కామ్రేడ్‌ ఏచూరి ఎగిరే ఎర్రజెండా!

Comrade Yechuri is a flying red flag!ఎర్రజెండా! తన బిడ్డను కౌగిలించుకొని
తనలో సంలీనం చేసుకుని మరింత ఎరుపెక్కింది
నిన్నటిదాకా ఎర్రజెండా తన బిడ్డ చేతిలో
దిగ్దిగంతాలకు ఎగిరింది
శతవసంతాల కాంతులెదజల్లుతూ పడి లేస్తూ
విప్లవోన్ముఖంగా అడుగులేస్తూనే ఉంది.
ఒక్కసారిగా కన్నీరు కారుస్తూ.. ఎర్రజెండా
పోరు బిడ్డను అందనంత ఎత్తులోకెత్తుకొని
ఆకాశానపొత్తిళ్లలో మోస్తు
పోరు నినాదపు ప్రళయ ప్రపంచమయమైంది
యవ్వనప్రాయం నుండి అవాంతరాలదగమిస్తూ
ఏటికి ఎదురీదుతూ ఎరుపై మెరుపై జన హోరై
శ్రామికుల చేతి కత్తై సుత్తై కడదాక నిలిచిన
కష్టాల కన్నీళ్ళ కమనీయ దశ్యాలను
తనలో ఇముడ్చుకుంది రుధిర సంకేత అరుణార్నవం
పడమటి గాలులు ప్రచండంగా వీచినా
అష్ట బహువులతో ఆక్టోపస్‌ దాడులతో
అష్ట దిక్కులు దిగ్బంధం చేసినా
అదరక బెదరక సాగుతున్న సమరపు పిలుపై
చిరునవ్వుతో శత్రువును గేలిచేసీ…
విప్లవ వీచికలెదజల్లిన
కమ్యూనిస్టు ఉద్యమ మేధో వికాసమా
నీకు మరణం లేదు
అమరం నీ త్యాగం.
ఓ ఆదర్శ కమ్యూనిస్టా!
అంతిమగా మీ దేహాన్ని
ఢిల్లీ ఎయిమ్స్‌ కందించి
వైద్య విద్యార్థి లోకానికి
శాస్త్రీయతనందించే వెలుగైన
ఆదర్శనీయ అమరత్వం మీది
నిత్యం వేగుచుక్కై వెలుతురులీనుతూ కర్తవ్య బోధన చేస్తూ
ఉద్యమ ప్రతి అడుగున
దిక్కులేనోళ్లకు
దిక్కు చూపే
పోరుకేతనమై దిక్సూచిగా నిలుస్తావ్‌
అందుకే…
మార్క్సిస్టు దారిలో
నీ జీవితం చిరస్మరణీయం కామ్రేడ్‌
చిరస్మరణీయం
మీ ఆశయం నిరంతరం సజీవమే కామ్రేడ్‌
సజీవమే…..
– శీలం స్వామి, 7337292162