన్నది ప్రతిసారి అతనికి అర్ధమవుతూ ఉంటుంది. ఆ జీవితం తృప్తినివ్వదు. జీవితం బోరు కొట్టేసి దేనిపై అతనికి ఆసక్తి లేకుండా పోతుంది. ఆ సమయంలోనే తనతో డేటింగ్‌ చేస్తున్న యువతి తోటి స్కేటింగ్‌ టీచర్‌తో సంబంధంలో ఉంది అని అతనికి తెలుస్తుంది. మోసపోయానని అనిపించి ఆమెను నలుగురిలో అవమాన పరుస్తాడు గాస్టన్‌. అందుకని ఆమె ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేస్తుంది. తను అనుసరించే మార్గంలోనే ఏదో తేడా ఉందని అతనికి అనిపిస్తుంది.
పారిస్‌లోనే మాడమ్‌ అల్వారెజ్‌ ఓ అందమైన అపార్ట్‌మెంట్‌లో మనవరాలు జిజితో కలిసి ఉంటుంది. జిజి అసలు పేరు జిల్బియర్ట్‌. అందరూ ఆమెను జిజి అని ముద్దుగా పిలుస్తారు. ఈమె తల్లికి సంగీతం అంటే ప్రాణం. అన్నీ వదిలి తన సంగీత సాధనలో లీనమయిపోతుంది ఆమె. అందుకని మనవరాలి పూర్తి బాధ్యత మాడమ్‌ అల్వారెజ్‌ తీసుకుంటుంది. అల్వారెజ్‌ చెల్లెలు అలీసియా ఒకప్పుడు పారిస్‌ లో ఓ గొప్ప వేశ్య. ఎందరో పురుషులు ఆమెకు దాసులయి అష్ట ఐశ్వర్యాలను ఆమెకు కట్టబెట్టారు. ఆమె గొప్ప ఇంట్లో నౌకర్ల మధ్య విలాసంగా జీవిస్తూ ఉంటుంది. వయసయి పోయినా ఆమె అంతకు ముందు సంపాదించిన ధనంతో గొప్పగా జీవిస్తుంటుంది. కుటుంబ వారసత్వంగా జిజి ని వృత్తిలోకి దింపాలని ఆమెకు శిక్షణ ఇస్తూ ఉంటుంది అలీసెయా. అందులో భాగంగా భాషా, సంభాషణలు, పనులు, సింగారించుకునే కళ, వడ్డించే కళ ఇలా ఎన్నో విషయాలకు సంబంధించి జీజి కి తర్ఫీదు ఇస్తూ ఉంటుంది అలీసెయా.
జిజి స్వభావరీత్యా స్వేచ్ఛాప్రియత్వం ఉన్న అమ్మాయి. ఇంకా పదహారు ఏళ్ళు కూడా నిండని ఆమె పసిదానివలే ప్రవర్తిస్తూ ఉంటుంది. గట్టిగా మాట్లాడడం, నోరారా నవ్వడం, ఇష్టమైనట్లు తిరగడం పరుగెత్తడం ఆమె నైజం. కాని అమ్మమ్మల కోసం ఆ కఠినమైన శిక్షణ తీసుకుంటూ ఉంటుంది. అందులో జీజి కి ఎటువంటి ఆనందం కలగదు. వీరి ఇంటికి గాస్టన్‌ వస్తూ ఉంటాడు. అతనితో ఏ మాత్రం మొహమాటం లేకుండా తనకు నచ్చినట్లుగా ఉంటుంది జిజి.
అతి అలంకరణ, తెచ్చి పెట్టుకున్న సంస్కారంతో ప్రవర్తించే పర్ఫెక్ట్‌ సొసైటీ స్త్రీలతో తిరిగి తిరిగి విసుగెత్తి ఉన్న గాస్టన్‌ జిజి ఇంటికి వచ్చినప్పుడు ఆమె చేసే అల్లరిని, ఏ హంగూ ఆర్భాటాలు ప్రదర్శించకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ ప్రవర్తించే జిజి అమాయకత్వాన్ని ఆస్వాదిస్తాడు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంటుంది. కాని సుమారు పదిహేనేళ్ళ వయసు తేడా కూడా ఇద్దరి మధ్య ఉండడంతో జిజి పై ఓ రకమైన అధికారాన్నీ కూడా చూపిస్తూ ఆమెతో ఆనందంగా సమయం గడుపుతూ ఉంటాడు గాస్టన్‌. జిజి కూడా ఓ పెద్ద అన్న, అంకుల్‌ తో ఉన్నంత చనువుగా, అతనితో ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇద్దరూ ఒకరి సాంగత్యంలో మరొకరు తమ సామాజిక మర్యాదలు, మన్ననలు వదిలేసి స్వేచ్ఛగా గడపడాన్ని ఇష్టపడతారు.
గాస్టన్‌ ప్రేయసి ఆత్మహత్య ప్రయత్నం తరువాత పారిస్‌ వదిలి వెళ్లిపోదాం అనుకుంటాడు. కాని అలా వెళ్లిపోవడం మగజాతికి అవమానం అంటూ అలాంటప్పుడు ఇంకా విలాసవంతమైన పార్టీలను ఇస్తూ, వెళుతూ అమ్మాయిల మధ్య గడపడం మర్యాదస్తుల పని అని మేనమామ గాస్టన్‌ను పార్టీలకు తిప్పుతుంటాడు. అన్ని పార్టీలలోను ఒకే రకంగా కనిపించే మనుషులు, వారి నటన, ఒకే రకమైన మాటలూ గాస్టన్‌ వినీవినీ వెర్రెక్కిపోతాడు. అతనికి జిజి తో గడిపే సమయం ఒక్కటే ఆనందాన్నిస్తుంది. ఓ రోజు జిజి తో పేకాటకి కూర్చుంటాడు గాస్టన్‌. తాను ఆ ఆటలో గాస్టన్‌ ను ఓడిస్తే అతను తనను, అమ్మమ్మను కూడా పిక్నిక్‌ కు పక్క ఊరికి తీసుకెళ్ళాలంటుంది జిజి. గాస్టన్‌ ఒప్పుకుంటాడు. జిజి అతన్ని ఉపాయంతో ఓడిస్తుంది. ఈ ఓటమిని ఇష్టపడుతూనే వీరిద్దరినీ విహారయాత్రకు తీసుకువెళ్తాడు గాస్టన్‌. జిజి తో అక్కడ గడిపిన సమయం అతనికి చాలా బావుంటుంది. ఏ భయం సంకోచం లేకుండా స్వేచ్చగా ఉండడంలోని ఆనందాన్ని అనుభవిస్తాడు అతను.
ఇది తెలిసిన అలీసియా జిజి ని గాస్టన్‌ ప్రియురాలిగా మార్చాలని నిర్ణయించుకుంటుంది. మాడమ్‌ అల్వారెజ్‌ కూడా అప్పుడు ఆ కోణంలో ఆలోచించడం మొదలెడుతుంది. ఎవరో ఒకరితో అలాంటి జీవితం తనకు తప్పదని తెలిసిన జిజి కూడా దీనికి ఒప్పుకుంటుంది. పక్క ఊరికి గాస్టన్‌ వెళ్లిన సమయంలో అతని ఉన్నత వర్గపు జీవితానికి నప్పే విధంగా జిజి ఎలా తనను తాను మలచుకోవాలో అలీసియా ఆమెకు కఠినమైన శిక్షణ ద్వారా నేర్పిస్తుంది. జిజి తన బాల్యాన్ని కోల్పోయి యవ్వనవతిగానూ ఓ సొసైటీ స్త్రీగానూ రూపాంతరం చెందుతుంది.
ఊరి నుండి వచ్చిన గాస్టన్‌ తన మామూలు దుస్తులకు బదులుగా జిజి సొసైటీ స్త్రీల గౌన్‌ లో కనిపించేసరికి చిరాకు పడతాడు. ఆ గౌను అసలేం బాలేదని జిజి ని అవమానిస్తాడు. జిజి కి కోపం వచ్చి గాస్టన్‌ కు బట్టల పట్ల కనీస అవగాహన లేదని అతనిపైన విరుచుకుపడుతుంది. కోపంతో ఆ ఇంటి నుండి బైటికి వెళ్లిపోతాడు గాస్టన్‌. కాని ఎక్కువసెపు జిజి కి దూరంగా ఉండలేకపోతాడు. తాను అనవసరంగా ఆమెను కోప్పడ్డానని అనుకుని క్షమాపణ అడగడానికి తిరిగి వస్తాడు. ఆమెను టీ కి తీసుకెళ్లాలని అనుకుంటే మొదటిసారి మాడమ్‌ అల్వారెజ్‌ వారిద్దరూ కలిసి బైట తిరగడాన్ని ఒప్పుకోదు. జిజి గాస్టన్‌ తో కలిసి కనిపిస్తే ఆమె పేరు పాడవుతుందని అందుకని జిజి అతనితో అన్ని చోట్లకు వెళ్లకూడదని అంక్షలు పెడుతుంది. ఇది గాస్టన్‌ కు ఇంకా కోపాన్ని తెప్పిస్తుంది. తాను ఎప్పుడంటే అప్పుడు వచ్చి కలిసిన పిల్ల ఇప్పుడు పెద్దవారి దుస్తులు వేసుకోగానే తనకు దూరంగా ఉండాలనే ఆంక్షలేంటని అతను వెళ్లిపోతాడు.
గాస్టన్‌ కు క్రమంగా తాను జిజి ని ప్రేమిస్తున్నానని అర్ధం అవుతుంది. ఆమె తనకన్నా ఎంతో చిన్నదయినా ఆమె పట్ల తనకు ప్రత్యేకమైన ఆకర్షణ ఉందని గుర్తిస్తాడు. ఆమెతో కలిసి ఉండాలనే కోరిక కలుగుతుంది. అందుకే మాడం అల్వారెజ్‌ అలీసియాలతో ఆమెను తాను ప్రియురాలిగా స్వీకరించాలనుకుంటున్నానని అడుగుతాడు. జిజి కుటుంబ సాంప్రదాయం ప్రకారం అలా వివాహంతో సంబంధం లేకుండా ఓ ధనికుడి పంచన చేరడానికే ఆమెకు తర్ఫీదు ఇవ్వబడుతుంది. ఎంతో పరిచయం ఉన్న గాస్టన్‌ జీవితంలో ఆమె భాగం కావడం ఆ పెద్దవారిద్దరికీ సంతోషకరమైన వార్త. కాని ఈ ప్రతిపాదనను జిజి తిరస్కరిస్తుంది. తాను అదో గొప్ప స్టేటస్‌ అని అనుకోవట్లేదని, కొన్నాళ్లు కలిసి ఉండి తరువాత మరో మగాడి చెంతకు చేరడం కోసం గాస్టన్‌ ప్రియురాలిగా తాను మారలేనని ఆ తాత్కాలిక పదవి తనకు వద్దని అంటుంది. దానికన్నా తమ మధ్య స్నేహం, ప్రేమ ఇలాగే ఏ సంబంధం లోకి మారకుండా నిలిచి ఉండడం తనకిష్టం అని చెబుతుంది. గాస్టన్‌ తాను ఆమెను ప్రేమిస్తున్నాన్ని చెప్తాడు. కాని ప్రేమ ఇలాంటి తాత్కాలిక సంబంధాలను కోరుకోదని జిజి బదులిస్తుంది. గాస్టన్‌ నిరాశతో వెళ్ళిపోతాడు.
గాస్టన్‌ తన దగ్గరకు రాకపోవడంతో అతను లేని లోటు జిజి అనుభవిస్తుంది. అతన్ని వదిలి ఉండలేనని ఆమెకు అర్ధం అవుతుంది. అందుకని గాస్టన్‌ని ఉత్తరం రాసి పిలిపిస్తుంది. అతను లేని జీవితంలో బాధపడుతూ ఉండలేనని, ఆ స్థితి చాలా ఘోరంగా ఉందని అందుకే అతనితో తాత్కాలిక సంబంధానికయినా సరే తాను ఒప్పుకుంటున్నానని, అతనితో కలిసి ఉండడం లోనే తనకు ఆనందం అని అర్ధం చేసుకున్నానని చెబుతుంది.
గాస్టన్‌ జిజి ని తన ప్రియురాలి హోదాలో, ఓ హై సొసైటీ పార్టీకి తీసుకెళతాడు. తన సామాజిక హోదాను ఇలాంటి ప్రదర్శనలతో పెంచుకునే వ్యవస్థలో జీవిస్తున్న గాస్టన్‌ చాలా గొప్పగా జిజి ని తనతో తీసుకువెళతాడు. అక్కడ జిజి అచ్చంగా ఓ హై క్లాస్‌ సొసైటీ స్త్రీగా అతి మర్యాదతతో ప్రవర్తిస్తుంది. ఆమె తాను ఇన్నాళ్లు తిరిగిన స్త్రీలవలే మారిపోయిందని, తాను ప్రేమించిన ఆ స్వేచ్ఛాప్రియత్వం ఉన్న సాధారణ జిజి ఈమె కాదని గాస్టన్‌ కి అనిపిస్తుంది. జిజి తాను అన్నాళ్ళుగా తీసుకున్న శిక్షణా సారాన్ని గాస్టన్‌ ను సంతోషపెట్టడానికి అతి నైపుణ్యంతో ప్రదర్శిస్తుంది. అందరూ ఆమెను చూసి మెచ్చుకుంటారు. గాస్టన్‌ అదృష్టానికి ఈర్ష్య పడతారు. అదే పార్టీలో ఉన్న గాస్టన్‌ మేనమాన తన మేనల్లుడు ఇక కొన్ని నెలలు ఆనంద సాగరంలో ఊయలూగుతాడని సంతోషిస్తాడు. ఇలాంటి సంబంధాలు నిలిచేది కొన్ని నెలలే అని అతనికి అనుభవపూర్వకంగా తెలుసు.
కాని జిజి ని అలా సొసైటీ స్త్రీగా గాస్టన్‌ చూడలేకపోతాడు. జిజి పై ఉన్న ప్రేమ అతనికి అర్ధం అవుతుంది. ఆమెలోని సహజత్వాన్ని చంపేసి ఆమె అస్థిత్వాన్నే మాయం చేసే స్థితికి తాను ఆమెను తీసుకురావడం తప్పని అతనికి అనిపిస్తుంది. అందుకే అసహనంతో ఆ పార్టీ నుండి జిజి తో వచ్చేస్తాడు. తానేం తప్పు చేశానో ఎందుకు అర్ధాంతరంగా ఇంటికి గాస్టన్‌ లాక్కుపోతున్నాడో జిజి కి అర్ధం కాదు. ఇల్లు చేరిన తరువాత గాస్టన్‌ జిజి ని వివాహం చేసుకోదలిచానని మాడం అల్వారెజ్‌ అనుమతి కోరి ఆమెను ఆశ్చర్యపరుస్తాడు.
సినిమా ఆఖరున జంటగా గాస్టన్‌ జిజి లు కలిసి వెళుతుండగా వారిని ఆనందంగా చూస్తూ వారి మేనమామ సంతోషిస్తూ కనిపిస్తాడు.
ఈ సినిమా కథ పట్ల చాలామంది ఆధునికి స్త్రీ వాదులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వారి వాదనలో కొంత వాస్తవం ఉన్నమాట నిజం. పద్దెనిమిదేళ్ళు కూడా నిండని ఓ అమ్మాయి తన కన్నా పెద్ద వ్యక్తితో చనువుగా ఉండడం, అది ప్రేమగా మారడం, మారిన విధానం ఒక విషయం అయితే, ఆమెను వృత్తిలోకి దింపాలని ఎంతో నైపుణ్యంతో శిక్షణ ఇవ్వడం, దానికి ఆమె ఒప్పుకుని తనను మార్చుకోవడం అందరూ ఆమోదించలేని మరో విషయం. జిజి పాత్రలో తన జీవితం పట్ల స్పష్టత లేకపోవడం, అన్నిటికి ఆమోదాన్ని తెలుపుతూ జీవించడం, పైగా దీన్ని అందంగానూ సౌకర్యవంతమైన జీవనంగానూ చూపడం అందరికీ మింగుడు పడని విషయం.
అయితే చివరకు తన ధనిక సమాజంలోని జీవితం, సొసైటీ స్త్రీలలోని అసహజత్వం తమకు నప్పవని తెలుసుకుని ఆ మూసల నుండి బైటపడి తమకు తాములా మిగిలిన ఆ జంట నిర్ణయం ఒక్కటే ఈ కథను ప్రామాణికం చేస్తుంది. అసహజంగా బతకడంలో ఆనందం ఉండదనే సందేశంతో సినిమా పూర్తి కావడం కొంత సంతృప్తిని ఇస్తుంది.
ఆ రోజుల్లో మ్యూజికల్‌ సినిమాల హవా నడిచేది. వాటిని విశేషమైన ఆదరణ ఉండేది. ఈ సినిమాకు వాడిన కాస్టూమ్స్‌ చూడడం మరో చక్కని అనుభవం. పందొమ్మిదవ శతాబ్దపు ప్రారంభంలోని పారిస్‌ అందాలను, అప్పటి ధనిక సమాజంలోని వేషభాషలు, వారి డాంబికాలతో పాటు వారి జీవన విధానంలోని సొగసుని ఈ చిత్రం గొప్పగా చూపిస్తుంది. తొమ్మిది విభాగాలలో ఆస్కార్‌ కు నామినేట్‌ అయి అన్నిటిలోనూ బహుమతులు గెలుచుకున్న మొదటి ఉత్తమ చిత్రంగా రికార్డు ఈ సినిమా సొంతం.
సినిమాలో ఎక్కువ పాటలు గాస్టన్‌ మేనమామ లాషెల్‌ పాత్రలో నటించిన మారిస్‌ షెవాలియర్‌ పై చిత్రించారు. అవన్నీ అప్పట్లో హిట్‌ పాటలుగా నిలిచాయి. ఈ సినిమాలో నటించేటప్పటికే అతను సినీ ప్రపంచంలో ఎన్నో హిట్‌ చిత్రాలతో స్టార్‌ ఇమేజ్‌ సంపాదించుకున్నారు. కాని ఈ సినిమాలో ఆయన పాటలు, నటనతో ఎంతగా ప్రజాదరణను పొందారంటే, అప్పటి దాకా సినీ రంగానికి చేసిన సేవకు ఆయనకు ‘అకాడమీ గౌరవ అవార్డ్‌’ ఇచ్చి సినీ ప్రపంచం సత్కరించవలసి వచ్చింది. కమ్యునిస్ట్‌ పక్షపాతిగా ముద్ర వేసి అతన్ని దూరం పెట్టిన అమెరికా సినీలోకం ఈ సినిమా తరువాత ఇతనికున్న ప్రేక్షకాభిమానానికి తల వంచింది.

– పి.జ్యోతి, 98853 84740